Tuesday, 3 June 2014

హిందూ ధర్మం - 75 (త్రిశంకు తలక్రిందులుగా వ్రేలాడటం)

అది విన్న దేవతలు విశ్వమిత్రునితో 'ఏవం భవతు (అలాగే జరుగుగాకా). నీకు శుభములు చేకూరుగాకా. నీవు సృష్టించిన నక్షత్రాలు, తారలు ఇతరములన్నీ వాటి స్థానాల్లోనే ఉంటాయి. కానీ అద్భుతమైన ఈ నక్షత్రాలు వైశ్వానర పథానికి బయట వేరుగా ఉంటాయి. త్రిశంకు ఈ నక్షత్రమండలం మధ్యలో ఉంటాడు కానీ తల్లక్రిందులుగా ఉంటాడు. ఎందుకంటే ఇంద్రుని మాట వ్యర్ధమవ్వదు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఈ త్రిశంకు చుట్టూ నక్షత్రాలన్నీ ప్రదక్షిణలు చేస్తాయి. వాటి మధ్య త్రిశంకు పెద్ద నక్షత్రంలా వెలిగిపోతుంటాడు' అనగా, దానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ యజ్ఞం ముగియగానే, వచ్చిన ఋషులు, దేవతలు ఎట్లా వచ్చారో అట్లాగే వెళ్ళిపోయారు. (అది వేదవిరుద్ధమైన యాగం కనుక అక్కడ దక్షిణలు, ప్రసాదాలు ఏమీ తీసుకోలేదు.

త్రిశంకు గురువు మాటలు విని ఉంటే మంచి స్థితిలో ఉండేవారు. అతడే కాదు, ఎవరైనా పెద్దలు చెప్పిన మంచిమాటలు వింటే అభివృద్ధిలోకి వస్తారు. తన గురువు వద్దని చెప్పినా వినకుండా, అతని కోరిక తీర్చుకోవడం కోసం అందరిని ఆశ్రయించాడు. కోరిక ఉండకూడదు అనటంలేదు, కానీ అది ధర్మ విరుద్ధం కాకూడాదు. జరగబోయే కీడు గమనించి, వశిష్టపుత్రులు శపించినా, విషయం గ్రహించక, ఇంకా అదే వ్యామోహంతో తిరిగాడు. ఆఖరికి విశ్వామిత్రుని వద్దకు చేరుకున్నాడు. యాగం చేశాడు కానీ దేవతలు రాలేదు, పోని స్వర్గలోకానికి వెళ్ళాడా అంటే అదీ లేదు. భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో తలక్రిందులుగా(తల క్రిందకు, కాళ్ళు పైకి పెట్టి) వ్రేలాడుతున్నాడు. ఇంతా చేసి త్రిశంకు సాధించినదేమిటి? అందుకే గురువుల మాటలు ఎప్పుడు పెడచెవిన పెట్టకూడదు. చిన్న కోరిక, ధర్మ విరుద్ధమైన కోరిక, ఈ స్థితికి తెచ్చింది.

ఇక ఇప్పటి వరకు విశ్వామిత్రుడు సాధించిందేమిటి? తపస్సు చేసి పొందిన శక్తితో వశిష్టపుత్రులను శపించి సగం శక్తి పోగొట్టుకున్నాడు. అర్దంపర్దం లేని పంతాలకు పోయి, దేవతలను ఎదురించి చేసిన మిగితా పనులతో మొత్తం శక్తి కోల్పోయాడు. కోపం ఎన్నో వేళ ఏళ్ళు కష్టపడి చేసిన తపస్సును వృధా చేసింది.) అందరు వెళ్ళిపోయిన తరువాత విశ్వామిత్రుడు తన దగ్గరే అడవిలో ఉంటున్న మునులతో ఈ విధంగా అన్నాడు. 'మనకు ఈ దక్షిణ దిక్కు కలిసిరాలేదు. నేను గొప్ప తపస్సు చేస్తున్న సమయంలో త్రిశంకు రూపంలో అడ్డకున్లు ఏర్పడ్డాయి. కనుక మనం మంచి సరస్సులతో ఉన్న పశ్చిమ (పడమర దిక్కుకు) వెళ్ళి తపస్సు చేసుకుందాము. అది చాలా విశాలంగా ఉంటుంది, పవిత్రమైన జలాశయాలు ఉన్నాయి, తపోవనం కూడా ఉంది' అని చెప్పి పడమర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు.

To be continued ..............

No comments:

Post a Comment