Monday, 30 June 2014

హిందూ ధర్మం - 93 (సనాతనధర్మం)

ఇప్పటివరకు చెప్పుకున్నవి ధర్మం యొక్క లక్షణాలు. ధర్మాన్ని పాటించాలనుకునేవారు ఆ లక్షణాలను అలవర్చుకోవాలని మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి చెప్తున్నాయి. నిజానికి పాటించడం, పాటించకపోవడం అని ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ప్రతి మనిషిలో ఈ లక్షణాలు ఉండాలి. అవి లేనప్పుడు లోకంలో అశాంతి, అభద్రతాభావం పెరుగుతాయి. ఇదిగాకా ధర్మం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

ధర్మాన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి సామన్యధర్మం అంటే విశ్వధర్మం. రెండవది విశేష ధర్మం. ఇంతవరకు మన చెప్పుకున్నది సామాన్యధర్మం. అది అందరు అన్నివేళలా, అన్ని ప్రదేశాల్లో, అన్ని కాలాల్లో పాటించవలసినది. అది కాకుండా విశేష ధర్మం అని ఉంటుంది. అది వ్యక్తులను, దేశాన్ని, వర్ణాన్ని, ఆశ్రమాన్ని అనుసరించి మారుతుంది.

విశేష ధర్మం అనేక విధాలుగా ఉంటుంది. సనాతనధర్మం - మొత్తం విశ్వానికి సంబంధిచినది, సామాన్యధర్మం, వర్ణాశ్రమ ధర్మం, స్వధర్మం, యుగధర్మం, కులధర్మం, మానవధర్మం, పురుష ధర్మం, స్త్రీధర్మం, రాజ ధర్మం, ప్రజా ధర్మం, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం ప్రధానంగా చెప్తారు స్వామి శివానంద.

సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, పురాతన ధర్మం అని అర్దం. ఈ ధర్మానికి మూలం వేదం. ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి ఆచరిస్తున్న ధర్మం ఇదే. దీనికి ఒకప్పుడు పేరు లేదు, ఎందుకంటే ప్రపంచంలో ఇది తప్ప వేరే జీవనవిధానం లేదు. గత 197.5 కోట్ల సంవత్సరాల నుంచి గత 5000 ఏళ్ళ క్రితం వరకు ఇది ఒక్కటే ప్రపంచజనాభా ఆచరిస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉందనడానికి  ఆధారం ఏంటి అంటారేమో?

ఆ మధ్య అమెరిక ఖండంలోని ఒక దేశపు అడవిలో ఒక పెద్ద శిల బయటపడింది. దాని మీద ఏవో పురాతన లిపి ఉందని గమనించి, పరిశోధన చేశారు. చాలామంది నిపుణులు వచ్చి తేల్చిందేమంటే ఆ లిపి కొన్ని లక్షల ఏళ్ళ క్రితం లిఖించబడిందని. అంతా బాగానే ఉంది కానీ, ఆ గీతలలో అర్దం ఏమిటో అక్కడున్న సిబ్బందికి అంతుచిక్కలేదు. ఇంతలో అక్కడున్న పని చేస్తున్న భారతీయుడు వచ్చి అది శ్రీ చక్రం అని గుర్తించాడు. శ్రీ చక్రం ఆదిశక్తి స్వరూపం. భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో, సముద్రానికి అవతల దొరికిన ఒక ఆధారం ఇది.

To be continued ................

Sunday, 29 June 2014

ఆషాఢమాసం విశిష్టత



ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.

Saturday, 28 June 2014

హిందూ ధర్మం - 92 (తపస్సు)

తపస్సు - ధర్మాన్ని ఆచరించేవారిలో కనిపించే లక్షణం తపస్సు అంటున్నది యాజ్ఞవల్క్య స్మృతి. ఏంటండి? ధర్మాన్ని ఆచరించాలంటే మీసాలు, గడ్డాలు పెంచుకుని, అందరిని వదిలి, అడవిలోకి వెళ్ళాలా? అనకండి. తపసు అంటే ఇక్కడ నిరంతరం ఉన్నత స్థితిని చేరుకోవాలని తపించడం, దానికోసమే ప్రయత్నించడం అని అర్దం. ఎవరైనా ఒక వ్యక్తి అనుకున్నది సాధిస్తే, అతడి దాని కోసం తీవ్రమైన తపస్సు చేశాడండి అంటాం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో విషయాల కోసం నిరంతరం తపిస్తూ ఉంటాడు. కొందరు గొప్ప ఉద్యోగం కోసం, మంచి జీతం కోసం, ఇంకొకరు ఆస్తులు సంపాదించడం కోసం, వెరొకరు శరీర అందాన్ని కాపాడుకోవడం కోసం, ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏదో ఒక దానిని పొందాలని తపిస్తూనే ఉంటారు. కానీ నిజంగా వీటిని తపస్సుగా పరిగణించాలా?

లౌకిక విషయల కోసం వెంపర్లాడి, సాధించినా, తాత్కాలికమైన ఆనందం లభిస్తుంది కానీ, దీర్ఘకాలంలో అది దుఃఖానికి కారణమవుతుంది. మనిషి ఆశాజీవి. ఎంత ఆశాజీవి అంటే, లక్ష రూపాయల జీతం కోసం కష్టపడి, ఉదోగ్యం సాధించినా, ఇంకో లక్షవస్తే బాగుండని దాని కోసం ప్రయత్నిస్తాడు. అది సాధిస్తే, ఇంకో లక్షకోసం. ఆస్తుల విషయంలో కూడా అంతే. ఎన్ని ఆస్తులున్నా, ఇంకా ఇంకా కూడబెట్టాలన్న తపన. కొన్ని తరాలను పోషించదగ్గ సంపద ఉన్నా, ఇంకా పోగు చేసి, మరింత ధనవంతుడిని కావలనే తపన, ఏదో వెంపర్లాట. ఇది జీవితాంతం ఉంటుంది. నిజానికి జీవితం మొత్తం ఈ వెంపర్లాటలోనే గడిచిపోతుంది. యవ్వనంలో సంపాదించడం కోసం కష్టపడతాడు, ముసలివయసు రాగానే రోగాలను నయం చేసుకోవడం కోసం మొత్తం సంపద ఖర్చు చేస్తాడు. ఇదంతా గమనించిన వ్యక్తిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. చచ్చేటప్పుడు నేను వీటిని కట్టుకుపోను, మరి వీటి కోసం ఇంత ఆందోళన ఎందుకు అనిపిస్తుంది. మరణం తర్వాత మనిషి వెంబడి వచ్చేవి కర్మల ఫలితాలు, అంటే పాపపుణ్యాలు మాత్రమే.

ఆ ఆలోచన వ్యక్తిలో మార్పు తీసుకువస్తుంది. నేను జీవితంలో నిజాయతీగా, నీతిగా, వేదం, పురాణం, స్మృతులు, ఋషులు చెప్పినట్టుగా జీవించాలి. ధర్మాన్ని అనుసరించాలి, దైవాన్ని ఉపాసించి, మోక్షాన్ని పొందాలి అనే సంకల్పం జనిస్తుంది. ఆ సంకల్పం వ్యక్తి నడవడికను పూర్తిగా మార్చేస్తుంది. నేను దైవం మెచ్చేలా గొప్పగా జీవించాలి, నా జీవిన విధానంతో దైవాన్ని మెప్పించాలి, నేను దైవాన్ని చేరడం కాదు, దైవం నన్ను హత్తుకుని తనలో ఐక్యం చేసుకోవాలన్న తపన అతని ప్రతి అణువులో నిండిపోతుంది. అతని శరీరం ఎప్పుడు ఆ ఆలోచనతో గడుపుతుంది. దాని కోసం వ్యక్తి తీవ్రమైన సాధన చేస్తాడు. కష్టసుఖాలు, ఆకలిదప్పికలు, శీతోష్ణాలు అతనిని ప్రభావితం చేయవు. ఇదంతా ఒక్క క్షణంలోనో, రోజులోనో, సంవత్సరంలోనో జరగదు కానీ సాధన వల్ల తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇటువంటి శాశ్వతమైన, గొప్పదైన, అక్షమైన స్థితి కోసం తపించడమే తపస్సు అన్నది గురువుల సందేశం.

To be continued ................

Friday, 27 June 2014

స్వామి వివేకానంద సూక్తి

పైపైన కనిపించే హీనత క్రింద మరుగుపడి ఎంత మహత్తు ఉందో మీకెలా తెలుస్తుంది. మీ మహత్తు గురించి మీకు తెలిసింది అత్యల్పం. మీలో అనంత సింధువును పోలిన శక్తిదాగి ఉంది.

- స్వామి వివేకానంద 

Wednesday, 25 June 2014

అబ్రహం లింకన్ తన కుమారుని ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ....

అబ్రహం లింకన్ తన కుమారుని ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ....

ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

ప్రియమైన ఉపాధ్యయులారా, నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.

మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ - మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ - వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని - ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.

ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి
అయితే అదే సమయంలో... ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.

వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.

అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.
అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.
మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి. వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి. అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.

సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి,,,

వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు

జాగ్రత్తగా చూసుకోండి.....

Monday, 23 June 2014

హిందూ ధర్మం - 91 (నిర్మలమైన, ప్రశాంతమైన మనసు)

ఎల్లప్పుడు ప్రశాంతమైన, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆనందంలో మాట ఇవ్వకూడదు. కోపంలో సమాధనం చెప్పకూడదు. ఎప్పుడైతే మనసు ఆవేశానికి గురవతుందో, అప్పుడు వ్యక్తి మంచి, చెడులను వేరు చెయగల బుద్ధిని కోల్పోతాడు. మనసుపై ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా ఆలోచనాశక్తి కుంటుపండుతుంది. ఆలోచనాశక్తి క్షీణిస్తే, సమస్యకు సరైన పరిష్కారం దొరకదు సరికదా, అప్పుడు తీసుకునే నిర్ణయాలు కొత్త సమస్యలను తీసుకువస్తాయి.

మనిషికి కలిగే అనేక సమస్యలు కారణం మనసు, దాని ఆలోచనా విధానమే. మనసు ముందే భవిష్యత్తును ఊహించుకుని, ఇదిలా జరుగుతుంది, ఇది జరగదు అని కొన్ని నిర్ణయాలకు సిద్ధపడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే ఒక విధమైన మార్పును ఆశిస్తూ, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనసు అనుకున్నది జరగలేదో, అప్పుడు మనసులో అలజడి మొదలవుతుంది. నిజానికి సమస్య అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. మనం అనుకున్నట్టుగా జరగపోతే, అదే సమస్య అని, కష్టం అని మనసు మభ్యపెడుతుంది. దీనికి కారణంగా జరగబోయే పరిణామలను అంగీకరచపోగా, మనం అనుకున్నదే జరగాలని కోరుకోవడం. ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు, జరిగిన దానిని అంగీకరించి, తదుపరి ఏం చేయాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. జరిగింది ఎలాగో మార్చలేము, కనీసం జరగవలసింది సక్రమంగా జరిగేలా చూసుకోవాలి. ఆందోళన మొదలవుతోందనగానే కళ్ళు మూసుకుని, కాసేపు దృష్టి మొత్తం ఊపిరు మీద పెట్టి, ఊపిరిని గమనించాలి. దీంతో మనసు ప్రశాంతతను పొందుతుంది.  

కోపం, ఆవేశం, బాధ మొదలైన భావాలకు లోనైనప్పుడు ఎవరు మంచి మాటలు చెప్పినా, అవి వినపడవు. ఇంతకముందు మనం నేర్చుకున్న మంచి విషయాలు గుర్తుకురావు. సంతోషం కూడా అంతే. ఆ క్షణం వరకు అది మనసుకు తాయిలం లాంటిది. సంతోషంలో ఆలోచించకుండా ఏవోవో వాగ్ధానాలు చేస్తే, ఒక్కోసారి అవి తీర్చలేక ఇబ్బంది పడవచ్చు. రాజకీయ నాయకులు కూడా ఈ సూత్రాన్నే పాటిస్తారు. ప్రజలను ఎప్పుడూ ఎదో ఒక కారణంతో రెచ్చగోట్టాలనే చూస్తారు, సఫలం కూడా అవుతారు. రెచ్చగొట్టడం వల్ల ప్రజల మనసులో కలిగిన అలజడిని ఓట్లుగా మార్చుకుంటారు. అలాకాక జనం ఎటువంటి ఒత్తిళ్ళకు లోనవకుండా ఆలోచిస్తే, దేశం ఇలా ఎందుకుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, అలజడి రేగిన మనసు ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో చెప్పటానికి.

అందుకని యాజ్ఞవల్క్య మహర్షి నిర్మలమైన, ప్రశాంతమైన మనసు కలిగి ఉండమని చెప్తున్నారు.

To be continued ..............

