Saturday 2 November 2024

శ్రీ గరుడ పురాణము (313)

 


భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. (అనుబంధం -13లో చూడండి) కైక దీని కంగీకరింపకపోగా తనకాయన ఇచ్చిన వరాలను ఇపుడు కోరుకుంది. రాముని పదునాలుగేడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవులవైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడు విడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట నంటి వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు.


అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుథాజిత్తు నింటినుండి మరలి వచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు కాని రాముడు రాలేదు. అపుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకుని తాను కూడ వనవాసిలాగే జీవిస్తూ రాజ్యవ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ వుండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నందిగ్రామంలోనే వుండిపోయాడు.


శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకొని దండ కారణ్యంలో పర్ణశాలను నిర్మించుకుని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకియైన శూర్పణఖయను రాక్షసి రాగా శ్రీరాముడామె ముక్కుచెవులను కోయించాడు. ఆమె గొల్లున యేడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది పదునాలుగు వేల మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసికొల్పింది. వారంతా పెల్లున గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కాని రామబాగాగ్ని శిఖల్లో శలభాల్లాగ మాడి పోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన యన్నయు, లంకేశ్వరుడు నైన రావణాసురునికి తన బడ్డ పన్నములనూ, ఖరదూషణాదులను మృతినీ విలపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాని కొడిగట్టాడు. ముందుగా మాయలమారి మారీచుడు బంగారు లేడిగా మారి సీతనా కర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు కాని కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమబాధాకరంగా 'హా సీతా హా లక్ష్మణా' అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు గొనిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేలకూల్చాడు.


No comments:

Post a Comment