మూత్ర విసర్జన కష్టతరమౌతుంది. ఆలోచించడానికి కూడా బద్దకమేర్పడి తలదిమ్మెక్కి పోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యమూ కొరవడుతుంది. ఏం తిన్నా ఒకంతట అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకు పెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది.
మూడుదోషాలూ కలిసిన మొలల లక్షణాలు ఇలా వుంటాయి. రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మట్టి లేదా గంజాయి చిగురుల్లా వుంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై వుంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తంపోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది.
రోగి శరీర వర్ణాన్నీ, బలాన్నీ, బుద్ధి నిలకడనీ కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురౌతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకు పోవడం జరుగుతాయి.
వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ళ విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి. దాహం, తలనొప్పి, పడిశం, ప్లీహవ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాతమొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు.
రెండు ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజన ముంటుంది గాని ఒకయేడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలయిన మొలలు ఏదో ఒక దోషం వల్ల యేర్పడితే, వెంటనే అయితే, సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు.
జననేంద్రియం పైగాని, బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా వుంటాయి. అలాగే వ్యానమను పేరు గల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి.
మొలలలో గరుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం, రంగులు, నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు. (అధ్యాయం-156)
No comments:
Post a Comment