Sunday, 22 June 2014

హిందూ ధర్మం - 90

పైన ఒక వ్యక్తి/ వ్యవస్థ ఉండి, చేసిన తప్పులకు శిక్షిస్తుంటే బాధపడని వ్యక్తులు లోకంలో ఎవరూ ఉండరు. చేసిన తప్పుకు చింతించకపోయినా, శిక్షకు భయపడతారు. కానీ వ్యక్తికి మొత్తం స్వేచ్చని ఇచ్చి, శిక్ష గురించి అతనికి ఏ భయం లేనప్పుడు అతను ఎలా స్పందిస్తాడన్నదే ముఖ్యం. ధర్మం కూడా అదే అంటున్నది. ఎటువంటి వ్యవస్థ లేకపోయినా, నీకు నువ్వుగా చేసిన తప్పును తెలుసుకుని, నడవడికను మార్చుకోవడం ఉత్తమ లక్షణం. ఈ రోజు కాలం మారిందన్న నెపంతో పెడదారి పట్టి ఎన్నో తప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. పోని చేసిన తప్పును గుర్తించి బాధపడతారా అంటే అదీ లేదు. ఇదంతా ఫ్యాషనండి, అందరూ ఇలాగే చేస్తున్నారు అంటూ సమర్ధన ఒకటి. అలా సమర్ధించుకునే వాడు ఇంకేం బాగుపడతాడు.

హ్రీః అంటే సిగ్గు పడటం, పశ్చాత్తాపం చెందటం అనే అర్దాలున్నాయి. పైన ఒకడు ఉన్నాడు, వాడు అన్నీ చూస్తున్నాడు, నేను తప్పు చేసి భగవంతుని ముందు ఎలా నిల్చోను? ఈ రోజు కాకపోయినా, మరణించినా తర్వాత ఎందుకిలా చేశావ్? అని ఆయన అడిగితే ఏమని సమాధానం చెప్పను \, పోని రేపు ఏదైనా కష్టం వస్తే, తప్పు చేసిన నేను ఆయన ముందు వెళ్ళి, ఎలా మొహం చూపించగలను అన్న భావన మనసులో గట్టిగా ఉంటే చేసిన తప్పుడు పనులకు భాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి పశ్చాత్తాపం కలిగి, క్రమంగా మార్పు వస్తుంది. ఇంకెప్పుడు తప్పు చేయము.

యువతనే తీసుకోండి. మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం, వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఫ్యాషన్, ఆధునికత అని సమర్ధించుకుంటూ పతనం అవుతున్నారే కానీ, తప్పు చేస్తున్నామనే భావన, చేసిన దానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒక యువతే కాదు, ఎవరైనా. మన ప్రవర్తనతో, మాటలతో, లేక ఇతర విధానాల ద్వారా ఇతరుల పట్ల చేసిన అపరాధాలను అహంకారంతో వెనకేసుకురాకుండా, చేసినదానికి సిగ్గు పడాలి. ఎవరో చుశారని కాదు, ఎవరికో తెలుస్తుందని కాదు. నువ్వు చేసిన తప్పులు ఆధ్యాత్మిక మార్గంలో అవరోధాలుగా మారి, నిన్ను భగవంతుని నుండి దూరం చేస్తాయని. మానవజన్మ రావడమే ఎంతో కష్టం. అందులోనూ భగవంతుని మీద భక్తి కలగడం ఇంకా సుకృతం. వచ్చిన జన్మను సద్వినియోగం చేసుకుని పరమాత్మను చేరాలే కానీ, ఈ అవకాశాన్ని విడుచుకుంటే, ఇంకొన్ని కోట్ల జన్మలవరకు వేచి ఉండవలసి వస్తుంది. అప్పుడు కూడా మోక్షం వస్తుందని చెప్పలేం. ఇదే మంచి అవకాశం. ఇంత మంచి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నామని బాధ మొదలైతే, చేసిన తప్పులు సిగ్గు పడతాం, దాని నుండి పశ్చాత్తాపం కలిగి, చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే యజ్ఞవల్క్య మహర్షి హ్రీః - పశ్చాత్తాపం కలిగి ఉండటం, చేసిన తప్పులకు సిగ్గు పడటం ధర్మాన్ని ఆచరించేవారికి ఉండవలసిన లక్షణం అని ఉద్భోదించారు.

To be continued ............

Saturday, 21 June 2014

హిందూ ధర్మం - 89 (నిజమైన పశ్చాత్తాపం)

వందలమంది నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఉగ్రవాది 'నాకు బ్రతకాలని వుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించి ప్రాణబిక్ష పెట్టండి' అని వేడుకున్న సందర్భాలు మనం చాలా చూశాం. నిజంగా అది పశ్చాత్తాపం అంటారా? ఆ ఉగ్రవాది చేసిన మారణకాండను వేలమంది జనం ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సాటి మనుష్యులని జాలి కూడా చూపించకుండా, మూర్ఖత్వంతో ప్రవర్తించాడు. అతను చేసిన దానికి, ఒక్కసారేమిటి వందల సార్లు ఉరి తీసినా, తప్పులేదు. కానీ పశ్చత్తాపడుతున్నాడని చెప్పి, నాటకం ఆడుతున్నాడు. అతను చేసిన తప్పుకు బాధపడడంలేదు, ఉరిశిక్ష పడిందని మరణభయంతో నాటకాలు ఆడుతున్నాడు. అతనిలో కలిగిన భయం అతని జీవితాన్ని రక్షించుకోవడం కోసమే, అది సెల్ఫ్ డిఫెన్స్. నిజంగా పశ్చాత్తాపడేవాడైతే, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడినా, అయ్యో నేను ఎంత మంది పొట్టనబెట్టుకున్నాను, నా వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, వాళ్ళను చంపినప్పుడు ఎంత బాధ వళ్ళు అనుభవించి ఉంటారో, నన్ను చంపినా తప్పులేదు అని నిరంతరం ఆవేదన చేందుతాడు. అతనికి వేరే శిక్ష అవసరంలేదు, పశ్చాత్తాపమే అతన్ని నిలువునా కాల్చి వేస్తుంది. కానీ ఉగ్రవాదుల్లో ఇటువంటి మార్పు కలగదని చెప్పుకోవచ్చు.

ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, ఒక వ్యక్తి రాత్రి సమయంలో తన స్కూటర్ మీద వెళుతున్నాడు. రోడ్డు మధ్యలో చిన్న కుక్కపిల్ల పడుకుని ఉంది. అది గమనించకుండా అతని దాని మీద నుంచి బండి నడిపించాడు. బండి రెండు చక్రాలు దాని శరీరం మీద నుంచే వెళ్ళగా, అది గట్టిగా అరించింది. కానీ బ్రతికింది. ఈ సంఘటన ఎవరు చూడలేదు. అతను బండి ఆపకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి బాధపడి, దగ్గర్లో ఉన్న పురోహితుని వద్దకు వెళ్ళి, విషయం చెప్పగా, నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగే పాపం కూడా తెలిసి చేసిన, తెలియక చేసిన, ఫలితం అనుభవించవలసిందేనని గట్టిగా చెప్పారు. ఇప్పుడు వ్యక్తి తనకు ఎప్పుడో శిక్ష పడుతుందని భయపడి, నేను ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి, ఏం దానమివ్వాలని, చేసినదానికి బాధపడితే, అది పశ్చాత్తాపం అవుతుందని చెప్పలేం. 'నేను ఎంత పని చేశాను. రోడ్డు సరిగ్గా చూడకుండా బండి నడిపాను. నా బండిచక్రాల క్రింద అది నలగడం వల్ల దానికి ఎంత బాధ కలిగిందో, దాన్ని నేను ఇంటికి తెచ్చుకుని వైద్యం చేయిస్తే బాగుండు' అని భావించి, ఆ సంఘటన తలుచుకున్న ప్రతిసారీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, ఆనాడు అది అనుభవించిన బాధను ఇతను నిరంతరం అనుభవిస్తూ, నేను చేసిన పాపానికి ఏ శిక్ష పడితే ఏంటి, దాన్ని ఎంతగా బాధపెట్టానో అని ఆవేదన చెందుతుంటే అది నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడ ఆత్మ రక్షణ కొంచం కూడా లేదు. తను ఇతరులకు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని, బాధించిన విధానాన్ని తలుచుకుని, అది తనకు జరిగితే ఎంత బాధాపడతాడో, ఇతరులకు జరిగినందుకు అంతే బాధాపడతాడు. ఇతరులు అనుభవించిన బాధనే తానూ అనుభవించడం, ఎవరూ శిక్షించకుండానే. అన్నిటిలో ఉన్న ఆత్మను అంగీకరిస్తేనే కానీ, ఈ స్థితి రాదు. ఇటువంటి పశ్చాత్తాపమే నిజమైన పశ్చాత్తాపం.      

To be continued ....................

Thursday, 19 June 2014

హిందూ ధర్మం - 88 (పశ్చాత్తాపం)

సత్యమస్తేయమక్రోధో హ్రీ శౌచం ధీధృతిర్దమః |
సమ్యతేద్రీయతా విద్యయా ధర్మం సర్వ ఉదాహృతః ||

- యాజ్ఞవల్క్య స్మృతిః

సత్యం, అస్తేయం, అక్రోధము, పశ్చాత్తపాము, శౌచము, బుద్ధిని ఉపయోగిచడం, ధృతి, దమము, ప్రశాంతమైన మనసు, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, విద్యను అభ్యసించడం మొదలైన లక్షణాలతో జీవితాన్ని గడిపితే, అది ధర్మాన్ని ఆచరించమవుతుందని యాజ్ఞవాల్క్య స్మృతిలో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పారు.

ఇందులో కొన్ని లక్షణాల గురించి ఇంతకముందే చెప్పుకున్నాం. హ్రీః అంటే పశ్చాత్తాపం కలిగి ఉండటం. చేసిన తప్పును అంగీకరించి, దానికి చింతించి, ఇంకెప్పుడు ఇలా నేను చేయను అని గట్టిగా సంకల్పించుకుని, సంకల్పాన్ని నెరవేర్చడం. ఎప్పుడైనా మనం తప్పు చేయగానే ముందు అహం పైకి వస్తుంది. అహకారం కారణంగా చేసిన తప్పును ఒప్పుకోకపోగా, దాన్ని సమర్ధించుకుంటారు. తప్పు ఒకరు చేసినా, ఇద్దరు చేసినా, లోకమంతా చేసిన అది తప్పే. అందరూ తప్పు చేస్తున్నంతమాత్రం చేత అది ఒప్పు అవ్వదు. అందరూ తప్పు చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటని సమర్ధించుకోవడం అధర్మం అంటున్నారు మహర్షి. అలా కాక చేసిన నేరానికి సిగ్గుపడాలి. పశ్చాత్తాపం అగ్ని వంటిది, అది వ్యక్తి శిలాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతుంది, అహకారం కూడా అగ్నిలాంటిదే కానీ అది వ్యక్తిని పూర్తిగా కాల్చి భస్మం చేస్తుంది.

పశ్చాత్తాపం అన్నది నటన కాకూడదు. చాలామంది తప్పు చేసిన తర్వాత శిక్షపడుతుందని భయంతో అయ్యో! ఇలా చేయకపోయి ఉంటే బాగుండేదే అని బాధపడుతుంటారు. దాన్ని పశ్చాత్తాపంగా భావించకూడదు. శిక్షపడుతుందనే భయం వలన ఏర్పడిన భావన అది. పశ్చాత్తాపానికి గూరైన వ్యక్తి శిక్ష తప్పించుకోవాలాని చూడడు. అసలు అతనికి శిక్ష గురించి పట్టింపే ఉండదు. నేను ఎంత పాపం చేశాను, నాకు శిక్షపడినా తప్పు లేదు, నాకు శిక్షపడాల్సిందే, నేను చేసిన పని వల్ల అవతలివారు ఎంత బాధపడి ఉంటారో అన్న భావన వస్తుంది. ఆ వ్యక్తికి శిక్ష పడకపోయినా, అతను మానసికంగా నిరంతరం ఆవేదన చెందుతూనే ఉంటాడు, లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. అటువంటి పశ్చాత్తాప లక్షణాన్ని కలిగి ఉండడం ధార్మికును ఒక లక్షణం అన్నారు యాజ్ఞవల్క్య మహర్షి.  

To be continued .....................

