Saturday, 26 April 2014

హిందూ ధర్మం - 53 (సత్యం)

సత్యమే భగవంతుడు. భగవంతుడిని సత్యపరిపాలన ద్వారానే ఆరాధించాలి. ప్రతి శుభకార్యం తర్వాత మనం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. సత్యమే తానై ఉన్నవాడు కనుక సత్యనారాయణుడని పేరు. ఆ వ్రతానికి సత్యవ్రతం అని పేరు. ఆ వ్రత కధ చదివితే అర్దమవుతుందో సత్యం విలువ ఏమిటో? సత్యనారాయణ స్వామిని ఆర్ధాదించడంలో తొలిమెట్టు సత్యాన్ని గట్టిగా పాటించడమే.

సత్యనారాయణ స్వామి కధనే పరీశీలించండి. అందులో వైశ్యుని కధ చూస్తే, తమకు కష్ట వచ్చిన ప్రతిసారీ 'స్వామి నీ వ్రతం చేస్తాము' అని మొక్కుకోవడం, కష్టం నుంచి గట్టేక్కగానే మొక్కును మర్చిపోవడం, లేదంటే ఇప్పుడు కాదులే అంటూ వాయిదా వేయడం. ఇదే తంతు. ఆఖరున వారు చెరసాలలో బంధించబడడం, రాజు వారికి సమస్త కానుకులు ఒక ఓడ నిండుగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అప్పుడు అటు సాధువు రూపంలో వచ్చిన స్వామి 'ఆ ఓడలో ఏమున్నాయి అబ్బాయి' అని అడుగుతారు. అందుకు సమాధానంగా 'ఆ ఓడలో ఏముంటాయి రాళ్ళూ రప్పలు తప్ప!' అని సమాధానం ఇస్తారు. వారు ఆ ఓడ ఎక్కి చూస్తే సంపద మొత్తం చెత్తగా మారిపోతుంది. వచ్చినవాడు సాధువు, అతనికి డబ్బుపై మమకారం ఉండదు, అయినా అసత్యం పలికారు, సత్యమే పరమాత్మ. పరమాత్మను ప్రక్కకుతోసారు, దిక్కరించారు, మోసం చేయాలనుకున్నారుం, పర్యవసానం అనుభవించారు. ఆ కధను బాగా గమనించండి. భగవంతునికి మనం మొక్కిన మొక్కు తీర్చకపోవడం వల్ల కోపం రాదు. ఆయనకు కొబ్బరికాయలు, పూలదండలు అవసరం లేదు.

అయ్యో! వీడు నా దగ్గరే అబద్ధం ఆడుతున్నాడు. నా దగ్గరే ఇంతకు తెగిస్తే, ఇక లోకంలో అన్ని అకృత్యాలు చేస్తాడు, అన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఎంతమందిని మోసం చేస్తాడో అని పరమాత్మ భావిస్తాడు. అందుకే మొక్కు తీర్చలేదని శిక్షిస్తాడు. మొక్కు తీర్చకపోవడమంటే ఆడినమాట తప్పడం. అది ఆయన దగ్గర తప్పితేనే శిక్షిస్తాడు అనుకోకండి. పరమాత్మ ఎప్పుడు సత్యం వైపే ఉంటాడు. సత్యమే గెలుస్తుంది.

జీవితంలో ఎవరి కోసం సత్యంగానో, అసత్యంగానో బ్రతకవలసిన అవసరమేమిటి? మీకోసం సత్యంగా బ్రతకండి, మీ జీవితాలను ఉద్ధరించుకోవడం కోసం సత్యంగా బ్రతకండి. ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. మీ బలహీనతలను పరమాత్మ ముందు అంగీకరించండి. మీలో దుర్గుణాలను నిస్సందేహంగా అంగీకరించి, మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఇది కాలం కాదు, ఇలా బ్రతకలేమంటూ సమర్ధించుకోకండి. అదే ధర్మం చెప్తుంది. సత్యం ధర్మాచరణలో ముఖ్యమైన అంశం.

To be continued...........

No comments:

Post a Comment