Monday 4 November 2024

శ్రీ గరుడ పురాణము (315)

 


తరువాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగరతీరాన్ని చేరుకొని నలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించి ఆవలి ఒడ్డును చేరుకొని అక్కడి సువేల పర్వతం పై విడిది చేసి అక్కడినుండి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు.


తరువాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో, ధూమ్రాక్ష, వీరేంద్ర, ఋక్షపతి జాంబవంతాది ముఖ్య వీరులతో, సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రములతో కలసి రామలక్ష్మణులు లంకా సైన్యమును సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండలవల నున్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడ వణకించిన, బలవీరపరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిహ్వ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాథులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య శస్త్రాస్త్ర విద్యా నైపుణి మీరగా యమపురికి పంపించారు.


చివరగా శ్రీరాముడు ద్వంద్వయుద్ధంలో లోకకంటకుడైన రావణుని సంహరించాడు. తరువాత సీత పాతివ్రత్యాన్ని అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలివచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలను వలె చూసుకున్నాడు. పది అశ్వమేధయాగాలు చేసి, గయతీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు.


ఏకాదశ సహస్రాణి

రామో రాజ్యమ కారయత్ |


(ఆచార ... 143/50)


రామునికి తగిన పత్నిగా కొన్నిచోట్ల ఆయనకన్న గొప్ప శీల స్వభావాన్ని కనబఱచిన మహాదేవిగా సీత ఈనాటికీ పతివ్రతా తిలకంగా లోకులచేత పూజలందుకుంటోంది.


భరతుడు శైలూష నామకుడు, లోక కంటకుడునైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు.


తరువాత ఈ నలుగురు సోదరులూ అగస్త్యాది మునుల తపోవనాలకుపోయి వారిని తృప్తిగా సేవించుకొని వారి ద్వారా ధర్మాలనూ, రాక్షస చరిత్రలనూ తెలుసుకొని, తమ వారసులను కూడా తమంత వారినిగా చేసి అవతారం చాలించారు. (అధ్యాయం - 143)

Sunday 3 November 2024

శ్రీ గరుడ పురాణము (314)

 


రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా వుంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను, నేలపై బడినంత మేర, వెతుకుతూ పోగా వానిచే నేలకూల్చబడిన జటాయువు కొన వూపిరి మీద వుండి కనిపించాడు. అతడు సీత నెవరో దానవుడపహరించి దక్షిణదిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణదిశవైపు సీతను వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానలకాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు.


వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానరయోధులను సీతను వెదకుటకై నలుదిశలకూ పంపించాడు. దక్షిణ దిశవైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్ళారు. చివరికి సాగరతీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయనీ తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్య సాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవల గల లంకలో సీత రావణుని చెఱలో వున్నదని చెప్పాడు.


కపి శ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో వున్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సమ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీత దేనికీ లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరునీ గడ్డిపోచకన్న హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు.


నోటికి వచ్చిన దెల్ల పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తయై నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుటపడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమె కిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు.


సీత నిలచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా వుంచి మిగతా అశోక వనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. (అదీ బ్రహ్మదేవుని కిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకే) రావణుని కొలువులో ఏమాత్రమూ భయపడకుండా అతనికెదురుగా నిలచి సీతమ్మను సాదరంగా గొనిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యమును పాటింపకపోగా పరమ కుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పటించి చంపాలనుకున్నాడు. కాని మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్ని తోనే లంకకు నిప్పంటించి మరల జలధిని లంఘించి రాముని పాదాల కడ వాలిపోయాడు. (ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు) సీత చూడామణిని రామునికి సమర్పించాడు.

Saturday 2 November 2024

శ్రీ గరుడ పురాణము (313)

 


భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. (అనుబంధం -13లో చూడండి) కైక దీని కంగీకరింపకపోగా తనకాయన ఇచ్చిన వరాలను ఇపుడు కోరుకుంది. రాముని పదునాలుగేడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవులవైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడు విడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట నంటి వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు.


అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుథాజిత్తు నింటినుండి మరలి వచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు కాని రాముడు రాలేదు. అపుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకుని తాను కూడ వనవాసిలాగే జీవిస్తూ రాజ్యవ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ వుండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నందిగ్రామంలోనే వుండిపోయాడు.


శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకొని దండ కారణ్యంలో పర్ణశాలను నిర్మించుకుని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకియైన శూర్పణఖయను రాక్షసి రాగా శ్రీరాముడామె ముక్కుచెవులను కోయించాడు. ఆమె గొల్లున యేడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది పదునాలుగు వేల మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసికొల్పింది. వారంతా పెల్లున గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కాని రామబాగాగ్ని శిఖల్లో శలభాల్లాగ మాడి పోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన యన్నయు, లంకేశ్వరుడు నైన రావణాసురునికి తన బడ్డ పన్నములనూ, ఖరదూషణాదులను మృతినీ విలపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాని కొడిగట్టాడు. ముందుగా మాయలమారి మారీచుడు బంగారు లేడిగా మారి సీతనా కర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు కాని కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమబాధాకరంగా 'హా సీతా హా లక్ష్మణా' అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు గొనిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేలకూల్చాడు.


Friday 1 November 2024

శ్రీ గరుడ పురాణము (312)

 


దారిలో నొక కూడలిలో తపస్వీ, మహాత్ముడూనైన మార్కండేయ మహర్షి* కొరతవేయబడివున్నాడు (ఆ పతివ్రత పేరు సుమతి. ఆ మహామునిపేరు మిగతా అన్ని చోట్లా మాండవ్యుడనే వుంది). ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహవేదన తెలియకుండా సమాధిగతుడై వున్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్ళడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడనీ, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడనీ తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమనీ, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనేకూడదనీ శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్యమహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడుదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది.


భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే వుంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్నియైన అనసూయను ప్రార్ధించుమని సూచించాడు. మహాతపస్వినియైన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా.


(అధ్యాయం -142)


రామాయణకథ


రామాయణానికే సీతా చరితమనే పేరు కూడా వుంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలూ నశిస్తాయి.


భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వతమనువు, ఇక్ష్వాకువు ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసు కదా! ఆయనకు మహా బలవంతులు పరాక్రమశాలురునైన రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నోము ఫలములై కలిగారు.


శ్రీరాముడు విష్ణువేనని చెప్తారు. హరి అవతారాలలో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవజాతికి, కుటుంబవ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలచినది శ్రీరామావతారము. వసిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వవిద్యా విశారదుని, సకలకళావల్లభుని గావించారు. ఆయన కన్న గొప్పవీరుడు కాని ఆయనతో సమానుడైన వీరుడు గాని చరిత్రలో లేరు.


విశ్వామిత్రుని యాగమును కాచుటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడూ అప్పుడే చావాలి కాని అలా కాకపోవడం దైవసంకల్పం. జనకునింట నున్న శివధనువును విఱచి సీతను చేపట్టి కళ్యాణ రాముడైన శ్రీరాముడు లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శత్రుఘ్న- శ్రుతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలలో, ప్రజలతో కలిసి కలయ దిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడ స్నేహం చేసి అందరి మనసులలోనూ ఆదర్శ క్షత్రియపుత్రునిగా నిలిచాడు.