Monday 4 November 2024

శ్రీ గరుడ పురాణము (315)

 


తరువాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగరతీరాన్ని చేరుకొని నలుని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించి ఆవలి ఒడ్డును చేరుకొని అక్కడి సువేల పర్వతం పై విడిది చేసి అక్కడినుండి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు.


తరువాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో, ధూమ్రాక్ష, వీరేంద్ర, ఋక్షపతి జాంబవంతాది ముఖ్య వీరులతో, సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రములతో కలసి రామలక్ష్మణులు లంకా సైన్యమును సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండలవల నున్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడ వణకించిన, బలవీరపరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిహ్వ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాథులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య శస్త్రాస్త్ర విద్యా నైపుణి మీరగా యమపురికి పంపించారు.


చివరగా శ్రీరాముడు ద్వంద్వయుద్ధంలో లోకకంటకుడైన రావణుని సంహరించాడు. తరువాత సీత పాతివ్రత్యాన్ని అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలివచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలను వలె చూసుకున్నాడు. పది అశ్వమేధయాగాలు చేసి, గయతీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు.


ఏకాదశ సహస్రాణి

రామో రాజ్యమ కారయత్ |


(ఆచార ... 143/50)


రామునికి తగిన పత్నిగా కొన్నిచోట్ల ఆయనకన్న గొప్ప శీల స్వభావాన్ని కనబఱచిన మహాదేవిగా సీత ఈనాటికీ పతివ్రతా తిలకంగా లోకులచేత పూజలందుకుంటోంది.


భరతుడు శైలూష నామకుడు, లోక కంటకుడునైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు.


తరువాత ఈ నలుగురు సోదరులూ అగస్త్యాది మునుల తపోవనాలకుపోయి వారిని తృప్తిగా సేవించుకొని వారి ద్వారా ధర్మాలనూ, రాక్షస చరిత్రలనూ తెలుసుకొని, తమ వారసులను కూడా తమంత వారినిగా చేసి అవతారం చాలించారు. (అధ్యాయం - 143)

Sunday 3 November 2024

శ్రీ గరుడ పురాణము (314)

 


రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా వుంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరువలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను, నేలపై బడినంత మేర, వెతుకుతూ పోగా వానిచే నేలకూల్చబడిన జటాయువు కొన వూపిరి మీద వుండి కనిపించాడు. అతడు సీత నెవరో దానవుడపహరించి దక్షిణదిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణదిశవైపు సీతను వెతుకుతూ వెళ్ళాడు. దారిలో ఆయనకి సుగ్రీవునితో సంధి కుదిరింది. వాలిని చంపి సుగ్రీవుని రాజును చేశాడు. వానలకాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యమూకంపైనే గడిపాడు.


వానలు కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానరయోధులను సీతను వెదకుటకై నలుదిశలకూ పంపించాడు. దక్షిణ దిశవైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్ళారు. చివరికి సాగరతీరాన్ని చేరి ఆశలన్నీ ఆవిరైపోయాయనీ తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించుట కన్నా జటాయువు వలె ఆయన కార్య సాధనలో మరణించుటే మేలని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలను విని బాధలను గని విషయం కనుగొని సీత జాడను తెలిపాడు. కడలికి ఆవల గల లంకలో సీత రావణుని చెఱలో వున్నదని చెప్పాడు.


కపి శ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో వున్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సమ్రాజ్ఞిని చేస్తానని ప్రలోభపెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తానని భయపెట్టడం చూశాడు. సీత దేనికీ లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరునీ గడ్డిపోచకన్న హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు.


నోటికి వచ్చిన దెల్ల పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తయై నిలచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుటపడగానే శ్రీరాముని వ్రేలి ఉంగరాన్ని ఆమె కిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు.


సీత నిలచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా వుంచి మిగతా అశోక వనాన్నంతటినీ ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. (అదీ బ్రహ్మదేవుని కిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకే) రావణుని కొలువులో ఏమాత్రమూ భయపడకుండా అతనికెదురుగా నిలచి సీతమ్మను సాదరంగా గొనిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చుమని హితవు చెప్పాడు. రావణుడా వేదము వంటి వాక్యమును పాటింపకపోగా పరమ కుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పటించి చంపాలనుకున్నాడు. కాని మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్ని తోనే లంకకు నిప్పంటించి మరల జలధిని లంఘించి రాముని పాదాల కడ వాలిపోయాడు. (ఈ విధంగా శ్రీరామబంటు సీతను చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు) సీత చూడామణిని రామునికి సమర్పించాడు.

