Monday, 19 November 2012

శివుడు స్మశానవాసి అని ఎందుకంటారు?

శివుడు స్మశానవాసి అని ఎందుకంటారు?

శివం అంటే కల్యాణం,శుభం అని అర్ధం.శుభాన్ని కలిగించే వాడు శివుడు.

"అరిష్టం శినోతి తనూకరోతి" శివం అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్ధం.

తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య/భర్త,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు.అప్పటివరకు నావి,నావి అనుకున్న మనిషి "నా"అనుకున్న వాటిని వదిలేస్తాడు.ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది శ్మశానం అంటే ఎటువంటి భయాలు,ఆశలు,కోరికలు,కోపాలు,ఆందోళనలు,బంధాలు లేని ప్రదేశం.అక్కడున్న శరీరాలు ఎండకు,చలికి,వర్షానికి దేనికి కూడా చలించవు.ఎవరు ప్రతి కర్మను(పనిని) కర్తవ్యంగా చేస్తారో,నిత్యం ప్రశాంతంగా ఉంటారో,సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో,ప్రతి విషయానికి ఆవేశ పడరో,అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం.భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు.మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనుల సక్రమంగా,అనుకున్న కాలానికన్నా ముందే,మరింత గొప్పగా పూర్తిచేయగలుగుతాం.అలా చేయగలిగినప్పుడు శుభాలు కాక ఇంకేమి వస్తాయి చెప్పండి?అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.


అంతేకాదు ఎంతగొప్పవాడైనా,బీదవాడైన,ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే.అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో,ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో,ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో,ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం.

ఇక శివాలయానికి వెళ్ళి అక్కడ నిర్మలమైన మనసుతో,ఏమి ఆలోచించకుండా,కాసేపు కళ్ళు మూసుకుని ధ్యనంలో కూర్చుటే మానసిక ప్రశాంతత తప్పక లభిస్తుంది.మనసు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుని రండి.మీకే ఆ తేడా తెలుస్తుంది.అందువల్ల శివాలయం కూడా స్మశానం వంటిది అన్నారు.

అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని,శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు..అవి కాలక్రమంలో వచ్చిన అసంబద్ధప్రచారాలు.

కార్తీకమాసంలో వీలుకుదిరితే రోజు శివాలయానికి వెళ్ళండి.శివుని ముంగిట దీపాలను వెలిగించండి.

ఓం నమః శివాయ 

No comments:

Post a Comment