Saturday, 16 November 2024

శ్రీ గరుడ పురాణము (321)

 


శ్రీకృష్ణుడు నూట పాతిక సంవత్సరాలు ఈ పుడమిపై జీవించాడు. అన్నేళ్ళలో ఏ ఒక్క నిముషమూ కూడ తన కోసం తాను బ్రతకలేదు. ఆయన వైకుంఠానికేగిన పిమ్మట అనిరుద్ధపుత్రుడైన వజ్రుడు ఈ వంశాన్ని నిలబెట్టాడు.


అన్నిటికన్నా గొప్ప విశేషం శ్రీకృష్ణుడిచ్చిన గురుదక్షిణ ఇక లేడనుకున్న సాందీపని పుత్రుని సముద్రశోధనం, రాక్షస సంహారం గావించి వెనక్కి తెచ్చాడు. (అధ్యాయం -144)


మహాభారతం - బుద్ధాది అవతారాలు


భూభారాన్ని తగ్గించడానికీ వీలైనంత ఎక్కువమంది దుష్టుల్ని సంహరింప డానికీ భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం.


విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను (అనగా బ్రహ్మ) పుట్టాను కదా! నానుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవియను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు అతనికి యయాతి అను కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడునగు దేవవ్రతుడు జనించాడు. ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞను చేసి బ్రహ్మచారిగానే చివరిదాకా జీవించి రాజ్య సింహాసనాన్ని కూడా తండ్రిగారి రెండవ పెళ్ళి ముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరువొంది ఈ లోకం అత్యంతాదరంతో భీష్ముడని పిలుచుకొంది.


శంతనునికి భీష్ముని దయ వల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరుగల గంధర్వునితోడి యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుని కోసం భీష్ముడు కాశీరాజ పుత్రికలైన అంబికను అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు.


అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాస దేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడళ్ళను పుత్రవతులను చేయించింది. అంబికకు ధ్రుతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పనుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా నూరుగురు కొడుకులు, ఒక కూతురు కలుగగా పాండురాజునకు కుంతి ద్వారా యుధిష్ఠిర భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులనీ కుంతీ మాద్రుల కొడుకులను పాండవులనీ లోకం పిలుచుకోసాగింది. ఈ నూటైదుగురు వంశాంకురాలూ మహాబలశాలులే గాని గాంధారి పెద్దకొడుకైన సుయోధనుడు, పాండవులూ సాహస పరాక్రమాలూ కూడా వుండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు.


దైవవశాత్తూ కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులనెన్నో బాధలకు గురిచేశాడు. లక్కయింటిని వారికి విడిదిగా చూపించి దానిని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగమార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడను వదిలించాడు. అక్కడినుండి పాంచాల దేశానికి వెళ్ళి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు పాండవులు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్నియైనది. 

No comments:

Post a Comment