Saturday 2 November 2024

శ్రీ గరుడ పురాణము (313)

 


భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. (అనుబంధం -13లో చూడండి) కైక దీని కంగీకరింపకపోగా తనకాయన ఇచ్చిన వరాలను ఇపుడు కోరుకుంది. రాముని పదునాలుగేడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్పడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవులవైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడు విడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట నంటి వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు.


అయోధ్యలో శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుథాజిత్తు నింటినుండి మరలి వచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు కాని రాముడు రాలేదు. అపుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకుని తాను కూడ వనవాసిలాగే జీవిస్తూ రాజ్యవ్యవహారాలను చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ వుండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నందిగ్రామంలోనే వుండిపోయాడు.


శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను గైకొని దండ కారణ్యంలో పర్ణశాలను నిర్మించుకుని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకియైన శూర్పణఖయను రాక్షసి రాగా శ్రీరాముడామె ముక్కుచెవులను కోయించాడు. ఆమె గొల్లున యేడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది పదునాలుగు వేల మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరామునిపైకి ఉసికొల్పింది. వారంతా పెల్లున గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కాని రామబాగాగ్ని శిఖల్లో శలభాల్లాగ మాడి పోయారు. ఒక్కడూ మిగలలేదు. దాంతో శూర్పణఖ తన యన్నయు, లంకేశ్వరుడు నైన రావణాసురునికి తన బడ్డ పన్నములనూ, ఖరదూషణాదులను మృతినీ విలపిస్తూ వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించి చెప్పింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాని కొడిగట్టాడు. ముందుగా మాయలమారి మారీచుడు బంగారు లేడిగా మారి సీతనా కర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దానిని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు కాని కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమబాధాకరంగా 'హా సీతా హా లక్ష్మణా' అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు గొనిపోయాడు. దారిలో దశరథ మిత్రుడైన జటాయువు అడ్డుపడగా అతనిని నేలకూల్చాడు.


Friday 1 November 2024

శ్రీ గరుడ పురాణము (312)

 


దారిలో నొక కూడలిలో తపస్వీ, మహాత్ముడూనైన మార్కండేయ మహర్షి* కొరతవేయబడివున్నాడు (ఆ పతివ్రత పేరు సుమతి. ఆ మహామునిపేరు మిగతా అన్ని చోట్లా మాండవ్యుడనే వుంది). ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహవేదన తెలియకుండా సమాధిగతుడై వున్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్ళడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడనీ, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడనీ తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమనీ, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనేకూడదనీ శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్యమహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడుదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది.


భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే వుంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్నియైన అనసూయను ప్రార్ధించుమని సూచించాడు. మహాతపస్వినియైన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా.


(అధ్యాయం -142)


రామాయణకథ


రామాయణానికే సీతా చరితమనే పేరు కూడా వుంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలూ నశిస్తాయి.


భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వతమనువు, ఇక్ష్వాకువు ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసు కదా! ఆయనకు మహా బలవంతులు పరాక్రమశాలురునైన రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నోము ఫలములై కలిగారు.


శ్రీరాముడు విష్ణువేనని చెప్తారు. హరి అవతారాలలో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవజాతికి, కుటుంబవ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలచినది శ్రీరామావతారము. వసిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వవిద్యా విశారదుని, సకలకళావల్లభుని గావించారు. ఆయన కన్న గొప్పవీరుడు కాని ఆయనతో సమానుడైన వీరుడు గాని చరిత్రలో లేరు.


విశ్వామిత్రుని యాగమును కాచుటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడూ అప్పుడే చావాలి కాని అలా కాకపోవడం దైవసంకల్పం. జనకునింట నున్న శివధనువును విఱచి సీతను చేపట్టి కళ్యాణ రాముడైన శ్రీరాముడు లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శత్రుఘ్న- శ్రుతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలలో, ప్రజలతో కలిసి కలయ దిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడ స్నేహం చేసి అందరి మనసులలోనూ ఆదర్శ క్షత్రియపుత్రునిగా నిలిచాడు.

