మనం ఇప్పుడు ఎలాంటి సమయంలో జీవనం సాగిస్తున్నామంటే, మనని ఇంతకాలం పోషించిన వాటిని మనం ఈ రోజు పరిరక్షించుకోవడం గురించి ఆలోచించవలసి వస్తున్నది. భూమిని సంరక్షించుకోవటం గురించి మాట్లాడవలసి వస్తున్నది.
భూమిని పరిరక్షించడం మనం మంచి జీవితాన్ని ఏర్పరచుకోవటం కోసమే. భూమి సరిగా లేకపోతే మనకు సరైన జీవనం లేదు. పర్యావరణ సంబంధిత బాధ్యతలు విధిగా చేయవలసినవి కాదు. ఇదే మన జీవితం, మన పీల్చుకొనే, వదిలే ప్రతి ఊపిరి ఇదే.
ఈ విషయం అనుభూతి పొంది, అనుభవంలోకి తెచ్చుకోకపోతే, మనుషులు దీని గురించే నిజంగా ఏదో చేయగలరని నాకు నమ్మకం కలగటం లేదు. ఆర్థికపరమైన ఆదుర్దాలెలా ఉన్నా, పర్యావరణ సంబంధిత విషయాలు మన ఆర్థిక అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగాలుగా పరిగణించాలి. లేకపోతే మనం పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ఎలాంటి విషయం అంటే రాజనీతిజ్ఞులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఎప్పుడూ దీనికి స్పృహతో స్పందించి, కృషి చేయాలి.
ఈ భూమిపై ముఖ్యమైన కొద్దిమందిలో ఏ కొంచెం మార్పు చేయగలిగినా, అలాగే వాటిపై అవసరమైన దృష్టి పెట్టి సరైన రీతిలో వనరులను వెచ్చించినా, ఈ భూమాత తనను తాను సరిచేసుకుంటుంది.
మనం ఒక్క అవకాశం ఈ భూమాతకు ఇస్తే, ఆమె తిరిగి సంపూర్ణమైన సంవృద్ధి, సౌందర్యాలను కచ్చితంగా పొందగలదు. దీనికోసం మనం గొప్ప పనులేమీ చేయనక్కర్లేదు. మనం భూమిని సరిచేయనక్కరలేదు. వీలైనంతవరకు ఆమె జోలికి పోకుండా, కేవలం మనం చేస్తున్న నష్టాన్ని తగ్గిస్తే, మిగతాది అంతా దానంతట అదే జరుగుతుంది.
ఈ రోజు శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ భూమిపై అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, ఈ భూమిపై జీవం కేవలం 25 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుందని! జీవరాశి మొత్తం మనతో సహా 25 సంవత్సరాలలో అంతమొందుతుంది. కీటకాలు కనుక వెళ్లిపోతే, ఒక్క జీవి కూడా మిగలదు. సమస్త జీవులు చనిపోతాయి. కానీ మనుషులు కనిపించకుండా పోతే 25 సంవత్సరాలలో భూమి తిరిగి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.
ఎవరైనా వారి అంతరంగంలోకి చూసుకుంటే, సహజంగానే అతని ఉనికికీ, బయట ఉండేవాటి ఉనికికీ తేడా
లేదని వారు గుర్తించగలరు. అన్నింటినీ కలుపుకోగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందో, మీ చుట్టూ ఉన్న అన్నింటి గురించీ బాధ్యత వహించడం, జాగ్రత్తపడటం అనేది మీకు చాలా సహజమైపోతుంది.
మన తరం ఒక విపత్తుగా మారకూడదని నా ఆకాంక్ష. మనం చేయలేని పని చేయకపోతే ఫరవాలేదు, కాని మనం చేయగలిగీ చేయకుండా ఉంటే, మనమే ఒక విపత్తు.
- జగ్గీ వాసుదేవ్
సేకరణ : గత ఏడాది సాక్షి ఆదివారం సంచికలో ప్రచురించబడినది
పర్యావరణాన్ని కాపాడండి
No comments:
Post a Comment