Wednesday, 18 June 2014

హిందూ ధర్మం - 87

అస్తేయం గురించి ఇంతకముందు చెప్పుకున్నాం. ఇంకొంత సులువుగా రోజువారి జీవితంలో ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఏ పని చేస్తున్నా, పనిని సక్రమంగా, నిజాయతీగా చేయాలి. ఆఫీస్‌కు సమయానికి వెళ్ళి, అక్కడ నిర్దేశించిన పనిని పూర్తి చేసుకుని రావాలి. పనియే దైవం అన్న సూక్తి ఉన్నమాట వాస్తవమే. ఏ పని చేస్తున్నా, అది ఈశ్వరునికి పూజగా భావించి చేయాలి. అంతమాత్రనా ఓవర్-టైం చేయమని అర్దం కాదు. ఆఫీస్ పనిగంటల్లో ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేస్తే చాలు. ఎటువంటి లంచాలు ఆశించకుండా, అక్రమాలకు పాలపడకుండా విధులు నిర్వర్తించాలి. ఇది అస్తేయం. అలా కాకుండా ఆఫీస్‌కు సమయానికి రాక, వచ్చినా పని పూర్తి చేయక, అక్రమాలకు పాల్పడడం స్తేయం. అంటే పాపం, అధర్మం.

నన్ను ఎవరు చూస్తారండి, దేవుడే నాకీ అవకాశాన్ని ఇచ్చాడు, అందుకే లంచాలు తీసుకుంటున్నాను అని కొందరు సమర్ధించుకుంటారు. కొందరు హుండీలో కాస్త అవినీతి సొమ్ము వేసి, పాపప్రక్షాలన జరిగిందని భావిస్తారు. మీరు తప్పు చేస్తున్నట్టు ఎవరో చూడనవసరంలేదు. మీలోనే ఒకడు ఉండి చూస్తున్నాడు, అన్నిటిని జాగ్రత్తగా ఎంతో చిత్రంగా, చాలా గుప్తంగా నమోదు చేస్తున్నాడు. వారినే చిత్రగుప్తుడు అంటారు. సూక్ష్మశరీరానికి ప్రతీక చిత్రగుప్తుడు. మనిషి మరణించిన తర్వాత అతను చేసిన పాపపుణ్యాల చిట్టాను బయటకు తీసేది ఈయనే. ఇక ఈయనకు తోడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైన భగవంతుడు ఉండనే ఉన్నాడు. వ్యక్తి మనసులో ఒక భావం జన్మించగానే అతనికి తెలిసిపోతుంది. అటువంటిది మనం చేస్తున్న పనులు పసిగట్టలేడా? మనం చేస్తున్న తప్పులు ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టుకోరు అంటూ మనల్ని మనం సమర్ధించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం.  ఇతరులను మోసగించడం ప్రక్కన పెట్టండి. ముందు స్వీయమోసం సంగతి ఏంటి?

ఒకడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, నేను వాడిని మోసం చేయలేను అని గట్టిగా సంకల్పించి, పరమాత్మను నమ్మి నీతిగా సంపాదించి జీవించడం అస్తేయం, సత్యం, ధర్మం కూడా. తద్విరుద్ధంగా జీవించడం పాపం. ఈ విధంగా మనుమహర్షి ధృతి, క్షమా, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ, విద్యా, సత్యం, అక్రోధః అనే పది ధర్మాలను వివరించారు. ఈ పది సామాన్య ధర్మాలనీ, వర్ణ, జాతి, ప్రాంతీయ బేధాలు లేకుండా, అందరూ వీటిని పాటించాలని తన స్మృతిలో పేర్కొన్నారు. ఈ పది ధర్మాలను పాటిస్తే, అతడు ధర్మాన్ని కొంతమేరకైన పాటిస్తున్నాడని గుర్తని చెప్పారు.

To be continued ................

Tuesday, 17 June 2014

హిందూ ధర్మం - 86 (దమము)

దమము అంటే మనసును చెడు నుంచి నిగ్రహించడం. పూర్వం ఒక సాధువు ఉండేవారు. ఆయన భోధనలు వినడానికి చాలామంది వచ్చేవారు. అందులో ఒకాయనకు బాగా డబ్బు గలవాడు. అతను ఎన్ని బోధనలు విన్నా, మనసు వాటిని స్వీకరించేది కాదు. ఆ విషయాన్ని సాధువుకు చెప్పి, ఏదో ఒకరోజు తన ఇంటికి బిక్షకు రమ్మని ఆహ్వానించాడు. చాలా రోజుల తర్వాత సాధువు ఈ ధనవంతుడి ఇంటికి భిక్షకు వెళ్ళగా, అతను రుచికరమైన వంటలను తయారు చేయించాడు. బిక్ష వేసే సమయానికి సాధువు తన ఇసుకతో నిండిన భిక్షా పాత్రను ధవంతుడు ముందు పెట్టాడు. ఆ పత్రను చూసి, అందులో భిక్ష వేయడానికి నిరాకరించాడు ధనవంతుడు. 'ఆగిపోయావేం? భిక్ష వేయవా?' అన్నారు సాధువు. అందులో భిక్ష ఎలా వేయాలి స్వామి? పాత్ర మొత్తం దుమ్ముధూళితో ఉంది అని బదులిచ్చాడు ధనవంతుడు. దానికి బదులుగా సాధువు 'అంతేనాయానా! మలినమైన పాత్రలో భిక్ష వేస్తే, అది స్వీకరించడానికి అర్హత కోల్పోతుందని ఆలోచించావు. మరి మలినమైన మనసు మంచి విషయాలను ఎలా స్వీకరిస్తుంది చెప్పు? నీవు ముందు చెడు విషయాలను విసర్జించు. మనసుకు మంచి విషయాలనే అందించు. అప్పుడు మనసు శుద్ధి చెందుతుంది. పరిశుద్ధి చెందిన మనసు గురువు ఉపదేశాలను యధావిధిగా స్వీకరిస్తుంది' అని వెళ్ళిపోయాడు. ఈ కధ మనకు బోలెడు నీతిని చెప్తోంది.

మనసు ఎప్పుడు చెడు విషయాలను చూచుటకు, వినుటకు, మాట్లాడుటకు, ఆలోచించుటకు అలవాటు పడితే, ఇక మంచిని ఎలా స్వీకరిస్తుంది. స్వీకరించినా, ఎలా ఆచరించగలుగుతుంది. అందుకే ధర్మాన్ని ఆచరించేవారు దమాన్ని (మనో నిగ్రహాన్ని) పాటించాలంటారు మనుమహర్షి. మన ఇంట్లో దేవుడు ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఎక్కడైనా పెట్టవలసి వస్తే, ఎంత జాగ్రత్త చూపుతాం. సరైన స్థలం చూస్తాం, అది శుచిగా ఉందో లేదో చూస్తాం, అక్కడ మళ్ళీ ఒకసారి శుభ్రం చేసి, అప్పుడు ఫోటో తగిలిస్తాం. అంతేకానీ మేకు ఉందని తీసుకెళ్ళి అశుద్ధమైన ప్రదేశంలో తగిలిస్తామా? ఇంట్లో ఫొటో తగిలించడానికే అంత జాగ్రత్త చూపిస్తే, మనసులో దేవుడిని నిలపడానికి ఇంకెంత జాగ్రత్త పడాలి. మనసు కుళ్ళు, కోపం, కుట్రలు, చెడు ఆలోచనలతో నిండి ఉంటే, ఇక అందులోకి దేవుడు ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించినా, ఆయన కూర్చోడానికి సరైన స్థలమే లేకుండా మనసును దుష్ట ఆలోచనలతో నింపితే, ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అది మనం పరమాత్ముడికి చేసే అవమానం కాదా? అందుకే దమాన్ని పాటించమన్నారు పెద్దలు. మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము.

 To be continued .................

Monday, 16 June 2014

హిందూ ధర్మం - 85 (ఇంద్రియ నిగ్రహం)

ఇంద్రియ నిగ్రహం గురించి మరికొంత చెప్పుకుందాం. భగవంతుడు మనకు అడగకుండానే అన్నీ ఇచ్చాడు. పంచజ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను ఇవ్వడమే కాకుండా వాటికి గ్రహణ శక్తిని కూడా ఇచ్చాడు. ఒకసారి ఊహించుకోండి. కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు, మన ముందు పెద్ద లోయ ఉన్నా తెలియదు, పూలదారి ఉన్నా తెలియదు. నాలుక ఉంది కానీ రుచి తెలియదు. చెవులు ఉన్నాయి కానీ అవతలవారు ఎంత గట్టిగా అరిచినా కూడా వినిపించదు, చర్మం ఉంది కానీ స్పర్శ తెలియదు. మనకు ఇష్టమైనవారు ముట్టుకున్నా, ఒంటికి నిప్పు తగిలినా తేడా ఉండదు. కళ్ళు ఉన్నాయి కానీ నడవలేని పరిథితి. చేతులు ఉన్నా ఒక వస్తువును అటు నుంచి తీసి ఇటు పెట్టలేడు. నోరు ఉంది కానీ మాట్లాడలేడు. ఎంత నరకం అది. కానీ భగవంతుడు కరుణామయుడు కనుక అడగకుండానే ఇంద్రియాలను ఇచ్చాడు, వాటికి గ్రహణ శక్తిని కూడా ఇచ్చాడు. ఇవన్నీ భగవత్ ప్రసాదంగా మంచి పనులకు వాడుకోవడం, మంచికి ఉపయోగించడం ఇంద్రియ నిగ్రహం.

అలా కాకుండా ఇంద్రియాలను దుర్వినియోగం చేయడం పాపం. ఇచ్చిన వస్తువులతో పిల్లాడు సక్రమంగా ఆడుకుంటే, అమ్మ ఇంకొన్ని ఆట వస్తువులు కొనిస్తుంది. అదే ఉన్న వస్తువులతో ఆడుకోవడం మానేసి, దుర్వినియోగం చేస్తే, ఉన్న వస్తువులు కూడా లాగేసుకుంటుంది. ఇది కూడా అంతే. దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనడం కాదు, అదగకుండానే మీకు అవసరమైనవన్నీ ఇచ్చాడు, కష్టపడే శక్తిని ఇచ్చాడు. దాన్ని గుర్తించాలి. అలా కాకుండా మీకు బోలెడు డబ్బు ఇచ్చి, సుఖనిద్రను, ఆకలిని దూరం చేసి ఉంటే? పడుకోడానికి మంచి మంచం ఉంది, మెత్తని పరుపు ఉంది, కానీ నిద్రపట్టదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది గమనించి భగవంతుడు ఇచ్చిన అవయవాలను/ఇంద్రియాలను సక్రమంగా వాడుకోవడం, చెడు నుంచి నిగ్రహించడం ఇంద్రియ నిగ్రహం.

ఆయన ఇచ్చిన వాక్కుతో కష్టాల్లో ఉన్నవారని ఓదర్చాలి. వీలునప్పుడు భగవన్నామం చెప్పచ్చు, ఒక భజనలో పాల్గొనవచ్చు, జపం చేయచ్చు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చాడీలు చెప్పుకుని సమయం గడపచ్చు. ఏం చేస్తామో మన ఇష్టం, కానీ మనం వాటిని ఉపయోగించిన దాన్ని అనుసరిచి మనకు వచ్చే జన్మలో అన్ని ఇంద్రియాలు సక్రమంగా ఇవ్వడమా? లేక ఇవ్వకపోవడమా అన్నది ఆయన నిర్ణయిస్తాడు. మన నడవడిక బట్టి ఉంటుంది. కాళ్ళు ఇచ్చాడు, ఒక తీర్ధయాత్రకు వెళ్ళాలి, క్షేత్రాన్ని దర్శించాలి, సత్సంగం, ప్రవచనం జరుగుతుంటే వెళ్ళాలి. చెవులు మంచి మాటలు వినేలా చూసుకోవాలి. ఇలా క్రమపద్ధతిలో ఇంద్రియాలను ఉపయోగించడం ఇంద్రియ నిగ్రహం.

To be continued .................

