Tuesday, 1 April 2014

హిందూ ధర్మం - 41 (శౌచం)

మనకు ఇష్టమైనవాళ్ళు ఎన్ని మాట్లాడిన, అన్ని దుర్మార్గాలు చేసినా మనకు అవేమి కనిపించవు. వాళ్ళు పొరపాటున ఏదైనా అంటే ఆవేశంలో అన్నాడులే అను ఊరుకుంటారు. అదే మనకు నచ్చనివాళ్ళు ఏదైనా అంటే, ఇక మన ఆవేశానికి హద్దులు ఉండవు. వాడు చిన్న తప్పు చేసినా, మనకు పెద్దగానే కనిపిస్తుంది. వాడు చేసే మంచిపనులను మెచ్చుకోకపోగా, అందులో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తాం. మన మనసు ఒకరకంగా ట్యూన్ చేసేసుకున్నాం. ఇది దాదాపు అందరికి ఉంటుంది. కానీ ధర్మం అంటుంది పక్షపాత రహితంగా ఉండడమే శౌచం. ఒకరిపట్ల పక్షపాతంతో వ్యవహరించడం ఆశౌచం.

అట్లాగే విషయ పరిజ్ఞానం పూర్తిగా సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఏర్పచుకుంటాము. అది వ్యక్తుల విషయంలో కావచ్చు, వ్య్వస్థల విషయంలొ కావచ్చు. మనకున్న కొద్ది జ్ఞానంతో అందరి మీద లేనిపోని అభిప్రాయాలు ఏర్పరుచుకుని వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తాం, ఏవోవో మాటలు అనేస్తాం. మన జీవితం గురించి మనకు లేని శ్రద్ధ పక్కవాడి జీవితంలో చూపిస్తాం. మనం ఎలా ఉన్నామో చూసుకోము, ఎప్పుడు వాడిని, వీడిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాం. అవతలివాళ్ళు బాధపడతారని ఉండదు. అసలు మనకు ఎదుటివాడి మనోభావలతో సంబంధమే ఉండదు. ఇది అశౌచము.

వ్యక్తులను వివిధ కారణాల చేత నీచంగా చూడడం అశౌచం. జ్ఞానవిషయంలో, జన్మ, కుల, మత, ప్రాంతాల విషయంలో వ్యక్తులను కానీ, ఇతర జీవాలను కానీ మనకంటే అల్పంగా, నీచంగా చూడడం, భావించడం అశౌచం. ఈ విధంగా ఎవరు చూస్తారో, వారు ఆ క్షణమే తమ శౌచాన్ని కోల్పోతారు.  అన్ని జీవులయందూ పరమాత్మ సమభావంతో వెలుగొందుతున్నాడు కనుక సర్వజీవులను సమభావంతో చూడడం, అందరిని గౌరవించడం వల్లనే పవిత్రత ఏర్పడుతుంది.

భగవంతుడు పక్షపాతరహితుడు. తన భక్తుడికి ఒక విధంగా, తనను ద్వేషించేవానికి మరొక విధంగా ఫలితాలు ఇవ్వడు. వ్యక్తి చేసిన కర్మలను అనుసరించే ఫలితాలను ఇస్తాడు. జనులందరూ కూడా అట్లాగే పక్షపాత రహితంగా ఉండాలనుకుంటాడు. నువ్వు స్నానం చేసి, మంచి బట్టలు ధరించి ఆయన ముందు నిల్చుంటే శుచిగా ఉన్నావని చెప్పడు, నీలో పక్షపాతం ఉండకూడదు, నీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే నువ్వు శౌచం కలిగి ఉన్నావని అంటాడు.

ఈ విధమైన శౌచం కలిగి ఉండడం ప్రతి వ్యక్తి యొక్క ధర్మం అన్నది ఋషివాక్కు.

To be continued..............

No comments:

Post a Comment