Sunday, 17 November 2024

శ్రీ గరుడ పురాణము (322)

 


తరువాత భీష్మ ద్రోణుల ప్రోద్భలం వల్ల, విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్నిచ్చేశాడు. వారు ఇంద్ర ప్రస్థమనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకొని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు.


వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణసోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నంది ఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాలలో శ్రేష్ఠతమమైనదిగా పేరు గాంచిన గాండీవమను ధనుస్సునూ, అవినాశములైన బాణములనూ, అభేద్య దివ్య కవచాన్నీ ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశ- దేశాంతరాలలో దిగ్విజయయాత్రను చేసి అసంఖ్యాకములుగా యుద్ధాలను చేసి అనేకులైన రాజులనోడించి వారి నుండి కప్పములుగా గొన్న కొండలంతేసి రత్నరాశులను అర్జునుడు తన అన్నయుధిష్ఠిరునకు (ధర్మరాజుకి) సమర్పించాడు.


పాండవుల మొత్తం శ్రీని అపహరించడానికి శకుని ధర్మరాజుని ద్యూతక్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయచేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా పన్నెండేళ్ళు వనవాసమూ, ఒక యేడు అజ్ఞాత వాసమూ చేయవలసి వచ్చింది. కుంజరయూధము దోమకుత్తుక జొచ్చినట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తిచేశారు.


అజ్ఞాతవాస కాలంలో పాండవులలో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ పన్నెండేళ్ళు వనవాసమూ ఒక యేడు అజ్ఞాతవాసమూ చేయాలనే నియమం పెట్టారు. కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నం చేసిన దుష్టచతుష్టయానికి అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో వున్నారేమోననే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడిచేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్రవిక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవసేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివివచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందలిరోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించు కుపోయారు గురువులు.


జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు. కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలనీ అలాకాని పక్షంలో కనీసం అయిదూళ్ళయినా ఇమ్మని పాండవులు శ్రీకృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూదిమోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతోబాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధమూ, బంధునాశమూ తప్పలేదు. (ముసలిరాజుకి అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకొచ్చింది)


(అయిదువేల యేళ్ళ క్రిందట)


ఆ ముందుగానీ ఆ తరువాత గానీ ఏ ఒక్కజాతీ కనీవినీ యెఱుగని మహాయుద్ధం కౌరవపాండవుల బాహ్యనాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున ఏడు అక్షౌహిణుల సైన్యమూ, కౌరవులవైపున పదకొండ క్షౌహిణుల సైన్యమూ ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. ధృష్టద్యుమ్నుని పాండవులూ భీష్ముని కౌరవులూ తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు కానీ కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది.


(ఈ క్రింది పేరా గరుడపురాణానికే ప్రత్యేకం....)


పాండవ సేనాపతిగా శిఖండీ, కౌరవసేనాపతిగా భీష్ముడూ యుద్ధాన్ని ప్రారంభించారు. రెండు సేనల మధ్యా అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా పదిరోజులపాటు జరిగింది. పదవరోజు శిఖండి, అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తన తనువును భేదించడంతో భీష్ముడు నేలకొరిగాడు. 


* (శిఖండి అని గరుడ పురాణంలో వుంది)

No comments:

Post a Comment