Sunday, 15 June 2014

హిందూ ధర్మం - 84 (అక్రోధః)

కోపం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. సంబంధ భాంధవ్యాలను నాశనం చేస్తుంది. కోపిస్ఠి వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి భార్యాపిల్లలు కూడా ఇష్టపడరు. ఈయనతో ఏం చెప్పినా కసురుకుంటారని తమలో తామే అనుకుని, అతను ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడోనని భయపడుతూ, నిరంతరం చస్తూ బ్రతుకుతూ ఉంటారు. మిత్రులు, చుట్టాలు, దగ్గరివాళ్ళు కూడా చనువుగా ఉండడానికి ఇష్టపడరు. ఉదాహరణకు ఎంతదగ్గరివారైనా ఏదైనా ముక్యమైన శుభకార్యం మీద పిలవాల్సి వస్తే, వారం ముందు రండి ని చెప్పకుండా, శుభకార్యం రోజు తప్పకుండా రండి అంటారు. అతను ముందే వస్తే, ఎవరి మీద కసురుకుంటాడో, ఎక్కడ గొడవపడతాడోనని భయం. తెలిసితెలిసి ఆందోళన కొనితెచ్చుకోవడం ఎందుకను భావిస్తారు. ఎదైనా ఒక విషయం పంచుకుందామనుకున్నా, కోపిష్టి వ్యక్తితో పంచుకోరు. ఆయన అంతేనండి, ఆయనకు ఏం చెప్తే ఏం అంటాడో, ఎందుకొచ్చిన గొడవ, మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆఫీస్ యజమాని కోపంగా ఉంటే, ఆ రోజు ఆఫీస్ స్టాఫ్ మొత్తం బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. అదే అతను ఎప్పుడు కోపధారి అయితే, ఇక పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కోపం వల్ల వ్యక్తికి ఎంత చెడు జరుగుతుందో, అతని చుట్టుప్రక్కల ఉన్నవారికి అంతకంటే ఎక్కువ ఆందోళన కలుగుతుంది. కోపిష్టి వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు సరికదా ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తాడు. అటువంటి కోపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు మహర్షులు. కోపం వచ్చిన ప్రతీసారీ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడు తప్పు చేయలేదా? ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే, ఇలాగే ప్రవర్తిస్తానా?  అని ప్రశ్నలు వేసుకోవాలి. కోపం ఎప్పుడు బలహీనులకే వస్తుంది. బలవంతులు ఎప్పుడు కోపగించుకోరు, ఎందుకంటే ఓర్పు కలిగినవాడే నిజమైన బలవంతుడు.

కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించకపోతే పనులు జరగవు. అలాంటప్పుడు కోపం నటించాలే కానీ, కోపానికి గురి కాకూడదు. కోపం అనేదే ఒక దుర్గుణం. దుర్గుణాన్ని విడిచిపెట్టాలే కానీ అదుపు చేసుకోకూడదు అంటారు గురువులు. అక్రోధః - కోపం లేకుండుట - మనుమహర్షి ధర్మానికి చెప్పిన పది లక్షణాలలో ఒకటి.  

To be continued ................

Saturday, 14 June 2014

హిందూ ధర్మం - 83

ఈ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యారని శతానందమహర్షి శ్రీ రామ, లక్ష్మణులకు వివరించారు. తన మార్గంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, అన్నిటిని ఎదురుకుని, ఎన్నో మార్లు విఫలమైనా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు కామక్రోధాది అరిషడ్వర్గాలకు బానిసైనా, తన సంకల్పబలంతో సకల దుర్గుణాలను గెలిచారు. ఈ విశ్వామిత్ర మహర్షే గాయత్రిమంత్రాన్ని సమాధి స్థితిలో దర్శించి, లోకానికి అందించారు. అటు తర్వాత శ్రీ రామ, లక్ష్మణులను తనతో పాటు యాగనిమిత్తం తీసుకువెళ్ళి, పరమశివుడి ద్వారా తనకు వచ్చిన ధనుర్వేదాన్ని రామలక్ష్మణులకు నేర్పించి, లోకకల్యాణానికి బాటలు వేశారు.

కోపం వ్యక్తి యొక్క స్థానాన్ని దిగజారుస్తుంది, సాధనను వృధా చేస్తుంది, ఆధ్యాత్మిక జీవనంలో అడ్డుపడుతుంది. ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి కోపం వస్తుంటుంది, అయితే అది ఎంత సేపు ఉంటుందన్న దాన్ని ఆధారం చేసుకుని మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.

ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం
అధమంచ అహోరాత్రం పాపిష్టే మరణాంతకః

ఉత్తముడైన వాడికి కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. త్వరగా కోపగించుకోరు, ఒకవేళ ఆ పరిస్థితికి వచ్చినా, వెంటనే తగ్గిపోతుంది. రెండవస్థాయి వారికి 48 నిమిషాల వరకు ఉంటుంది. వీరు మధ్యములు. అధములకు కోపం వస్తే ఒక రాత్రి, ఒక పగలు అంటే ఒక రోజంతా ఉంటుంది. పాపిష్టివారని ఉంటారు. వారికి జీవితాంతం, మరణించే వరకు ఉంటుంది. ఇవి మన పూర్వీకులు చెప్పిన మాటలు. వీటిని గుర్తుంచుకుని మనం ఎక్కడ ఉన్నామో, గమనించుకుని, జీవితాలను సంస్కరించుకోవాలి.

జీవించి ఉనంతకాలం ఎప్పుడు వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, అప్పట్లో అదంతా వాడి వల్లనే అయ్యిందంటూ పాపిష్టివాళ్ళు జీవితాంతం ఇతరులను తిట్టుకుంటూనే ఉంటారు. అది చుట్టు ఉన్నవారి మనసులను కలుషితం చేయడమే కాక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు సరికదా, సదరు వ్యక్తి అంటే అందరికి అయిష్టం పుడుతుంది. ఆ వ్యక్తి మీద గౌరవం పోతుంది.

To be continued ....................

Friday, 13 June 2014

హిందూ ధర్మం - 82 (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు)

ఇప్పుడు విశ్వామిత్రుడు అన్ని విధాలుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించించాడు. అతనిలో ఇప్పుడు ఏ దుర్గుణము లేదు. కానీ ఆయన అనుకుంటే , ఆయన శక్తి చేత మూడు లోకాలను నశింపజేయగలడు. అతని తపస్సు వలన అన్ని దిక్కులు వ్యాకులత చెందుతున్నాయి, సముద్రాలు ప్రచండంగా ఉన్నాయి, పర్వతాలు బద్దలవుతాయా అన్నట్టు అనిపిస్తోంది, లోకంలో ఏవీ కూడా ప్రకాశించడంలేదు. ఓ బ్రహ్మదేవా! భూమి కంపిస్తోంది, ప్రచండమైన గాలులు వీస్తున్నాయి, జనం ఆస్తికత్వాన్ని విడిచిపెడతారనే భయం వేస్తోంది. మాకు ఏం చేయాలో తోచడం లేదు. మూడులోకాల్లో ఉన్న జీవులు మనసులో కలవరపడుతున్నాయి, మూఢంగా ప్రవర్తిస్తున్నాయి. అతని తేజస్సు ముందు సూర్యుడు కూడా వెలగలేకపోతున్నాడు. విశ్వామిత్రుడు సాక్షత్తు అగ్నిదేవుడిని తపలిస్తున్నాడు. అతను మూడు లోకాలు నాశనమవ్వాలని కోరుకోకముందే అతని కోరికను తీర్చడం మంచిది. పూర్వం కాలాగ్ని చేత ఏ విధంగానైతే మూడులోకాలు మండుతున్నాయో, అదే విధంగా ఇప్పుడు కూడా మండుతున్నాయి. కనుక మేము చెప్పదల్చుకుంది ఒక్కటే. అతను ఏం కోరితే అది ప్రసాదించండి. ఒకవేళ అతను దేవతలు రాజు అవుతానంటే అది కూడా ఇవ్వండి అని దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.

దేవతలందరు బ్రహ్మదేవునితో పాటు విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమై 'ఓ బ్రహ్మర్షి! మీకు స్వాగతం. మీ తపస్సు చేత మేము సంతృప్తి చెందాము. ఘోరమైన తపస్సు కారణంగా మీరు బ్రాహ్మణ్యాన్ని పొందారు' అని మధురమైన వార్త చెప్పారు. 'వరణు, వాయు మొదలైన దేవతల సమూహం వలే మీకు కూడా ధీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను. మీకు స్వసి కలుగుగాకా. మీకు రక్షణ ఉంటుంది. మీరు ఇక తపస్సును ఆపవచ్చు' అన్నారు బ్రహ్మ. నేనే కనుక బ్రహ్మత్వాన్ని, ధీర్ఘాయువును పొందిఉంటే నాకు ఓంకారం, వషట్‌కారం, వేదాలు అన్ని అర్దమవ్వాలి. సకల క్షాత్ర విద్యల మీద మంచి పాండిత్యం, పరబ్రహ్మ తత్వం పూర్తిగా ఎరిగిన మహామేధావి, తేజోవంతుడు, బ్రహ్మమానసపుత్రుడైన వశిష్టమహర్షి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అప్పుడే నేను నా తపస్సును విరమిస్తాను. మీరు నా ఈ కోరిక తీర్చండి' అన్నారు విశ్వామిత్రుడు. దేవతలందరు వశిష్టమహర్షి దగ్గరకు వెళ్ళి, పరిస్థితి వివరించి ఆయన్ను తీసుకువచ్చారు. మీరు విశ్వామిత్రుని బ్రహ్మర్షి ని పిలిచి, బ్రహ్మర్షిగా అంగీకరించాలి అన్నారు. నాకు అందులో ఇబ్బందేమి లేదు అన్నాడు వశిష్టమహర్షి.

విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి స్నేహపూర్వకంగా ఇక నుంచి మీరు కుడా బ్రహ్మర్షే, అందులో సందేహం లేదు, మీకు ఇక నుంచి సర్వం తెలుస్తుంది అన్నారు వశిష్టులవారు. దేవతలందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇంత తపస్సు విశ్వామిత్రునిలో సకల దుర్గుణాలను తొలగించింది. అందువల్ల ఆయనకు వశిష్టమహర్షి మీదనున్న కోపం తొలగిపోయింది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వశిష్టులవారికి గొప్ప స్థానం ఇచ్చి, పూజించారు.

To be continued .............

Thursday, 12 June 2014

హిందూ ధర్మం - 81 (మళ్ళీ ఘోరతపస్సు చేసిన విశ్వామిత్రుడు)

కోపం వలన ఆయన చేసిన తపస్సు వృధా అవుతోంది, ఇంద్రియాలను జయించని కారణంగా అశాంతి కలుగుతోంది. దీంతో ఆయనలో మార్పు వచ్చింది. నేను ఇక నుంచి ఎవరిని కోపగించుకోను, ఎవరిని నోటితో ఏ మాట చెడుగా అనను. అలాకాపోతే నేను గాలి కూడా పీల్చకుండా వందేళ్ళు తపస్సు చేస్తాను. నేను విజితేంద్రియుడను అయ్యేంతవరకు నన్ను నేను ఆత్మశుద్ధి చేసుకుంటాను. నేను బ్రహ్మర్షి స్థానానికి నా సొంత తపశ్శక్తి వలన అర్హత పొందేవరకు నేను గాలి పీల్చను, ఆహారం తీసుకోను. అంతులేని సమయం పట్టినా సరే. నేను తపస్సులో ఉండగా, నా శరీరభాగాలు క్షయం పొందవు అని తనకు తాను చెప్పుకుని ఒక శపధం చేశాడు. తాను అనుకున్నట్టుగానే ఎవరు చేయలేని విధంగా వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈసారి విశ్వామిత్రుడు తపస్సు కోసం మంచు కప్పుకున్న హిమాలయాలను విడిచి, తూర్పు దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు. తన సంకల్పానికి అనుగుణంగానే మౌనంగా ఉత్తమైన, ఎంతో కష్టమైన తపస్సులో నిమగ్నమయ్యాడు.

వెయ్యేళ్ళు పూర్తైన తర్వాత కూడా, బలమైన శరోరం, ఎన్ని అవరోధాలనైనా తొలగించగల శక్తి వచ్చినప్పటికి, అవ్యయమైన తపస్సు చేసి కృత నిశ్చయంతో ఉన్న కారణంగా ఆయనలోకి కోపం కొంచం కూడా ప్రవేశించలేకపోయింది. వేయి సంవత్సరాల తపస్సు పూర్తైన తర్వాత ఆయనకు ఎంతో ఆకలేసింది. తను వంట చేసుకుని, తినడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన్ను పరీక్షిద్దామని బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు వచ్చి, సిద్ధంగా ఉన్న భోజనం తనకు పెట్టమని ప్రార్ధించాడు. ఎంతో ఆకలితో ఉన్నాడు, ఎన్నో ఏళ్ళ తర్వాత తిండికి సిద్ధమైనప్పుడు, ఎవరైనా వచ్చి, నోటి దగ్గరి ఆహారం లాక్కుంటే ఎంత కోపం వస్తుంది. కానీ విశ్వామిత్రునకు ఈసారి కోపం రాలేదు. తపస్సు చేత చిత్తం శుద్ధి పొందింది. మొత్తం ఆహారాన్ని ఆ బ్రహ్మణుడికి మనస్పూర్తిగా ఇచ్చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు విశ్వామిత్రునకు ఏమి మిగల్చకుండా మొత్తం తినేశాడు. మహర్షి పస్తులున్నాడు కానీ  ఒక్కమాట కూడా అనలేదు, సరికదా మౌనంగా ఉంటూ, తన ఊపిరిని అదుపు చేసుకుంటూ, అక్కడ కూడా తన దీక్షను కొనసాగించాడు. ఇది జరిగాకా మళ్ళీ ఇంకో వేయి సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా ఆయన శిరస్సు నుంచి వచ్చిన పొగలు మూడులోకాలను కప్పేశాయి. మూడులోకాల్లో ఉన్న దేవతలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

ఆయన తపో తేజస్సు ముందు దేవతల తేజస్సు ఎందుకు పనికిరాకుండా ఉంది. దేవతలు, గంధర్వులు, పాములు, ఉర్గలు, రాక్షసులు పితామహుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.

