Sunday 3 November 2024

శ్రీ గరుడ పురాణము (314)

 


రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా వుంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను, నేలపై బడినంత మేర, వెతుకుతూ పోగా వానిచే నేలకూల్చబడిన జటాయువు కొన వూపిరి మీద వుండి కనిపించాడు. అతడు సీత నెవరో దానవుడపహరించి దక్షిణదిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణదిశవైపు సీతను వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానలకాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు.


వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానరయోధులను సీతను వెదకుటకై నలుదిశలకూ పంపించాడు. దక్షిణ దిశవైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్ళారు. చివరికి సాగరతీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయనీ తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్య సాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవల గల లంకలో సీత రావణుని చెఱలో వున్నదని చెప్పాడు.


కపి శ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో వున్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సమ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీత దేనికీ లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరునీ గడ్డిపోచకన్న హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు.


నోటికి వచ్చిన దెల్ల పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తయై నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుటపడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమె కిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు.


సీత నిలచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా వుంచి మిగతా అశోక వనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. (అదీ బ్రహ్మదేవుని కిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకే) రావణుని కొలువులో ఏమాత్రమూ భయపడకుండా అతనికెదురుగా నిలచి సీతమ్మను సాదరంగా గొనిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యమును పాటింపకపోగా పరమ కుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పటించి చంపాలనుకున్నాడు. కాని మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్ని తోనే లంకకు నిప్పంటించి మరల జలధిని లంఘించి రాముని పాదాల కడ వాలిపోయాడు. (ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు) సీత చూడామణిని రామునికి సమర్పించాడు.

No comments:

Post a Comment