కఫ దోషం వుంటే అది బరువెక్కిపోయి చల్లగా తగులుతుంది. గోరోజనం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని నిర్మూలించడం సులభమే.
ఇంకా మూత్రానికి సంబంధించి శుక్రాశ్మరి, శర్కర, వాతవస్తి, వాతష్టిల, వాతష్టిల, వాత కుండలిక, ఉష్ణవాత, మూత్రక్షయ, మూత్రసాద అను పేళ్ళు గల రోగాలుకూడా ఉన్నాయి. వీటిలో కొన్ని వీర్య సంబంధమైనవి. వీటిని కుదర్చడం సాధ్యమే.
(అధ్యాయం 158)
ప్రమేహ రోగ నిదానం
ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబిటిస్ అనే అర్థం ఈయబడింది. ఈ గ్రంథంలో చక్కెరవ్యాధి అని కూడ వాడడం జరిగింది.
ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి. వీటిలో పది కఫ దోషం వల్ల, ఆరు పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత భేదం వల్ల వస్తాయి. కొవ్వు, మూత్రం, శ్లేష్మం వీటికి మూలాలౌతాయి. మూత్ర విసర్జన బట్టి రోగం పేరు ఉంటుంది.
* మలం వేడిగావుండి మూత్రం చింతపండు రంగులో యేలాం చేప వాసన వేస్తుంది - హరిద్రమేహ
* ఎరుపు వాకతో పసుపు పచ్చరంగు మూత్రం - మంజిష్ఠమేహ
* మాంసం వాసనతో ఎఱ్ఱటి లవణాలతో ఎఱ్ఱటి రంగులోనే మూత్రం - రక్తమేహ
* తఱచుగా పడుతూ కొవ్వుతో కలసి జారుతూ కొవ్వు రంగులోనే మూత్రం - వసామేహ
* మూలగతో కలిసి పడుతూ అదే రంగులో వుండే మూత్రం - మజ్ఞమేహ
* ధారాపాతంగా పడుతూ జిగటగా వుండే చీముతో కలిసిజారే మూత్రం - హస్తిమేహ
మధుమేహ రోగి మూత్రం తేనె రంగులో వుంటుంది. ఈ మేహం రెండు రకాలు.
ధాతువుల తగ్గుదల వల్ల ప్రకోపించిన సర్వవాయు (వాత)దోషం వల్ల మూత్ర మార్గం నిరోధింపబడుతుంది. రోగలక్షణాలు కొన్నాళ్ళు పుష్కలంగా కనిపించడం కొన్నాళ్లు అసలు కనిపించకపోవడం, మరల కొన్నాళ్ళకు కనిపించడం అనగా బయటపడడం జరుగు తుంటుంది. దీనికి కారణం మాత్రం కనిపింపదు. కానీ రోగం మాత్రం ప్రమాదకరస్థాయిని చేరుకొంటుంది.
ప్రమేహ వ్యాధులన్నీ, నిర్లక్ష్యం చేస్తే మధుమేహంగా పరిణమిస్తాయి. మధుమేహం అంటేనే పూర్తిగా కుదరనిదని సూచన. ప్రమేహంలో ఏ విభాగంలోనైనా విసర్జనాలు తేనెలాగుండి తీపి వాసన వస్తుంటే మధుమేహం వచ్చేసిందని భావించవచ్చు.
కఫ దోష జనిత మేహ వ్యాధుల లక్షణాలలో ముందుగా అజీర్ణం, అరుచి, ఆహార నిరాసక్తత, వాంతులు, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లే మగతగా వుండడం, దగ్గు, పడిశం బయట పడతాయి. అదే పిత్త జన్యమైతే మూత్రకోశంలోనూ దానికి కాస్త పైనా పీకుతున్నట్లుండడం, వృషణాలలో ఉబ్బు, వాపు, జ్వరం, శరీరమంతా మండు తున్నట్లుండుట, దప్పిక, పుల్ల త్రేన్పులు, మూర్ఛ, మలద్వారము జారినట్లుండుట అనే లక్షణాలు బయటపడతాయి.
వాత దోషజన్యమైన మేహంలో ఈ క్రింది లక్షణాలుంటాయి. ఉదావర్తం (గుద స్థానభ్రంశం) కంపము, గుండెనొప్పి ఘాటైన రుచులకోసం వెంపర్లాట, నిద్రలేమి, పడిశం, దగ్గు
బయటికి తేలకుండా వుండే పుండ్ల ద్వారా పదిరకాల ముదిరిన ప్రమేహాలను ఈ పేర్లతో గుర్తించారు. శరావిక, కచ్ఛపిక, జ్వాలిని, వినత, అలజి, మసూరిక, సర్షపిక, పుత్రిణి, విదారిక, విద్రధి.
No comments:
Post a Comment