To be continued ...............

Wednesday, 11 June 2014

హిందూ ధర్మం - 80 (తపస్సుని భగ్నం చేయడానికి వచ్చిన రంభ)

ఎంత గొప్ప తపస్సో అది. ఆ ప్రభావం చేత ఇంద్రాది దేవతలకు తాపం పుట్టింది, వేడి భరించలేకపోయారు. వాయుదేవుడు మొదలైన వారితో కూడి సభలో కూర్చున్న ఇంద్రుడు రంభను పిలిచి ఇంద్రునికి లాభం చేకూరేలా, విశ్వామిత్రునకు నష్టం చేకూరేలా ఆమెతో మాట్లాడాడు. రంభా! ఇప్పుడు నువ్వు దేవకార్యం ఒకటి చేయాలి. విశ్వామిత్రుడిని కామమోహితుడిని చేయాలి అన్నాడు. దానికి బదులుగా రంభ చేతులు జోడించి నమస్కరిస్తూ 'ఇంద్రదేవా! మహర్షి విశ్వామిత్రుడు చాలా ప్రమాదకరమైనవాడు. ఆయన జోలికి వెళితే, నా మీద తన కోపాన్ని చూపించి, శపిస్తాడు. అమ్మో! నాకు ఆయనంటేనే భయం. ఆయనకు దగ్గరకు నేను వెళ్ళను. నన్ను మన్నించి, ఈ కార్యానికి వేరేవారిని తీసుకోండి' అన్నది. నువ్వేం భయపడకు రంభా! అంతే మంచే జరుగుతుంది. నేను నీకు తోడుగా వస్తాను. నా ఆదేశాన్ని పాటించు. మన్మధుడు ఆ ప్రాంతంలో వసంతఋతువు ప్రవేశపెడతాడు. నేను కోకిల రూపం ధరించి నీ వెంటే ఉంటాను. నీకు చాలా మంచి గుణాలు ఉన్నాయి. గొప్ప అందం ఉంది. నీ అందంతో ఆయన తపస్సుకు భంగం కలిగించు' అన్నాడు.

ఇది విన్న రంభ మంచి అందమైన ఉత్తమ రూపాన్ని ధరించింది. చిరునవ్వులు నవ్వుతూ, విశ్వామిత్రుడు తపోప్రదేశాన్ని చేరుకుని ఆయన ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తోంది. విశ్వామిత్రునికి మనోహరమైన కోకిల గోంతు వింపడింది. అక్కడ వీస్తున్న సువాసనలకు ఆయనకు సంతోషం కలుగుతోంది. ఇంతలో ఆయన రంభను చూసి, ఆశ్చర్యానికి గురయ్యాడు. మనసును హత్తుకునే పాటలు, శబ్దాలు, ఒక్కసారిగా మారిపోయిన వాతవరణం, వసంతఋతువు, ఇవన్నీ గమనించిన మహర్షికి ఇదంతా ఇంద్రుడి పనేని అనుమానం వచ్చింది. వెంటనే కోపం వచ్చి రంభను శపించాడు. నేను ఇక్కడ కామక్రోధాదులను జయించడానికని తపస్సు చేస్తుంటే, నన్ను ప్రలోభ పెట్టడానికి వచ్చావా? నువ్వు ఇక్కడే పదివేల సంవత్సరాలు శిలగా పడి ఉండు అని శపించి, నా కోపానికి గురైన నికు ఒక మహతేజోవంతుడైన బ్రాహ్మణుడు శపవిముక్తిని ప్రసాదిస్తాడు అని పలికాడు (ఆ మహాతేజోవంతుడైన బ్రాహ్మణుడు వశిష్టమహర్షి. విశ్వామిత్రునకు వశిష్టమహర్షి మీద కోపం ఉన్నా, ఆయనంటే ఎంతో గౌరవం కూడా ఉంది.

మహర్షికి కోపం ఉండకూడదని, కానీ తాను మాత్రం మళ్ళీ కోపగించుకున్నాడని గ్రహించిన విశ్వామిత్రుడు బాధకు లోనయ్యాడు. శాపానికి గురైన రంభ అక్కడే శిలగా మారిపోయింది. విశ్వామిత్రుని మాటలు విన్న ఇంద్రుడు, మన్మధుడు మెల్లిగా జారుకున్నారు.

To be continued .........

Tuesday, 10 June 2014

హిందూ ధర్మం - 79 (దేవర్షిగా మారిన విశ్వామిత్రుడు)

ఆమెను చూసి మోహితుడైన విశ్వామిత్రుడు, ఆమె దగ్గరకు వెళ్ళి 'ఓ అప్సరస! నీకు స్వాగతం. నా ఆశ్రమానికి విచ్చేసి, నన్ను అనుగ్రహించ్గు, నీ చేత మోహితుడైనాను, నీకు శుభమగుగాకా' అన్నాడు. ఆ మాటలు విన్న మేనక అక్కడే అగిపోయింది. ఇద్దరూ కలిసి పది సంవత్సరాలు ఉన్నారు. ఇది విశ్వామిత్రుని తపస్సుకు ఆటంకంగా మారింది. పదిఏళ్ళ తరువాత విశ్వామిత్రునికి తాను చేస్తున్నపని తప్పని గ్రహించి, చింతించి, శోకించడం మొదలుపెట్టాడు. ఆ బాధా నుంచి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. 'గొప్ప తపస్సు చేస్తున్న నన్ను ప్రక్కదారి పట్టించడానికి దేవతల పన్నిన పన్నాగం ఇది. పదేళ్ళు ఒక రాత్రిపగులులా గడిచిపోయాయి. నేను ఈ కామాన్ని, మోహాన్ని అధిగమించాలి. ఇవి నా తపస్సుకు ఆటంకాలుగా ఉన్నాయి' అని భావించాడు. పశ్చాత్తాపపడుతున్న విశ్వామిత్రుడు దీనికి కారణం మేనకనే అని ఆమె వైపు చూశాడు. విశ్వామిత్రుడు ఎక్కడ శపిస్తాడో అని మేనక వణికిపోతోంది. చేతులో జోడించి విశ్వామిత్రునకు నమస్కరించింది. ఆమె భయపడుతోదని గమనించి, అలాగో ఇప్పటికే తపోశక్తి వృధా చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ శపించి మరింతగా వృధా చేసుకోవడం ఎందుకని, ఆమెతో మధురంగా మాట్లాడి పంపించేశాడు. తాను ఉత్తర దిశగా హిమాలయాలకు పయనమయ్యాడు.

కౌశికి నదీతీరానికి చేరుకుని తనలో ఉన్న కామాన్ని జయించడానికి, శాంతిని పొందడానికి ఘోరమైన తపస్సు చేశాడు. దాదాపు వేయొ సంవత్సరాల పాటు మాటల్లో వర్ణించలేనటువంటి తపస్సు చేశాడు. అది చూసిన దేవతలకు భయం వేసి, ఋషులతో కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళి, విశ్వామిత్రుడు చేసిన తపస్సుకు దేవర్షి స్థానానికి అర్హత పొందాడాని చెప్పారు. దేవతల సలహా మీద బ్రహ్మ విశ్వామిత్రుని చేరుకుని 'ఓ మహర్షి! నా ప్రియమైన నీకు స్వాగతం. నేను నీ తపస్సు చేత సంతోషించాను. నేను నిన్ను ఋషులలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అది విన్న విశ్వామిత్రుడు చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరు నన్ను దేవర్షికి బదులుగా బ్రహ్మర్షి అని పిలిచి ఉంటే, నేను విజితేంద్రియుడను (ఇంద్రియాలపై విజయం సాధించిన వాడు విజితేంద్రుయుడు) అయ్యేవాడిని అన్నాడు. దానికి బదులుగా బ్రహ్మ 'నీవు ఇంకా ఇంద్రియాలను పూర్తిగా జయించలేదు. దానికోసం ప్రయత్నించు' అని బ్రహ్మ స్వర్గలోకానికి పయనమయ్యాడు. బ్రహ్మదేవునితో పాటు వచ్చిన దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళగా, విశ్వామిత్రుడు ఇంకోసారి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. రెండు చేతులను పైకెత్తి, అటువంటి ఆధారంలేకుండా నిలబడి, గాలిని మాత్రమే తీసుకుంటూ, మరే ఇతర ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడు. ఎండాకాలంలో పంచాగ్నిహోత్రం మధ్య నిలుచుని (నాలుగు వైపుల పెద్దపెద్దగా మండే నాలుగు అగ్నిహోత్రాలు, పైన సూర్య్డు కలిపి ఐదు), వర్షాకాలంలో ఆకాశాన్ని పైకప్పుగా చేసుకుని (ఎటువంటి నీడా, పైకప్పు లేకుండా, వర్షానికి తడుస్తూ) తపస్సు చేశాడు. చలికాలం మొత్తం నీటిలో పడుకుని తపస్సు చేశాడు. ఈ విధమైన తపస్సు కొన్ని వేల సంవత్సరాల పాటు చేశాడు.

To be continued ...........

Monday, 9 June 2014

హిందూ ధర్మం - 78 (మేనక ఆగమనం )

విశ్వామిత్రుడి కన్నులు కోపంతో ఎరుపెక్కి శపించడం మొదలుపెట్టాడు. మీరు నా మాటను అతిక్రమించడమే కాకుండా, నాకు పరుషంగా సమాధానమిచ్చారు. మీరు కూడా వశిష్టపుత్రులు పుట్టిన జాతిలోనే జన్మించి వేయి సంవత్సరాల పాటు భూమి అంతటా తిరుగుతూ కుక్కమాంసం తిని జీవిస్తారు అన్నాడు. అటు తర్వాత దయతో శునఃశ్శేపుడి వైపు తిరిగి రక్షణ కొరకు వేదమంత్రాలు చదివి ఆశీర్వదించాడు. 'నిన్ను పాశాలతో బంధించి, నీకు ఎర్రటి రంగును పూసి, మెడలో ఎరపు రంగు పూలహారం వేసి, విష్ణు సమానుడైన అగ్నిహోత్రునకు అర్పించే ముందు, నేను ఇప్పుడు నీకు చెప్పబోయే వేదంలోని సూక్తాలు చదువు. నేను చెప్పిన రెండు సూక్తాలు చదువగానే నీ కోరిక నెరవేరుతుంది' అని చెప్పి, ఆ పిల్లవానికి విశ్వామిత్రుడు వాటిని ఉపదేశించాడు. వాటిని జాగ్రత్తగా గ్రహించిన శునఃశ్శేపుడు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళి రాజా! త్వరగా యాగశాలకు వెళదాం రండి అన్నాడు. నన్ను యజ్ఞపశువుగా అర్పించి, మీరు మీ ప్రతిజ్ఞను, యాగాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఇది విన్న అంబరీషుడు త్వరగా యాగశాలకు చేరుకున్నాడు.

రాజు పురోహితుల అనుమతి తీసుకుని పిల్లవానికి పవిత్రమైన ఎరుపు రంగు బట్టలు కట్టి, యాగపశువుగా తయారు చేసి, అక్కడున్న స్థంభానికి బందించాడు. వెంటనే శునఃశ్శేపుడు ఇంద్రుడిని, ఉపేంద్రుడిని విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన రహస్య సూక్తాల ద్వారా ప్రార్ధించాడు. అతని ప్రార్ధనకు మెచ్చి, సహస్రాక్షుడైన (వేయి కన్నులు కలవడు) ఇంద్రుడు ధీర్ఘాయువును ప్రసాదించాడు. అంబరీషునిపై కూడా తన అనుగ్రహాన్ని వర్షించాడు. అందువల్ల అంబరీషుడు చేసిన యాగానికి అనేక రెట్ల ఫలం కలిగింది.

తన పుత్రలను శపించడం వలన విశ్వామిత్రునకు తపోశక్తి వృధా అయ్యింది. అందువల్ల విశ్వామిత్రుడు ఆ పవిత్ర సరోవరం వద్దనే కూర్చుని ఇంకో వెయ్యేళ్ళు తపస్సు చేశాడు. వేయి సంవత్సరాలు పూరతైన తర్వాత విశ్వామిత్రుడు వ్రతస్నానం చేశాడు. అది ముగియగానే విశ్వామిత్రుని ముందు దేవతలందరూ అతని తపోఫలాన్ని ప్రసాదించడానికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పటి వరకు నీవు చేసిన తపస్సు కారణంగా రాజర్షివి అయినావు. నీకు శుభం కలుగుగాకా అని బ్రహ్మదేవుడు పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు (రాజైన నీవు ఇప్పటి వరకు చేసిన తపస్సు కారణంగా రాజర్షి మాత్రమే కాగలిగావు కానీ బ్రహ్మర్షి కాలేకపోయావు. బ్రహ్మర్షి స్థానం చాలా గొప్పది. బ్రహ్మర్షి అవ్వాలంటే కోపం, కుళ్ళు, పగ, కొరిక మొదలైన దుర్గుణాలన్నీ విడిచిపెట్టాలి). విశ్వామిత్రుడు తిరిగి తపస్సు మొదలుపెట్టాడు.

