Thursday, 13 February 2014

హిందూ ధర్మం - 18

క్షమించడం గొప్ప లక్షణం. మాటమాట పెరగకుండా, మనమే ఒక అడుగు ముందుకేసి, వాదనను, యుద్ధాన్ని నివారించడం, ఆపడం అందరికి సాధ్యం కావు. ఎవరు ఎక్కువగా వాదిస్తారో, ఎక్కువగా పోరాడతారో, వారే గోప్పవారననేది సమాజం యొక్క భావన. కానీ శక్తి ఉండీ, వెనక్కు తగ్గడం అనేది చాలా కష్టతరమైన పని, అది ధీరులు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు మీకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఎదుటివాడిని చెంప పగిలేలా కొట్టే పరిస్థితి వస్తే, అక్కడ మీరు, మిమ్మల్ని నియంత్రించుకోవడానికి, శాంతపడడానికి, వెనక్కు తగ్గడానికి బోలెడు శక్తి కావాలి. కొట్టడం ఎంత సేపు చెప్పండి. అది గొప్ప కాదు. నిగ్రహించుకోవడం గొప్ప. ఇలా నిగ్రహించుకోవడం, అవతలవారిని క్షమించడం వల్లే సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇటువంటి క్షమాగుణం జ్ఞానుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు పాపం అమాయకుడు, అజ్ఞాని, పసిపిల్లవాడు లాంటివాడని జ్ఞాని మనస్పూర్తిగా క్షమించగలుగుతాడు.

ఇక రెండవ అంశం. క్షమించడం అన్నది కేవలం మాటలకే పరిమితం అవ్వరాదు. త్రికరణశుద్ధిగా క్షమించాలి. అంటే మనసులోనూ, మాటలలోనూ, చేతలలోనూ క్షమా గుణం కనిపించాలి. ఒకడి మీద మనసులో బోలెడు కోపం, కసి, పగ, ద్వేషం వున్నా, అందరూ చూస్తున్నారనీ, అందరి ముందు ఇవి ప్రదర్శిస్తే, చెడ్డపేరు వస్తుందని, బయటకు 'వాడిని నేను క్షమించేసానండీ!'  అని సులువుగా అనేస్తారు. కానీ మీకు తెలుసు, మీ మనసులో వాడి మీద కోపం ఉన్నదని, వాడి మీద కసి తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ. లేదా, తగిన సమయం కాదు కాబట్టి, తాత్కాలికంగా క్షమిస్తారు. అది నిజంగా క్షమించడం ఎలా అవుతుంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ మనసులో మీ శత్రువు పట్ల విపరీతమైన ద్వేషాన్నీ వేళ్ళతో సహ తొలగించడమే నిజమైన క్షమా. ఇటువంటి నిజమైన క్షమాగుణమే ధార్మికులకు ఉండవలసిన లక్షణం. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు. కానీ సాధన చేత, ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల మెల్లమెల్లగా అలవడుతుంది.

To be continued...................

No comments:

Post a Comment