అతిసార గ్రహణి రోగాలు
శుశ్రుతా! నిజానికి అతిసార, గ్రహణిరోగాలు రెండూ నీళ్ళ విరేచనాలకి పెట్టబడిన పేర్లే. ఇవి ఆరు రకాలుగా వుంటాయి. త్రిదోషాలూ ఒక్కొక్కటిగానూ అంటే విడివిడిగానూ కలివిడిగాను నాలుగు రకాలౌతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు రెండు.
నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా తాగెయ్యడం ఈ జబ్బులకి సాధారణ కారణం. వాతం విచక్షణ రహితంగా తినే తిండి వల్లా, కొవ్వు వల్లా, వేపుడు వల్లా, పులుపు (మసాలా) ఘాటువల్లా, కొన్ని మొక్కల రెమ్మలు, గింజలవల్లా, సారా వల్లా, పగటి నిద్రవల్లా, మలమూత్రాలను బలవంతంగా ఆపడం వల్లా ప్రకోపించి వీటిని తెస్తుంది. వాయు ప్రకోపం వల్ల రక్తం శరీరంలోని క్రింది భాగాలకు అతిగా ప్రసరణంగావించి జఠరాగ్నిని ఆర్పేస్తుంది. తరువాత జీర్ణవ్యవస్థ అంతర్భాగంలో ప్రవేశించి ఆహారాన్ని మలాన్నీ కూడా పలచగా, ద్రవంలాగ చేసి పారేస్తుంది. ఛాతీనొప్పి, మలద్వారంలో బాధ, శరీరంలోపలి నుండి కముకు దెబ్బలు తిన్నట్టు నొప్పులు ఒకేసారి శరీరం పై దాడిచేస్తే ఈ రోగం వచ్చేసిందని పోల్చవచ్చు.
కడుపును నొక్కితే కొన్నిచోట్ల గట్టిగానూ, కొన్నిచోట్ల లోతుగా, మెత్తగానూ తగులుట, అజీర్ణము ఈ రోగలక్షణాలు. జ్వరం వుండదు. మలం చాలతక్కువగా పడుతుంది. అది కూడా ఎన్నో అవరోధాలను దాటుకొని వస్తున్నట్లు కష్టంగా పడుతుంది. ధ్వని వుండదు. వాత ప్రకోప లక్షణాలివి. ఇంకా మలం గట్టిగా జిగటగా బుడగలతో నుండుట, మలద్వారా నికి కొంచెం పైన వుండే మాంసల ప్రదేశంలో మంట, కోసినట్లుండి నీళ్ళు తగిలితే మంట, ద్వారం మూసుకుపోయినట్లయి అతి కష్టం మీద తెఱచుకొనుట, ఒళ్ళు తఱచు గగుర్పాటుకు లోనగుట కూడా వాత దోష ప్రకోపజన్య అతిసార, గ్రహణి లక్షణాలే.
పిత్తజమైన అతిసారంలో మలం పచ్చగా, నల్లగా, చింతపండు రంగులో లేదా పచ్చగడ్డి రంగులో రక్తమిళితమై వుంటుంది. కంపు ఎక్కువగా వుంటుంది. రోగి అతి దాహంతో మందాగ్ని పీడతో, తల తిరుగుడు, మూర్ఛలతో బాధ పడుతుంటాడు. కడుపు నుండి మలం ద్వారా దాకా మండుతున్నట్లుంటుంది.
కఫదోషం వల్ల వచ్చే అతిసారంలో మలద్వారం వద్ద నొప్పి, మంట పెద్దగానే వుంటాయి. మలం దళసరిగా అంటే చిక్కగా, తక్కువగా, ఆగకుంగా కొంచెంగానే పడి ఆగిపోతుంది.
మూడుదోషాలూ కలిపివుండే అతిసారంలో పై లక్షణాలన్నీ దశలవారీగా బయట పడుతుంటాయి. గగుర్పాటు, భరింపలేనంత నొప్పి, మూత్రాశయం, కడుపు గుహ్యం బరువెక్కిపోతుండుట, తెలివి తప్పదు కానీ చేసిన పని చేయలేదనుకొనేటంత మఱపు కమ్ముకొనుట కూడా జరుగుతాయి.
భయం వల్ల ఈ రోగం వస్తే రోగి పడుకొని వుండగానే విరేచనమైపోతుంది. వాయవు ద్రవంగా మారి ప్రవాహంగా బయటకొస్తుంది. దుఃఖం వల్ల వచ్చే ఈ రోగంలో వాత, పిత్త ప్రకోపాలు కలిసిన లక్షణాలు కనిపిస్తాయి.
No comments:
Post a Comment