చాలా కాలం గడిచాకా, ఒకానొక కాలంలో దేవలోకపు అప్సరస అయిన మేనక ఆ సరోవరంలో స్నానం చేసి, జలకాలాడుతోంది. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు సరోవరంలో ఈసుతున్న మేనకను చూశాడు. మేనక అందం సాటిలేనిది. దట్టంగా కమ్మిన మబ్బుల మధ్య కనిపించే మెరుపులా ఉంది మేనక.

To be continued ............

Sunday, 8 June 2014

గంగమ్మ గోడు వినండి

గంగా, గీత, గోవు భారతీయసంస్కృతిలో ప్రధానమైనవి. పూర్వం భగీరధుని తపస్సు వలన గంగ భూమికి వచ్చింది. తొలిసారిగా హరిద్వార్ ప్రాంతంలో జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ప్రవహించిన కారణంగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు పది రోజులపాటు వైభవంగా #గంగోత్సవం చేస్తారు.

గంగా అన్న పేరు వినడమే అదృష్టం. గంగలో స్నానం చేయాలని కోరుకోని వ్యక్తి ఉండడు. ప్రపచంలో గంగాజలం అద్బుతం, అత్యంత పవిత్రం, పావనం. గంగాజాలనికి ఉన్న ఔషధ గుణాలు మరే ఇతర నదీజలాలకు లేవని, గంగ ప్రపంచంలో ఒక అద్భుతమని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

'తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్' - గంగ నీరు త్రాగిన వారు పరమపదాన్ని పొందుతున్నారని శంకరులు గంగాస్తోతంలో వర్ణిచారు. శరీరానికి ముసలితనం వచ్చినప్పుడు, రకరాకల వ్యాధులు సోకినప్పుడు, ఇక ఏ దిక్కు లేక కాటికి సిద్ధమైనవాడికి గంగా జలం ఔషధం అవుతాయని, నారాయణుడే వైధ్యుడవుతాడని పెద్దల మాట. ఒక సన్యాసి కాశిలో ఉన్న సమయంలో ఒకతను, అతని ముసలితల్లిని తీసుకుని గంగాస్నానానికి వచ్చాడు. అతడి వివరాలు అడుగగా, తాను తన ముసలి తల్లిని వీపుపై మోసుకుంటూ 1000 మైళ్ళకు పైగా నడుస్తూ కాశీ చేరారని, జీవితంలో మరణించేలోపు
ఒక్కసారైన గంగా స్నానం చేయాలన్న తన కోరిక తీర్చడం తనకు సంతోషంగా ఉందని చెప్తాడు. గంగా స్నానం కోసం అంతగా తపించేవారు మన పూర్వీకులు. గంగ నీరు త్రాగితే యమభటులతో చర్చ ఉండదని భజగోవింద స్తోత్రం చెప్తోంది.

నదిని పూజించడమేంటన్న సందేహం కలగచ్చు. నది కేవలం ఒక జలప్రవాహం కాదు. అందులో జీవం ఉంది, శక్తి ఉంది, ఆ శక్తిని మన ఋషులు దర్శించారు. ఇప్పటికే అనేకమందితో గంగా నది అధిష్టాన దేవత అయిన గంగమ్మ కనిపించి మాట్లాడుతుంది. అడుగడునా పుణ్యక్షేత్రం, పవిత్ర స్థలం, గంగమ్మ ఎక్కడ ఉంటే అదే ఒక తీర్ధస్థలం. వేల కీలోమీటర్ల గంగాప్రవాహంలో ఎందరో అమ్మకు నీరాజనం పడతారు, అమ్మ కాన్పూర్ చేరేసరికి రకరకాల వ్యర్ధాలు కలుపుతారు, మురుగు కలుపుతారు. అయినా గంగమ్మ అన్నిటిని స్వీకరిస్తోంది. తనలో కలిపేసుకుటోంది. తొమ్మిది రాష్ట్రాలకు, దేశంలో సగం జనాభాకు ఆహారం ఇస్తోంది. కానీ మన గంగమ్మను కాలుష్యం కాటేసింది. భూతాపం భయపెడుతోంది.

జనానికి బంధముక్తిని కలిగించే గంగమ్మకు ఈ రోజు కాలుష్యం నుంచి విముక్తి కలగించవలసిన ధౌర్భాగ్యం పట్టింది. పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పులు గంగ ఎండిపోవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. గంగమ్మలో గుండెల్లో ఇసుకుమాఫియా అమ్మ రక్తాన్ని తాగేస్తోంది. గంగానది శుద్ధి కోసం, ఇసుకుమాఫియా చెర నుంచి అమ్మను విడిపించడం కోసం, గంగలో పెట్టిన స్టోన్ క్రషర్లను నిషేధించడం కోసం  స్వామి నిగమానంద సరస్వతీ ఆమరణ నిరహార దీక్ష చేయగా, 68 రోజులు దీక్ష తరువాత కొందరు దుండగులు ఆయనకు ఇంఫెక్షన్ అంటించి హతమార్చారు.

గంగను కాపాడుకోకపోతే మన జీవితం వృధా. ఆపదలో ఉన్న అమ్మను రక్షించలేని బిడ్డలను ఏ దేవుడు దీవిస్తాడు. గంగమ్మ గోడు వినండి, అమ్మను దర్శించండి, స్నానం ఆచరించండి, రక్షించండి, తరించండి.

జై గంగా మాతా              

Saturday, 7 June 2014

హిందూ ధర్మం - 77 (శునఃశ్శేపుడి వృత్తాంతం)

వేదం చదువుకున్న శునఃశ్శేపుడు మాటలు ముగించగానే, అంబరీషుడు బంగారు, వెండి నాణేలను, రత్నాలు కోటి రాశులుగా అతని ముందు పోశాడు. వాటితో పాటు లక్షఆవులను ఇచ్చి, శునఃశేపుడిని తనతో తీసుకువెళుతున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. త్వరగా పిల్లవాడిని రధం ఎక్కించాడు. ప్రయాణం మధ్యలో మద్యాహ్నం వేళ ఇద్దరూ ఒక పవిత్ర సరోవర ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందామని ఆగారు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటుండగా, కుతూహలంతో శునఃశ్శేపుడు ఆ సరోవరం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తూ, అక్కడే ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకుంటున్న తన మేనమామ విశ్వామిత్రుడిని చూశాడు. ప్రయాణం వలన కలిగిన అలసట, దాహాం కారణంగా పిల్లవాడి ముఖం దీనంగా మారిపోయింది. 'నన్ను రక్షించడానికి అమ్మనాన్నలు లేరు, ఇక నన్ను బంధువులేమి కాపాడతారు. ఓ ఋషిపుంగవ, మీ తపోశక్తి చేత నన్ను మీరు రక్షించగలరు. ఓ నరశ్రేష్టా! అందరికి మీరే రక్ష. అందరిని రక్షింగలవారు కూడా మీరే. కనుక అంబరీషుడి యజ్ఞం పూర్తయ్యేలా అనుగర్హించండి. నాకు బ్రతకాలని ఉంది. నాకు ధీర్ఘాయువును ప్రసాదించండి. నేను గొప్ప తపస్సు చేసి, స్వర్గాది మంచిలోకాలు పొందాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. నేను అనాధను అని భావించి, నన్ను రక్షించే నాధుడు మీరే అవ్వండి. ఒక తండ్రి తన కొడుకును రక్షించినట్టుగా, నన్ను ఈ అపాయం నుంచి రక్షించండి' అంటూ ఒక్కసారిగా పిల్లవాడు విశ్వామిత్రుని ఒళ్ళో పడిపోయాడు.

శునఃశ్శేపుడి మాటలు విన్న విశ్వామిత్రుడు అతడిని అనేక విధాలుగా ఓదార్చి, తన కుమారులతో ఈ విధంగా అన్నాడు. 'తల్లిదండ్రులు పుత్రులు కావాలని ఎందుకు కోరుకుంటారు? పదిమందికి సహాయపడతారని, పైలోకాలకు వెళ్ళడానికి పుణ్యకర్మలు చేస్తారని కదా. ఇప్పుడు మీకు ఆ సమయం వచ్చింది. వీడు చిన్నవాడు, ఋషిపుత్రుడు, బ్రతకాళని కోరుకుంటున్నాడు. కనుక అతని కోసం మీలో ఒకరు ప్రాణత్యాగం చేసి అతడిని సంతోషపెట్టండి. మీరు ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప కర్మలు చేశారు. ఈ పిల్లవాడికి బదులుగా మీరు యాగపశువుగా మారితే, అగ్నిదేవుడు మరింత సంతోషిస్తాడు. దీని ఫలితంగా శునఃశేపుడు రక్షింపబడతాడు, యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది, దేవతలు తృప్తి చెందుతారు, నా మాటలు సత్యం అవుతాయి' అన్నాడు.

అది విన్న విశ్వామిత్ర పుత్రులైన మధుష్యందుడు మొదలైనవారు 'ఇంకొకరి పిల్లలను రక్షినచడం కోసం మీ పిల్లల్ని ఎలా త్యాగం చేస్తారు. మేము ఇది చాలా తప్పని భావిస్తున్నాం. భోజనానికి పిలిచి కుక్కమాంసం వడ్డించినట్టుగా ఉంది' అంటూ గర్వంతో, అవమానకరంగా సమాధానమిచ్చారు.  

To be continued ..........

Friday, 6 June 2014

హిందూ ధర్మం - 76 (అంబరీషుడి యాగపశువు అపహరణ)

పశ్చిమ దిక్కు వెళ్ళిన విశ్వామిత్రుడు పండులు, కందమూలాలు తింటూ సరోవరాల పక్కన కూర్చుని ఎవరు చేయలేని ఘోరమైన తపస్సు చేశాడు. ఇదే కాలంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్న అంబరీషుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. కానీ ఆ సమయంలో యజమాని యొక్క యాగపశువును ఇంద్రుడు దొంగిలించాడు. ఇది గమనించిన రాజపురోహితుడు 'రాజా! యాగం కోసం నీవు ఏర్పాటు చేసిన పశువు నీ అజాగ్రత్త వలన కనిపించకుండాపోయింది. యాగ సమయంలో రక్షింబడిన వస్తువులు యాగం చేసే రాజు పాలిట వినాశకాలు అవుతాయి. యాగం మధ్యలో ఆపడానికి వీలులేదు. కనుక నీవు దీనికి అనేక ప్రాయశ్చిత్తాలు చేయాలి. యాగపశువు లేదు కనుక అందుకు బదులుగా ఒక మనిషిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. అతడిని యాగపశువుగా భ్వాఇంచాలి. అప్పుడే తిరిగి యాగం ప్రారంభించబడుతుంది. ఈ మాటలు విన్న రాజు, యాగపశువుగా కూర్చునే వ్యక్తికి బదులుగా వేయి గోవులను దానం చేస్తానని ప్రకటించి అనేక ప్రయత్నాలుఇ చేశాడు. అడువులు, ఆశ్రమాలు, ఊర్లు అన్ని తిరిగుతూ రాజు ఋచికుడనే ఋషుని, అతని పరివారాన్ని భృంగతుంగ పర్వతం దగ్గర చూశాడు. మహాతేజోవంతుడు, అమితప్రతిభావంతుడైన ఋచికునకు నమస్కరించి బాగోగులు, అన్ని వివరాలు తెలుసుకున్న అంబరీషుడు ఋషితో 'ఓ భార్గవా! మీరు నాకు మీ కుమారుడీని యాగపశువు నిమిత్తం దానం చేయాలి. అందుకు బదులుగా నేను మీకు వేయి ఆవులను ఇస్తాను' అన్నాడు. అన్ని దేశాలు తిరిగాను కానీ యజ్ఞపశువు దొరకలేదు. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాను. మీ కుమారులలో ఎవరో ఒకరిని నాకు అప్పగించండి అన్నాడు అంబరీషుడు.

