Thursday, 3 April 2014

హిందూ ధర్మం - 43

పాపపుణ్యాలు అన్నవి అసలు ఉండవు, అన్నీ మన భావనలే, భగవంతుడే అన్నిటికి ప్రేరణం చేయిస్తున్నాడు అన్న భావన ఉంటే, మనం ఏం చేసినా పాపపుణ్యాలు అంటవు అంటూ ఎవరైనా చెప్తే అది తప్పు. ఈ లోకంలో అన్ని భగవత్ సంకల్పం వల్ల జరుగుతున్న మాట వాస్తవమే అయినా, అది ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మంతో సమన్వయం చెందినవారికి గోచరించే సత్యం. దాన్ని పట్టుకుని, నేనే ఈ శరీరం అని భ్రాంతిలో ఉన్నవారు, ఆత్మానుభూతి పొందనివారు తమకు నచ్చినవన్ని చేస్తూ, ఎలా కావాలంటే అలా బ్రతుకుతూ, అన్ని భగవంతుడి ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి అనడంలో అర్దంలేదు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలన్నా, పతనం కావాలన్నా, అది అతని బుద్ధిని ఉపయోగించడం మీదనే ఆధారపడి ఉంటుంది. నేను ఇచ్చిన బుద్ధిని సక్రమంగా వాడుకుని, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని గీతలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టం చేశారు.

భగవంతుడిచ్చిన బుద్ధికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ బుద్ధి విషయంలో మనం అడిగేవరకు, సంపూర్ణశరణాగతి చేసేవరకు ఆయన కలగజేసుకోడు. మనం వేడుకుంటే మనకు సహాయం మాత్రం చేస్తాడు. అంతవరకు మనం చేసే ప్రతి కర్మలకు మనమే బాధ్యులం. మీరు మంచి చేసినా, చెడు చేసినా దాని ఫలితం అనుభవించవలసిందే. మనమే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మనకు చెప్పడానికి శాస్త్రం ఉంది. మనిషి తన బుద్ధిని ఎంత సక్రమంగా వాడుకుందామన్న దాని మీద మనసు, పూర్వజన్మ వాసనల ప్రభావం పడుతుంది. అందుకే మనం మన బుద్ధిని సక్రమంగా వాడుకునే శక్తిని ఇమ్మని పరమాత్మను ప్రార్ధిస్తాం.

మనం వేదాలు గమనించినా, అందులో భగవంతుడిని ప్రార్ధిస్తూ 'నువ్వు మా బుద్ధిని ప్రచోదనం చేయి, మంచి మార్గంలో మా బుద్ధి నడిచేలా అనుగ్రహించు, మేము మంచి పనులే చేయుదుముగాకా, నువ్వు మా బుద్ధులను ప్రేరేపించెదవు గాకా' ఇలా నడిచిపోతుంది వైదిక ప్రార్ధన. అంతేకానీ, ఓ దేవుడా! నేను పాపిని, దుర్మార్గుడిని అంటూ సాగదు. నాతో అన్నీ నువ్వే చేయిస్తున్నావు, నేను తప్పు చేసినా, దొంగతనం చేసినా, అదంతా నీ ప్రేరణే అని ఉండదు. మీరు చేస్తున్న ప్రతి పనికి మీరే బాధ్యులు. ఏ పని చేస్తున్న బుద్ధిని సక్రమంగా ఉపయోగించి చేయాలి. అలా చేయడమే ధర్మం.

To be continued..............

No comments:

Post a Comment