ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలివుంటాయి. అయితే మల ద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రతా పెరుగుతుంటుంది. అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్ళి పోయి అన్ని జ్ఞానేంద్రియాలనూ, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడది వాత, పిత్తాలలో పగుళ్ళను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి.
రోగి బక్కచిక్కిపోతాడు, మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి, విరక్తుడై పోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది.
యక్ష్మవిషయంలో ఇదివఱకు చెప్పబడిన బాధలన్నీ ఈ రోగిని తాకుతాయి. సంధులన్నిటిలో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం, నోరు తడారిపోవుట, శ్వాసకృచ్ఛము, పడిశం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళునొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి నీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది.
తడిమొలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో వుండి వాచుట, పగులుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా వుంటాయి. ఎఱ్ఱగా గాని జేగురు రంగులో గాని వుంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా వుండవచ్చు. పగుళ్ళు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడ ఉంటాయి. కదంబ పుష్ప వర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా వుండవచ్చు.
ఈ రోగం పెరుగుతున్నకొద్దీ శరీరం, గోళ్ళు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ వుంటాయి. వాపు, గుండ్రంగా వుండి, జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. (ఈ పొక్కులను అస్త్రీలలంటారు)
పిత్త దోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో వుంటాయి. పోను పోను ఎఱ్ఱగా, నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటినుండి అరుణవర్ణంలో పలచగా వున్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా వుంటాయి. విరేచనం అజీర్ణంగా, పలచగా, ద్రవరూపంలో, ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దళసరిగా వుంటాయి. చర్మం, గోళ్ళు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి.
కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్ళూనుకొని వుంటాయి. దళసరిగా వుంటాయి. నొప్పి మిగతా రకాల కన్న తక్కువ పెడతాయి. తెల్లగా వుండి, కుళ్ళినట్లు కనిపిస్తూ, గుండ్రంగా, నున్నగా, నిటారుగా వుంటాయి. ఆవుపొదుగులా, వెదురు కొమ్మలా, జీడిపిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా వుంటుంది. తొడల సంధుల్లో నొప్పి, గుదంలో, మూత్ర కోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవుతుంది. శ్వాసలో ఇబ్బంది, పడిశం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి.
No comments:
Post a Comment