దానికి బదులిస్తూ ఋషి ఓ మహాత్మా! నేను నా పెద్ద కొడుకును ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను అన్నాడు(ఎందుకంటే పెద్ద కొడుకే తండ్రి చితి వెలిగించాలి). తన భర్త మాటలు విన్న ఋషిపత్ని 'నా భర్త పెడ్డకుమారుడని ఇవ్వలేనని తేల్చి చెప్పారు. నేను నా ఆఖరి కుమారుడని శునకుడను ఇవ్వలేను, అతనంటే నాకు చాలా ఇష్టం (చిన్న కొడుకే మరణించిన తల్లి చితి వెలిగించాలి). సాధారణంగా తండ్రికి పెద్ద కుమారుడి మీద, తల్లికి చిన్న కుమారుడి మీద అమితమైన ఇష్టం ఉంటుంది అని పలికింది. ఇది విన్న వారి మధ్యమ కుమారుడైన శునఃశేపుడు కలిపించుకుని 'నా తండ్రి పెద్ద కుమారుడిని ఇవ్వలేను అన్నాడు, నా తల్లి చిన్న కుమారుడిని ఇవ్వలేనని చెప్పింది, వీరిద్దరి మధ్యనున్న నన్ను గ్రహించండి రాజా!' అన్నాడు.

To be continued ........

Thursday, 5 June 2014

శ్రీ మాతా అమృతానందమయి సందేశం

పిల్లలు! ప్రకృతి విపత్తులు, భూతాపం, ఇతర వాతావరణ మార్పులు మానవుల మానసిక ప్రశాంతతను నాశనం చేస్తున్నాయి. ఎందుకంటే మనం సాగుస్తున్న అనాలోచిత దోపిడి కారణంగా ప్రకృతితో బంధం దెబ్బతింటోంది. మన గాలి, మన నీరు, మన భూమి విషతుల్యం అవుతున్నాయి.

పూర్వపు రోజుల్లో ప్రజలు ఎడ్లబండ్లు, గుర్రపుబగ్గీల్లో ప్రయాణం సాగించేవారు. ఆ తర్వాత స్కూటర్లు వచ్చాయి. ఇప్పుడు ఒకే వ్యక్తికి రెండు, మూడు, అంతకంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. పూర్వం మనం అరిటి ఆకులో భోజనం చేసేవారము. ఈ రోజు మొత్తం చెట్లను నరికేసి, పేపరు కప్పులు, ప్లేట్లు తయారు చేసుకుని, ఒక్కసారి మాత్రమే వాడుకుని అవతల పడేస్తున్నాం. ఈ విధంగా, మరియు అనేక విధాలుగా ప్రకృతి మాతను దోచుకుని, ఆమె వనరులను వృధా చేస్తున్నాం.

ప్రకృతిని కామధేనువుగా భావించే సంప్రదాయం మనది. అదే విధంగా ప్రకృతి కూడా మనకు అన్ని శుభాలను చేకూర్చింది. ఇప్పుడు ఆమె ముసలిదయ్యింది, ఎండిపోయింది. మన అడవులు తరిగిపోతున్నాయి, ఆహార ఉత్పత్తి అంతర్ధామవుతోంది. స్వఛ్చమైన గాలి, నీరు దొరకడం అరుదు. వ్యాధులు పెరుగుతున్నాయి.

మనం ఎక్కడ పొరపాటు చేశాం? అవసరానికి, విలాసానికి / సుఖానికి మధ్య బేధాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది మనం అర్దం చేసుకోవాలి. ప్రకృతి నుంచి అవసరానికి మించి తీసుకోవడం పాపం, అధర్మం కూడా. నేను ఒక సామాజిక కార్యకర్త కధ గుర్తు చేస్తాను. తెల్లవారుఝామున అతను పళ్ళు తోముకోవడం కోసం నీటితో నింపబడిన పాత్రను తీసుకుని నది దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అతని సహచరులతో అతను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతలో ముఖం కడుక్కోవడం కోసం అతను తన పాత్రను తీసుకోగా, అందులో నీరు లేవని గమనించాడు. ఓ భగవంతుడా! నేను ఎంత అజాగ్రత్తగా వ్యవహరించాను. ముఖం కడుక్కోవడం పూర్తవ్వకముందే నేను మొత్తం నీటిని ఉపయోగించాను అంటూ బాధపడ్డాడు.

పక్కనే ఉన్న అతని సహచరులకు ఇతను ఇంతగా ఎందుకు బధాపడుతున్నాడో అర్దమవ్వక అతనితో 'ఇందులో బాధపడే విషయం ఏమున్నది? నీ పక్కనే నీటితో నిండిన నది ఉంది కదా' అన్నారు. దానికి బదులిస్తూ అతను 'నదిలో ఎంతో నీరు ఉండవచ్చు కానీ నా అవసరానికి మించి వాడుకునే హక్కు నాకు లేదు' అన్నాడు.

ఆ సామాజిక కార్యలర్త చూపించిన ధర్మాచరణను, మన తరం కనుక తిరిగి గుర్తుంచుకుని ఉంటే - ధర్మం గురించి అవగాహన ఉంటే - పేదరికం, కరువు అనేవి నిర్మూలించబడతాయి. నాకు ఈ విషయంలో సందేహం లేదు. మీరు బ్రతకడానికి అవసరమైనంత మాత్రమే ప్రకృతి నుంచి తీసుకోండి. అప్పుడు అందరికి సరిపడా ఆహారం, నీరు, వస్త్రాలు అందుతాయి. ప్రకృతిమాత తిరిగి కామధేనువుగా మారుతుంది.

ఈ భూమిపై ఉంటున్న అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, రాబోయే 50 సంవత్సరాలలో భూమిపై జీవం అంతరించిపోతుంది. అదే ఒకవేళ మానవజాతి కనుక అంతరించిపోతే, తరువాతి 50 సంవత్సరాలలో జీవరాశి మొత్తం వృద్ధి చెందుతుదని ఒక శాస్త్రవేత్త అన్నారు. పిల్లలు, భూమి బ్రతకడం కోసం మానవులు నశించపోవలసిన అవసరంలేదు.

మన తాతముత్తాతలు మనకు అప్పగించిన ఈ భూమి అతిసుందరమైనది. దాన్ని నాశనం చేసి మాత్రమే తరువాతి తరానికి అందిస్తామా?  ఈ భూమికి చిన్న పగుళ్ళు కూడా లేకుండా తరువాతి తరాలకు అందించవలసిన ధర్మం మన మీద ఉంది. మన సొంత కన్నతల్లి వలనే ఈ భూమిని రక్షించి, పోషించవలసిన అవసరం మన మీద ఉంది. మనం కళ్ళు తెరవాలి. ఇది భూమాత పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం కాదు, సమస్త మానవాళి పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం. ఎందుకంటే ప్రకృతి లేనిదే మానవమనుగడ ఉండదు.

ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి.

- శ్రీ మాతా అమృతానందమయి 

Wednesday, 4 June 2014

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం - సద్గురు జగ్గీవాసు దేవ్ సందేశం

ఈ భూమిపై ఏ విషయమైనా చక్కదిద్దడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వనరులు, సామర్థ్యం అన్నీ ప్రస్తుతం మనకున్నాయి. ఇంతకుముందెన్నడూ మానవ మనుగడలో మనుషులు ఈ విధమైన శక్తియుక్తులతో లేరు. కాని ప్రస్తుతం ఒకే ఒక విషయం కొరవడింది, అది కలుపుగోలు తత్వం.

మనం ఇప్పుడు ఎలాంటి సమయంలో జీవనం సాగిస్తున్నామంటే, మనని ఇంతకాలం పోషించిన వాటిని మనం ఈ రోజు పరిరక్షించుకోవడం గురించి ఆలోచించవలసి వస్తున్నది. భూమిని సంరక్షించుకోవటం గురించి మాట్లాడవలసి వస్తున్నది.

భూమిని పరిరక్షించడం మనం మంచి జీవితాన్ని ఏర్పరచుకోవటం కోసమే. భూమి సరిగా లేకపోతే మనకు సరైన జీవనం లేదు. పర్యావరణ సంబంధిత బాధ్యతలు విధిగా చేయవలసినవి కాదు. ఇదే మన జీవితం, మన పీల్చుకొనే, వదిలే ప్రతి ఊపిరి ఇదే.

ఈ విషయం అనుభూతి పొంది, అనుభవంలోకి తెచ్చుకోకపోతే, మనుషులు దీని గురించే నిజంగా ఏదో చేయగలరని నాకు నమ్మకం కలగటం లేదు. ఆర్థికపరమైన ఆదుర్దాలెలా ఉన్నా, పర్యావరణ సంబంధిత విషయాలు మన ఆర్థిక అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగాలుగా పరిగణించాలి. లేకపోతే మనం పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ఎలాంటి విషయం అంటే రాజనీతిజ్ఞులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఎప్పుడూ దీనికి స్పృహతో స్పందించి, కృషి చేయాలి.

ఈ భూమిపై ముఖ్యమైన కొద్దిమందిలో ఏ కొంచెం మార్పు చేయగలిగినా, అలాగే వాటిపై అవసరమైన దృష్టి పెట్టి సరైన రీతిలో వనరులను వెచ్చించినా, ఈ భూమాత తనను తాను సరిచేసుకుంటుంది.

మనం ఒక్క అవకాశం ఈ భూమాతకు ఇస్తే, ఆమె తిరిగి సంపూర్ణమైన సంవృద్ధి, సౌందర్యాలను కచ్చితంగా పొందగలదు. దీనికోసం మనం గొప్ప పనులేమీ చేయనక్కర్లేదు. మనం భూమిని సరిచేయనక్కరలేదు. వీలైనంతవరకు ఆమె జోలికి పోకుండా, కేవలం మనం చేస్తున్న నష్టాన్ని తగ్గిస్తే, మిగతాది అంతా దానంతట అదే జరుగుతుంది.

ఈ రోజు శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ భూమిపై అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, ఈ భూమిపై జీవం కేవలం 25 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుందని! జీవరాశి మొత్తం మనతో సహా 25 సంవత్సరాలలో అంతమొందుతుంది. కీటకాలు కనుక వెళ్లిపోతే, ఒక్క జీవి కూడా మిగలదు. సమస్త జీవులు చనిపోతాయి. కానీ మనుషులు కనిపించకుండా పోతే 25 సంవత్సరాలలో భూమి తిరిగి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.

ఎవరైనా వారి అంతరంగంలోకి చూసుకుంటే, సహజంగానే అతని ఉనికికీ, బయట ఉండేవాటి ఉనికికీ తేడా
లేదని వారు గుర్తించగలరు. అన్నింటినీ కలుపుకోగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందో, మీ చుట్టూ ఉన్న అన్నింటి గురించీ బాధ్యత వహించడం, జాగ్రత్తపడటం అనేది మీకు చాలా సహజమైపోతుంది.

మన తరం ఒక విపత్తుగా మారకూడదని నా ఆకాంక్ష. మనం చేయలేని పని చేయకపోతే ఫరవాలేదు, కాని మనం చేయగలిగీ చేయకుండా ఉంటే, మనమే ఒక విపత్తు.

- జగ్గీ వాసుదేవ్

సేకరణ : గత ఏడాది సాక్షి ఆదివారం సంచికలో ప్రచురించబడినది

పర్యావరణాన్ని కాపాడండి

Tuesday, 3 June 2014

హిందూ ధర్మం - 75 (త్రిశంకు తలక్రిందులుగా వ్రేలాడటం)

అది విన్న దేవతలు విశ్వమిత్రునితో 'ఏవం భవతు (అలాగే జరుగుగాకా). నీకు శుభములు చేకూరుగాకా. నీవు సృష్టించిన నక్షత్రాలు, తారలు ఇతరములన్నీ వాటి స్థానాల్లోనే ఉంటాయి. కానీ అద్భుతమైన ఈ నక్షత్రాలు వైశ్వానర పథానికి బయట వేరుగా ఉంటాయి. త్రిశంకు ఈ నక్షత్రమండలం మధ్యలో ఉంటాడు కానీ తల్లక్రిందులుగా ఉంటాడు. ఎందుకంటే ఇంద్రుని మాట వ్యర్ధమవ్వదు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఈ త్రిశంకు చుట్టూ నక్షత్రాలన్నీ ప్రదక్షిణలు చేస్తాయి. వాటి మధ్య త్రిశంకు పెద్ద నక్షత్రంలా వెలిగిపోతుంటాడు' అనగా, దానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ యజ్ఞం ముగియగానే, వచ్చిన ఋషులు, దేవతలు ఎట్లా వచ్చారో అట్లాగే వెళ్ళిపోయారు. (అది వేదవిరుద్ధమైన యాగం కనుక అక్కడ దక్షిణలు, ప్రసాదాలు ఏమీ తీసుకోలేదు.

