Saturday, 13 December 2014

హిందూ ధర్మం - 109 (వేదం)

ఓం

ఇంతకముందు హిందూ ధర్మం అనే శీర్షిక మీద దాదాపు రోజుకొక పోస్ట్ అందించాను కానీ ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన పనులవల్ల, సమాయాభవం వలన మధ్యలోనే ఆపేశాను. తర్వాత తిరిగి కొనసాగిద్దామని ఎంత ఆశించినా, కొన్ని అనివార్య కారణల వల్ల కుదరలేదు. అయితే భగవదాశీర్వాదంతో ఇప్పుడు తిరిగి కొనసాగిద్దామని భావిస్తున్నా.రోజు క్రమం తప్పకుండా ఒక పోస్ట్ అందించగలనని చెప్పలేను కానీ సాధ్యమైనతవరకు రోజు అందించే ప్రయత్నం మాత్రం చేయగలను. ఇంతకముందు అందించిన పోస్ట్‌లు బ్లాగులో ధర్మం అనే లేబుల్ క్రింద ఉన్నాయి. అప్పుడు చూడనివారు ఆసక్తి ఉంటే చూడగలరు.

హిందూ ధర్మం - 109

ఈ సనాతన/ భారతీయ/ హిందూ ధర్మానికి పునాది వేదం/ శ్రుతి, స్మృతులు గోడలు, ఇతిహాస పురాణలు ముట్టుగోడలు అంటారు స్వామి శివానంద సరస్వతీ. సనాతన ధర్మానికి మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం.

వేదం అనే పదం విద్ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవలసినది అని అర్దం. వేదం విశ్వమానవాళికి భగవంతుడు ప్రసాదించిన అద్భుత జ్ఞానభాంఢాగారం. వేదం కేవలం బ్రాహ్మణులకు, అందులో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. దీనినే యజుర్వేదంలో భగవంతుడే స్పష్టం చేశాడు.

యధేమాం వాచం కల్యాణిమావదాని జనేభ్యః |
బ్రహ్మరాజనాభ్య శూద్రాయచర్యాచ స్వాయ చరణాయచ ||
(యజుర్వేదం 26-2)

ఎట్లు నేను మనుష్యులందరికి కొరకు, ఈ సంసారసుఖమును, ముక్తిసుఖమును ఇచ్చినట్టు, ఈ వాణిని (వేదాన్ని) ఉపదేశించుచున్నానో, అట్లే మీరు కూడా చేయవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్రుల కొరకు, వారి బృత్యుల కొరకు, స్త్రీల కొరకు, అతిశూద్రుల కొరకు, సమస్త మానవాళికి వేదమును ప్రకాశపరిచితిని. అనగా మానవలందరూ వేదములను చదివి, చదివించి, విని, వినిపించి, విజ్ఞానమును వృద్ధి పరచుకుని, దుఃఖముల నుండి దూరమై, ఆనందమును పొందుగాకా అని సృష్టి ఆరంభంలో పరమాత్మ ఆదేశించారు. అందువల్ల వేదసారాన్ని అందరూ తెలుసుకోవాలి. భావాన్ని, వేదవాక్కుల అర్ధాలను, విజ్ఞానాన్నితెలుసుకోవడంలో అడ్డంకులు ఎవరికి లేవు. కాకపోతే, శ్రద్ధ కలిగి తెలుసుకోవాలి. కానీ చదవాలంటే మాత్రం గురువు వద్ద శ్రద్ధగా 12 ఏళ్ళు అభ్యాసం చేసిన తర్వాతే స్వరయుక్తంగా నిర్ణీత సమయంలో దేశకాలాలను అనుసరించి చదవాలి.

To be continued .................

No comments:

Post a Comment