Sunday, 20 April 2014

హిందూ ధర్మం - 50 (సత్యం)

సత్యం:

ధర్మాచరణలో ముఖ్యమైనది సత్యం. సత్యాన్ని పలకటం, సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా అని ఉపనిషత్ వాక్కు. సత్యమే (నిజమే) భగవంతుడు. అటువంటి సత్యాన్ని ఒక వ్రతంగా ఆచరించాలన్నారు ఋషులు. ఎప్పుడు నిజాలే మాట్లాడితే చాలా ఇబ్బందులు ఎదురు కావచ్చు అన్న భావన వస్తుంది. దానికి మనుస్మృతి చక్కని మార్గం చూపిస్తుంది.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ అసత్యంప్రియం
హితంచ నానృతం బ్రూయాత్ హేషధర్మో సనాతనః

మనుమహర్షి ఈ విధంగా చెప్తున్నారు. సత్యాన్నే నిత్యం పలకండి. ప్రియమైన మాటలనే మాట్లాడండి (ప్రియమైన మాటలంటే ఎదుటివారికి నచ్చేమాటలు). అబద్దాలను, అప్రియమైన మాటలను మాట్లాడకండి. ఇతురులకి ఉపకారం, మేలు చేకూర్చే మాటలనే పలకండి (హిత వాక్కులను). కానీ మేలు చేస్తుందని అబద్దాలు చెప్పకండి. ఎప్పుడూ నిజాలనే మాట్లాడండి. ఇదే సనాతనమైన ధర్మం. (ఇది పై శ్లోకం సారాంశం).

మనుమహర్షి ఏం చెప్పారంటే ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. అలాగని కఠోరమైన సత్యాన్ని ఎక్కడపడితే అక్కడ చెప్పకండి. వినేవారిని దృష్టిలో ఉంచుకుని, వారి స్థితికి అనుకూలంగా, వారు మెచ్చుకునేలా, వారి మెప్పు పొందేలా, వారికి నచ్చేవిధంగా మాట్లాడండి. చెప్పాలనుకున్న దానిని కుండబద్దలు కొట్టినట్టు, మొహం మీద చెప్పకుండా, కాస్తంత సున్నితంగా, చాకచక్యంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ప్రియకరమైన వాక్కు. లేదంటే శ్రోతకు అది ఇబ్బంది కలిగించవచ్చు, చెప్పేవాడికి హాని చేయవచ్చు. విన్నవాళ్ళు అది నచ్చక దాన్ని తిరస్కరించవచ్చు, చెప్తున్నవారి మీద ద్వేషం పెంచుకోవచ్చు. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి. కానీ మీరు చెప్పేది అబద్దం కాకుడదు, నిజమే అవ్వాలి సుమా. ఎప్పుడు అసత్యం (అబద్ధం) చెప్పకండి. అప్రియమైన వాక్కులను (ఎదుటివారికి నచ్చనిమాటలు, చిరాకు కలిగించే మాటలు) కూడా పలుకకండి. హితకరమైన మాటలనే (మంచి మాటలనే/ మేలు చేసే మాటలనే) మాట్లాడండి. అలాగని మంచి జరుగుతుందని అబద్ధాలు చెప్పకండి. మేలుచేకూర్చే సత్యాన్నే పలకండి. ఒకవేళ ప్రియవాక్కును పలకాలో, హితకరమైన వాక్కును పలకాలో తేల్చుకోలేని సందర్భం వస్తే, అప్పుడు హితకరమైన వాక్కులనే పలకండి. ఇదే సనాతన ధర్మం.

To be continued..............

2 comments:

  1. ఉదాహరించిన శ్లోకం చివరి పాదం:
    ఏష ధర్మః సనాతనః అని వుండాలి.

    ReplyDelete
  2. శ్లో॥
    సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
    న బ్రూయాత్ సత్య మప్రియం।
    ప్రియం చ నానృతం బ్రూయాత్
    ఏష ధర్మ స్సనాతన:॥
    ఇది సరియైనది

    ReplyDelete