హరివంశ వర్ణన (శ్రీకృష్ణకథ)
భగవానుడైన శ్రీకృష్ణుని మాహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్ఠతమంగా నిలచిన హరివంశాన్నొకమారు తలచుకుందాం.
పృథ్విపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వవైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తరువాత శకటాసురుని తన చిరుకాలి తాపుతో మట్టు బెట్టాడు. బోటి నీడ్చుకుంటూ పోయి మద్దిచెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవగణాలన్నీ విస్మయపడగా నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచనాన్ని కలిగించాడు. కాళింది మడుగున విషమును కలిపే కాళియ నాగుని తలలపై తాండవమాడి గోకులవాసుల కాతని పీడ విరగడజేశాడు. గోవర్ధన గిరినెత్తి ఇంద్రుని బారిన పడిన ప్రాణులను రక్షించి ఇంద్రునికి గర్వభంగం చేశాడు. ఇలా శ్రీకృష్ణ లీలలెన్నో విశ్వవిఖ్యాతమై యున్నవి. వాటిని తెలియని వారుండరు. తాను స్వయంగా అరిష్టాసుర కేశి (కంస) చాణూరాది బలశాలురైన దైత్యులను సంహరించుటయే గాక పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకు మరణశాసనాన్ని వ్రాసి భూభారాన్ని తగ్గించాడు.
పురాకృత సుకృతాల వల్లనో, వరదానాల ఫలరూపంగానో రుక్మిణీ, సత్యభామాది ఎనమండుగురు రమణీలలామలూ, నరకాసురునిచే చెఱపట్టబడిన పదహారుమంది క్షత్రియ కన్యలూ శ్రీకృష్ణుని భార్యలైనారు. ఆయన ద్వారా యాదవ వంశం పుత్ర పౌత్రాభివృద్ధిని గాంచింది. రుక్మిణీ కృష్ణుల నందనుడైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా లోక రక్షకుడైనాడు. ఆతని పుత్రుడైన అనిరుద్ధుని బాణాసురుని కూతురైన ఉష వలచి వలపించుకొని వివాహానికి సిద్ధపడగా బాణుడు కుపితుడై అనిరుద్ధుని పట్టి బంధించాడు. మనుమని కొఱకై శ్రీకృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేయవలసి వచ్చింది. అతడు కూడా సామాన్యుడేమీ కాడు. వేయి భుజాలు గలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుని చేతిలో అతనిని పరాజితుని చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుని సంహరించలేదు గాని అతనికి రెండు భుజాలను మాత్రమే మిగిల్చి మిగతా అన్నిటినీ నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు.
ఇంద్రుని జయించి దేవతల నందనవనంలోని పారిజాతాన్ని భూలోకానికి గొనివచ్చిన శ్రీకృష్ణుడు బలదైత్యునీ శిశుపాలునీ వధించి ద్వివిదనామక వానరాసురుని సంహరించి లోకులను కాపాడాడు.
No comments:
Post a Comment