Tuesday, 4 February 2025

శ్రీ గరుడ పురాణము (342)

 


గుహ్యనాళం అయిదున్నర అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్ళవలె ఉండే మొలలు మూడున్నర అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆదారంట వెళ్ళే రక్తనాళాలీ మొలలకు తగిలి పగులుతాయి. తద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి.


సహజంగా, అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది వుండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలివైపు మొనదేలి, పాలిపోయిన పసుపురంగులో వుంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా వుంటాయి. 


ఈ మొలలు ఆరు విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలూ కలిసి కాని రెండేసి కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడిమొలలు వాత, కఫదోషాల వల్లా, తడిమొలలు పిత్త దోషం వల్లా ఏర్పడతాయి.


జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన - అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికీ నిమురు కోవడం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారి చేయడం, సహజమైన కోరికలను అణచుకోవడం, విరేచనాలు, మలబద్ధకం ఇలాటివన్నీ దోహకాలౌతాయి, కారణాలూ అవుతాయి.


అపానవాయువు కలత చెందినపుడు మలం పైకి పోయే దారిలో ములుకు ల్లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగుతుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నపుడు ఇబ్బంది కలిగి, మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం, అన్నద్వేషం, తల, తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ, పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్ళపై చిరాకు కలుగుతాయి.

No comments:

Post a Comment