త్రిశంకు గురువు మాటలు విని ఉంటే మంచి స్థితిలో ఉండేవారు. అతడే కాదు, ఎవరైనా పెద్దలు చెప్పిన మంచిమాటలు వింటే అభివృద్ధిలోకి వస్తారు. తన గురువు వద్దని చెప్పినా వినకుండా, అతని కోరిక తీర్చుకోవడం కోసం అందరిని ఆశ్రయించాడు. కోరిక ఉండకూడదు అనటంలేదు, కానీ అది ధర్మ విరుద్ధం కాకూడాదు. జరగబోయే కీడు గమనించి, వశిష్టపుత్రులు శపించినా, విషయం గ్రహించక, ఇంకా అదే వ్యామోహంతో తిరిగాడు. ఆఖరికి విశ్వామిత్రుని వద్దకు చేరుకున్నాడు. యాగం చేశాడు కానీ దేవతలు రాలేదు, పోని స్వర్గలోకానికి వెళ్ళాడా అంటే అదీ లేదు. భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో తలక్రిందులుగా(తల క్రిందకు, కాళ్ళు పైకి పెట్టి) వ్రేలాడుతున్నాడు. ఇంతా చేసి త్రిశంకు సాధించినదేమిటి? అందుకే గురువుల మాటలు ఎప్పుడు పెడచెవిన పెట్టకూడదు. చిన్న కోరిక, ధర్మ విరుద్ధమైన కోరిక, ఈ స్థితికి తెచ్చింది.

ఇక ఇప్పటి వరకు విశ్వామిత్రుడు సాధించిందేమిటి? తపస్సు చేసి పొందిన శక్తితో వశిష్టపుత్రులను శపించి సగం శక్తి పోగొట్టుకున్నాడు. అర్దంపర్దం లేని పంతాలకు పోయి, దేవతలను ఎదురించి చేసిన మిగితా పనులతో మొత్తం శక్తి కోల్పోయాడు. కోపం ఎన్నో వేళ ఏళ్ళు కష్టపడి చేసిన తపస్సును వృధా చేసింది.) అందరు వెళ్ళిపోయిన తరువాత విశ్వామిత్రుడు తన దగ్గరే అడవిలో ఉంటున్న మునులతో ఈ విధంగా అన్నాడు. 'మనకు ఈ దక్షిణ దిక్కు కలిసిరాలేదు. నేను గొప్ప తపస్సు చేస్తున్న సమయంలో త్రిశంకు రూపంలో అడ్డకున్లు ఏర్పడ్డాయి. కనుక మనం మంచి సరస్సులతో ఉన్న పశ్చిమ (పడమర దిక్కుకు) వెళ్ళి తపస్సు చేసుకుందాము. అది చాలా విశాలంగా ఉంటుంది, పవిత్రమైన జలాశయాలు ఉన్నాయి, తపోవనం కూడా ఉంది' అని చెప్పి పడమర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు.

To be continued ..............

Monday, 2 June 2014

హిందూ ధర్మం - 74 (త్రిశంకు స్వర్గానికి వెళ్ళటం)

దేవతలు రావడం లేదని కోపంతో విశ్వామిత్రుడు చేతిలోకి సృవాన్ని(అగ్నిహోత్రంలో హవిస్సు వేయడానికి వడే చెక్క పరికరం) తీసుకుని, దాన్ని ఎత్తి పట్టుకుని పైకి ఊపుతూ, ఒక్కసారి లేచి నిల్చుని తిశంకుతో ఈ విధంగా అన్నారు.  ఓ రాజా! ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. నాకున్న శక్తి చేత, నిన్ను ఇప్పుడే ఈ శరీరంతో స్వర్గానికి పంపుతాను. దేవతలు వచ్చి హవిస్సు తీసుకోకపోతే నువ్వు వెళ్ళడం అసాధ్యం. వాళ్ళకి నా శంక్తి తెలియదు. కానీ నేను చేసిన తపస్సు వలన నాకు శక్తి వచ్చింది. దాన్ని వినియోగిస్తాను అన్నాడు. ఈ మాటలు పూర్తి అవుతున్న సమయంలో ఇతర ఋషులు చూస్తుండగా, త్రిశంకు స్వర్గ లోకం దిశగా ఆకాశంలో పైకి వెళుతున్నాడు. త్రిశంకు స్వర్గంలో ప్రవేశించడం చూసి, ఇంద్రుడు, మిగితా దేవతలు ఈ విధంగా అన్నారు. 'త్రిశంకు! ఇదేమైనా నీ విహారస్థలము అనుకున్నావా? అక్కడే ఆగు! నీకు గురువు (వశిష్టమహర్షి) శాపం ఉన్నందువల్ల నీకు ఇక్కడ స్థానం లేదు. ఓ మూఢా! తలకిందులుగా భూలోకంలో పడు'.

వెంటనే త్రిశంకు విశ్వామిత్ర మహర్షిని ఉద్ద్యేశించి రక్షించండి, రక్షించండి అంటూ క్రిందకు పడ్డాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు బదులుగా ఇంకా కోపంతో ఆగు, ఆక్కడే ఆగు అంటూ అరిచారు. త్రిశంకును దేవలోకానికి రానివ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను, నేనే ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తాను అన్ని దక్షినదిశలో సప్తఋషి మండలాన్ని సృష్టించారు. (మాములుగా సప్తఋషి మండలం ఉత్తరదిక్కులో ఉంటుంది. ఇది దేవతలకు వ్యతిరేకంగా చెస్తున్నాడు, ఉత్తరానికి ఎదురుగా దక్షిణ దిశలో సృష్టించాడు.) నక్షత్రాలను, గెలాక్సీలను కూడా తయారు చేశాడు. అయిన విశ్వామిత్రునిలో కోపం చల్లారలేదు. అదే కోపంతో ఇప్పుడు నేను వేరొక స్వర్గాన్ని చేసి, అందులో దేవతలను, ఇంద్రుడిని కూడా సృష్టిస్తాను. ఇంద్రుడి అవసరం కూడా నా స్వర్గానికి లేదు అంటూ సృష్టి ప్రారంభించగా దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ ప్రమాదమేంటి? ఈయన వేరొక స్వర్గాన్ని సృష్టితున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు, ఇది ధర్మవిరుద్ధం, సృష్టి నియమాలకు విరుద్ధం అని రాక్షసులు, మునులతో కలిసి దేవతలందరూ విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరుకుని 'మీరు తపస్సు చేత గొప్ప స్థితిని పొందారు. మీ తెలియనిది కాదు. త్రిశంకు తన గుర్వుల చేత శపించబడ్డాడు. కనుక అతడు తన భౌతిక శరీరంతో స్వర్గ ప్రవేశానికి అనర్హుడు' అన్నారు. ఇది విన్న విశ్వామిత్రుడు గట్టి స్వరంతో 'నేను సశరీరంతో త్రిశంకును స్వర్గానికి పంపుతానని అతనికి ప్రమాణం చేసాను. ఆ మాటను అసత్యం చేయడం, తప్పడం నాకు ఇష్టంలేదు. త్రిశంకు శాశ్వతంగా స్వర్గంలో ఉండుగాకా. నేను సృష్టించిన నక్షత్రాలు, తారలు, ఇతరములన్నీ ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి. మీరు నా స్వర్గాన్ని కూడా అంగీకరించండి' అన్నాడు దేవతలతో.

To be continued ............

Sunday, 1 June 2014

హిందూ ధర్మం - 73 (రాజర్షి విశ్వామిత్రుడు)

విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోతూ 'నేను ఎంతో గొప్ప తపస్సు చేశాను, నన్ను దూషించినవాడు బూడిదవుతారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు వారు యముడి పాశాల చేత బంధించబడతారు. ఏడు వందల జన్మల వరకు శవాలను తింటూ బ్రతుకుతారు. భయంకరమైన శరీరం కలిగి, కుక్క మాంసం తినే ముష్టికులుగా మారిపోతారు. ఆ దుర్భుద్ది అయిన మహోదయడు ఎవరిని నిందిస్తే లోకాన్ని నిందించినట్టో, ఎవరు దూషించకూడని నన్నే దూషించాడు కనుక అతను సర్వలోకాల చేత దూషింపబడుతూ నిషాదుడిగా మారిపొతాడు. నా కోపం వలన అతడు పరమ నీచస్థితిని పొంది, అనేక జన్మలు ఎత్తి చాలా కాలం దుర్భరమైన జీవనం సాగిస్తాడు అని విశ్వామిత్రుడు పలుకుతుండగా మునులు రావడం, వారి గమనించడం చూసి మాట్లాడటం ఆపేశాడు. (వచ్చినవారు కూడా ఇష్టపడి రాలేదు. విశ్వామిత్రుని ఆగ్రహానికి గురైతే మళ్ళీ ఏమని శపిస్తాడో అని భయపడి వచ్చారు. ఎంతో కష్టపడి తపస్సు చేసి శక్తిని పొందాడు. కానీ ఏం లాభం? తన మీద తనకు నిగ్రహం లేదు. వశిష్టపుత్రులు శాస్త్రాన్నే చెప్పారు. కానీ కోపం కారణంగా మతితప్పింది. వారు చెప్పినమాటలు చెడుగా తోచాయి. ఎదుటివారు నాలుగు మంచి విషయాలు చెప్పినా, కోపగ్రస్థుడైన వ్యక్తికి అవి చెడుగానే వినిపిస్తాయి. కోపంతో వశిష్టపుత్రులను శపించాడు విశ్వామిత్రుడు. తపస్సు, పూజా, జపం, ధ్యానం మొదలైనవి చేసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది, శక్తి పెరుగుతుంది. అది సక్రమంగా వాడుకుంటే, జీవితంలో అనేక అవరోధాలను సునాయాసంగా దాటగలము. కానీ కోపం, ఆవేశం మొదలైనవాటిని అదుపులో ఉంచుకోవాలి. పొరపాటున కోపంలో ఎవరినైన ఒక మాట అంటే, ఆ మాటతో పాటు చేసిన ఫలితంలో కొంత భాగం వెళ్ళిపోతుంది. పెద్దపెద్ద పూజలు చేస్తారు, కానీ పూజ అవ్వగానే ఎవరి మీదనో నోరుపారేసుకుంటారు. ఏం లాభం? చేసిందంతా వృధా అవుతుంది. అదే మంచి మాట పలికితే అది జరిగి, మణ్చి ఫలితాలు వస్తాయి. అందుకే వీలున్నప్పుడు జపతపాలు చేసిన వారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటే, తపోశక్తి కారణంగా వారి మాటలు నిజమై జీవితంలో వృద్ధిలోకి వస్తాము. కానీ విశ్వామిత్రుడు ఈ విషయాన్ని కోపంలో మర్చిపోయి, శాపాన్ని విడ్చిపెట్టాడు. ఫలితంగా తాను చేసిన తపస్సులో కొంత శక్తి శాపం రూపంలో కోల్పోయాడు.)    

ఇక్ష్వాకు వంశస్థుడైన త్రిశంకు పరమ ధర్మాత్ముడు. అతడు తన భౌతిక శరీరంతో దేవలోకానికి వెళ్ళి, దేవతలను గెలవాలని నా చెంతకు వచ్చాడు. మీరు చేసే యాగం వలన ఇతడు దేవలోకానికి వెళ్ళాలని అక్కడికి వచ్చిన ఋషులతో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన మాటలు విన్న మహర్షులంతా ఒక చోట చేరి, ధర్మ సమ్మతమైన యాగం ఏమైనా ఉందా అని చర్చించుని, అటువంటి యాగం ఎక్కడ చెప్పబడలేదని నిశ్చయించుకున్నారు. ఒకవేళ విశ్వమిత్రునికి ఈ మాట చెప్పి, యాగం చేయమని చెప్తే, తమని కూడా శపిస్తారని భయపడి, ఈయనతో తలకాయ నొప్పి ఎందుకు? విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలాగే యాగం చేద్దాం, ఆయన మాటలను ఆధారంగా చేసుకుని యాగవిధి నిర్వహిద్దాం అని అనుకున్నారు. మనకు ఎందుకు వచ్చిన గోల! మనం యాగం చేద్దాం, విశ్వామిత్రుడు తన తపశక్తితో త్రిశంకును స్వర్గానికి పంపించుకుంటాడు, ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం, మన పని మాతం మనం పూర్తి చేద్దామని అని యాగం పనులు ప్రారంభించారు. విశ్వామిత్రుని యాజకర్తగా ఎన్నుకుని, ఆయనికి అధ్యక్షతను అప్పగించారు. మంత్రకోవిధులు, ఋత్విజులు, ఇతరులందరూ కల్పంలో చెప్పబడిన రీతిలో యాగంలో భాగాలను పూర్తి చేశారు. చాలాసమయం తరువాతా విశ్వామిత్రుడు యగంలో తమ భాగం స్వీకరించవలసిందిగా దేవతలను ఆహ్వానించారు. యాగాన్ని వేదం అంగీకరించదు, కనుక దేవతలు తమ యజ్ఞభాగాలను తీసుకుని ఫలం ఇవ్వడానికి ముందుకురాలేదు. దేవతలు హవిస్సు తీసుకోకపోతే, యాగం పూర్తవ్వదు, ఫలితం నెరవేరదు.

 To be continued .................