Thursday 31 October 2024

శ్రీ గరుడ పురాణము (311)

 


భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రతా మహాత్మ్యం - ఆఖ్యానాలు


“వేదాది ధర్మాలను రక్షించడానికి ఆసురీధర్మాన్ని నాశనం చేయడానికీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలు గానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు. అని బ్రహ్మ వ్యాసమహర్షికి వివరించసాగాడని శౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు.


"ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోక కంటకుడైన హయగ్రీవుడను దైత్యుని సంహరించి వేదాలను మరల భూమి పైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మథన సమయంలో లోకహితాన్ని కోరి ఆదికూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికీ, ప్రజారోగ్యాన్ని కాపాడడానికీ తానే స్వయంగా ధన్వంతరియై దిగివచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృతభాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసులనుండి అమృతాన్నీ, ఆ విధంగా ధర్మాన్నీ కాపాడడానికి ఆడవేషం (మోహిని) వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు.


కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్ర పతితమైన భూమినుద్దరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని యింట పరశురామునిగా అవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియమదాహంకార కబంధ హస్తాలనుండి విడిపించాడు. దీనికాయన ఇరువది యొక్క మార్లు దేశమంతటా కలయదిరిగాడు. అహంకారంతో కన్నుమిన్ను గానకుండా వరప్రసాదంతో మదమెక్కి పోయిన వేయిచేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకొనుటకు వెడలిపోయాడు.


తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని యింట శ్రీహరి అవతరించాడు.  పితృవాక్యపాలన, సత్యపరాక్రమం, దుష్టసంహారం మున్నగు ఆదర్శలక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాదపురుషోత్తముడెలా వుండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు. రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు పదునాలుగేండ్లు అడవులలో 

ఇడుములు పడి త్రైలోక్యపూజ్యుడై మరలి వచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను, ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనమూ ఉంది. రామకథను సీతాచరితమన్నవారూ ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత.


ఇపుడు పతివ్రతామాహాత్మ్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్ఠాన పురంలో కౌశికుడని ఒక కుష్టు రోగియైన బ్రాహ్మణుడుండేవాడు. అతని పత్ని అతనిని దైవసమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా, అతనికి సర్వోపచారాలూ చేస్తూ అతనికి ఏమాత్రమూ అసౌకర్యం కలుగకుండా సేవిస్తుండేది. అయినా అదేమి కర్మయోగాని ఆ పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కొనేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకుని, తగినంత ధనాన్ని కూడా పట్టుకొని వేశ్య ఇంటివైపు పోసాగింది.

Wednesday 30 October 2024

శ్రీ గరుడ పురాణము (310)

 


గంగ ద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్సకల ధర్మ స్వరూపుడునగు దేవవ్రతుడు (భీష్ముడు) ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజయివుంటే చరిత్ర గతి మంచి వైపు మరలివుండేది. కాని శంతనుండు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు.


సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాసమహర్షి జన్మించియున్నాడు. ఆమెకి శంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్ళలో అంబికకు ధృతరాష్ట్రుడూ, అంబాలికకు పాండురాజూ జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన దుశ్శాసనాది నూరుగురు కొడుకులూ, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులూ జనించారు. వీరికీ చాలామంది కొడుకులే పుట్టారు గానీ అంతా యుద్ధంలో పోయారు. అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరిక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని 'పరిక్షిత్' అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. (అనుబంధం-11)లో చూడండి. (అధ్యాయాలు - 139,140)


భవిష్యత్తులో రాజవంశాలు


చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానీక అశ్వమేధ దత్త, అధిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, శుచిద్రథ, వృష్టిమాన్, సుషేణ, సునీథక, నృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మ, శతానీక, సుదానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తక, క్షేమక, శూద్రకులు రాజ్యం చేశారు.


రుద్రదేవా! ఇక్ష్వాకు వంశీయుడైన బృహద్బలుని వంశపారంపర్య క్రమంలో బృహద్బలుడు, ఉరుక్షయ, వత్సవ్యూహ, సూర్య, సహదేవ, బృహదశ్వ, భానురథ, ప్రతీచ్య, ప్రతీతక, మనుదేవ, సునక్షత్ర, కిన్నర, అంతరిక్షక, సువర్ణ, కృతజిత్, ధార్మిక, బృహద్ భ్రాజ, కృతంజయ, ధనంజయ, సంజయ, శాక్య, శుద్ధోదన, బాహుల, సేనజిత్, క్షుద్రక, సమిత్ర, కుడవ, సుమిత్రులు రాజ్యపాలనం గావించారు.


ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంధ, సహదేవ, సోమాపి, శ్రుతశ్రవ, అయుతాయు, నరమిత్ర, సుక్షత్ర, బహుకర్మక, శ్రుతంజయ, సేనజిత్, భూరి, శుచి, క్షేమ్య, సువ్రత, ధర్మ, శ్మశ్రుల, ధృఢసేన, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్, ఇషుంజయులు పరిపాలకులయినారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కాబట్టి వీరికి బార్హద్రథులని పేరు. వీరి తరువాత వారిలో ముందు ముందు అధర్మం, శూద్రత్వం ఎక్కువగా వుంటాయి.


సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడే స్వర్గాదిలోకాలను రచించాడు. ఆయనే మూడు పేర్లతో సృష్టి, స్థితి, లయలను గావిస్తాడు. ప్రళయం నైమిత్తికమనీ, ప్రాకృతమనీ, ఆత్యంతిక మనీ మూడు విధాలు. ప్రళయ కాలం వచ్చినపుడు భూమి నీటిలో, నీరు తేజంలో, తేజం గాలిలో, గాలి నింగిలో, నింగి అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి జీవాత్మలో, చివరగా ఆ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైపోతాయి.


ఏకమాత్ర నిత్యుడా పరబ్రహ్మ ఒక్కడే. ఈ మహారాజులూ, సార్వభౌములూ, చక్రవర్తులూ, ఎవరూ శాశ్వతులు కాలేదు. కాలేరు. కాబట్టి మనిషి పాప కర్మకి దూరంగా అవినాశియైన ధర్మానికి దగ్గరగా జీవించాలి. పాపి సార్వభౌముడైనా హరిని చేరలేడు. పుణ్యాత్ముడు నిరుపేదయైనా హరిని చేరుకోగలడు.


(అధ్యాయం -141)

Tuesday 29 October 2024

శ్రీ గరుడ పురాణము (309)

 


అంగుని వంశంలో అనపాన, దివిరథ, ధర్మరథ, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరథ, బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు.


రుద్రాది దేవతలారా! ఇక పురు వంశ వర్ణన వినండి.


పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, ఋతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేదాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు (ఇతడే శకుంతల కొడుకు), వితథుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, శిని- వీరంతా పౌరవ వంశ వర్ధనులే. (రౌద్రాశ్వునికి ఏడుగురు కొడుకులు. వారి పేర్లు ఋతేయు, స్థండిలేయు, కక్షేయు, కృతేయు, జలేయు, సంతతేయులు వీరంతా రాజశ్రేష్ఠులే)


భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుణి, వ్యూహక్షత్ర, సుహోత్ర, రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీఢ, ద్విమీఢులు, సుహోత్రనందనులు. హస్తి కొడుకు పేరు పురుమీఢుడు కాగా అజమీఢుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాణ్వాయన గోత్రమేర్పడింది.


అజమీఢుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాశ్వ, పృథుసేన, పార, నృప, సృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొకపుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విష్వక్సేనులు కూడా రాజ్యం చేశారు.


ద్విమీఢుని వంశంలో క్రమంగా యవీనర, ధృతిమాన, సత్యధృతి, ధృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరథులు జనించారు.


అజమీఢునికి పత్ని నళిని ద్వారా నీలమహారాజుదయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యశ్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికైదుగురు కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు.


వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తి నవలంబించి పరమ వైష్ణవునిగా పేరు గాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతయైన ఊర్వశి ద్వారా కృపాచార్యునీ, కృపినీ కన్నాడు. ఈ కృపినే భారతవీరుడు, గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ.


దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చ్యవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, ధృష్టద్యుమ్న, ధృష్టకేతులు జనించారు.


అజమీఢుని పుత్రుడైన ఋక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్దిల్లారు. కురురాజుకి ముగ్గురు కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు.


సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర చ్యవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు.


బృహద్రథుని వంశంలో కుశాగ్ర, ఋషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులుదయించారు. బృహద్రధుని మరొకపుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శ్రుతవంత, భీమసేన, ఉగ్రసేన, శ్రుతసేన, జనమేజయులుద్భవించారు.


కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదూరథ, సార్వభౌమ, జయసేన, అవధీత, అయుతాయు, అక్రోధన, అతిథి, ఋక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులుదయించగా ఆయనకు దేవాపి, శంతను, బాహ్లికులుదయించారు. బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు.