Monday 10 February 2014

హిందూ ధర్మం - 15

ఈరోజు మన సమాజాన్ని చూడండి. ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని ఒకరు, టీచరు కొట్టిందని మరొకరు, టి.వి. చూడనివ్వడలేదని ఇంకొకరు, ప్రేమ విఫలమైందని వేరొకరు, ఇలా ......... ప్రతి చిన్న చితకా, విషయాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్ష పాస్ కాకపోవడం కూడా ఒక సమస్యేనా? ఆలోచించండి. పరీక్షే జీవితం కాదు, ప్రేమే జీవితం కాదు, ఆర్ధిక ఇబ్బందులే జీవితం కాదు, ఇవన్నీ పెద్ద జీవితంలో చిన్న చిన్న భాగాలు మాత్రమే. యోగులకైతే అసలు వీటి పట్టింపే ఉండదు. ముష్టి ఉద్యోగం పోయిందని చచ్చిపోతాడు ఒకడు. ఏం? మాములు జీవితం బ్రతకచ్చు కదా. బ్రతకడానికి లక్షలే అవసరంలేదు. బ్రతకాలనుకుంటే పాచిపనులు చేసైనా బ్రతకచ్చు.ఆత్మహత్య చేసుకోవడం పిరికి చర్య. బ్రతకండి, ధృతితో బ్రతకండి, ధీరులుగా బ్రతకండి. అదే ధర్మం యొక్క మొదటి లక్షణం.

పెద్ద పనులు, చిన్న పనులు అని ఉండవు, అన్ని సమానమే, సమాజంలో ఎవరు పని చేయకపోయినా ఈ సమాజం నడవదు. అటువంటప్పుడు ఏదో ఒకపని మాత్రమే చేస్తాను, లేకుంటే చస్తాను అనుకునేవాడు మూర్ఖుడు. అట్లాగే, ఫలాన పని చేసేవాడే గొప్పవాడు, మిగితా వాళ్ళు అల్పమైనవారని భావించే సమాజం కూడా మూర్ఖపు సమాజమే. ఈనాటి కాలంలో జనం సమస్యలనే జీవితం అనుకుంటున్నారు, ప్రతి చిన్న విషయానికి మనసుపై నియంత్రణ కోల్పోతున్నారు, అన్నిటికి బాధపడిపోతున్నారు. అదే వద్దంటుంది ధర్మం. పరీక్ష పేయిల్ అయితే భోరున ఏడుస్తారు? అప్పుడు ఏడ్చి లాభం ఏంటి? ఆ ఏడుపు ఏదో ముందే ఏడిస్తే, పరీక్ష పాస్ అయ్యేవారు కదా. మార్కులు ప్రకటించాకా, మీరు ఏడిస్తే, మీ మార్కులు ఏమైనా మారుతాయా? లేదు కదా. జీవితంలొ అనేకం వస్తుంటాయి, వాటిని అంగీకరించాలి. మీరు కొన్ని అంగీకరించకపోయినా, అవి మారవు, మీరు మార్చలేరు. అటువంటప్పుడు బాధపడడం ఎందుకు? జీవితంలో ఏం వచ్చినా ఎదురుకోవాలి. జరిగినది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది మీ చేతుల్లో ఉంది, రేపటి మీ జివితానికి విధాతలు మీరే, అందుకే ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. అదే ధృతి.

To be continued................... 

No comments:

Post a Comment