Friday, 19 December 2014

హిందూ ధర్మం - 115 (వేదం)

వేదాలంచించే జ్ఞానం ఎంతో సూక్ష్మంగా ఉన్నా, అది ఒక వ్యక్తికి, కాలానికి, ప్రాంతానికి చెందదు. అందులో వ్యక్తుల, రాజుల , దేశాల చరిత్ర, ప్రవక్తల గురించి అసలే ఉండదు. అందులో చెప్పబడ్డ విజ్ఞానమంతా కాలాతీతం, ఖచ్చితం. సర్వకాలాలో మార్పు చెందినవి, ఎన్నటికి నిలిచి ఉండేవి అయిన సత్యాల అందులో చెప్పబడ్డాయి. భగవంతుడు మానవసమాజంతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, తన సందేశాన్ని వేదం ద్వారానే చెప్పాడు. అందుకే వేదానికి స్వతఃప్రమాణం (Self-evident) అని పేరు. అంటే అందులో చెప్పబడ్డ విషయాలను ఋజువు చేయడానికి వెరొక సాక్ష్యం (evidence) కానీ, ప్రమాణం కానీ అవసరంలేదు. ఉదాహరణకు కళ్ళ ముందు సూర్యుడు కనిపిస్తున్నప్పుడు, సూర్యుడు ఉన్నాడని చూపడానికి ఏం సాక్ష్యం చూపిస్తారు? ఎలాగైతే సూర్యుడు ఉన్నాడనటానికి సూర్యుడే ప్రమాణమో, ఇంకో సాక్ష్యమవసరంలేదో, అలాగే వేదానికి కూడా మరొక ప్రమాణం అవసరంలేదు. వేదంలో ఫలానా విషయాలు చెప్పబడ్డాయి, మాకు వాటి మీద నమ్మకం లేదు అనుకుంటే, పరిశోధన చేయండి, ఫలితం వేదంలో ఎలా చెప్పబడిందో అదే కనిపిస్తుంది.

ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి కనుక సమమ్నాయము అని, ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య కనుక ఆమ్నాయము అని వేదానికి పేర్లు. వేదం అనే పదానికి ఆలోచన అనే అర్దముంది. మనిషిలో విచక్షణా జ్ఞానాన్ని, ఎదుగుదలను కలిగించేది ఆలోచనే. వేదం మానవునికి సత్, అసత్‌ల మధ్య ఉండే తేడాను వివరిస్తుంది.

వేదం అన్నమాటకు మరొక అర్దం 'ఉన్నది' అని, అంటే వేదం అస్తిత్వం గురించి చెప్తోంది. నేను, నేను అంటూ తరచు అంటుంటాం, ఆ నేను అనేది ఒక అస్తిత్వం. ఒక యంత్రాన్ని తయారు చేసి, దాన్ని శక్తి సాయంతో నడిపించవచ్చు, కానీ యంత్రానికి అస్తిత్వభావన ఇవ్వలేము. మన ఇంట్లో ఉన్న కంప్యూటర్‌నే తీసుకోండి. కంప్యూటర్ అద్భుతంగా పని చేస్తుంది కానీ నేనీ పని చేస్తున్నాను అనలేదు, దానికి నేను అనే భావన కలగదు, కలగలేదు, అది లెక్కలే చేస్తుందో, వాతవరణాన్ని అంచనా వేస్తుందో, అదంతా తర్వాతి మాట. దానికి అహం భావం లేదు. నేను అనేది అస్తిత్వం. ఆ అస్తిత్వం గురించి తొలుతగాను, విపులంగాను వేదం చెప్పింది. అందుకే భారతీయ ధర్మశాస్త్రం ఒక మాట అంటుంది. ఎవరు నాస్తికులు అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరు వేదాన్ని విశ్వసించరో, వారే నాస్తికులు. ఇతర మతాల్లో దేవుడిని విశ్వసించనివారు నాస్తికులు అనబడతారు. ఇదే మనకి, వాళ్ళకీ ఉన్న ఒక పెద్ద తేడా. నేను వేదాన్ని నమ్మనండి, గీత, రామాయణం, పురాణాలే నమ్ముతాను అంటే ఋషులు ఒప్పుకోలేదు. నువ్వు వేదాన్ని నమ్ముతావా? నమ్మితే ఆస్తికుడివి, నమ్మకపోతే నాస్తికుడివి అంటుంది ధర్మం.

దేవుడు కళ్ళకి కనిపించడు, కానీ ఉన్నాడు. ఆయనను చూడలేదు కనుక ఉన్నాడని గట్టి విశ్వాసం చూసేవరకు కలగదు . కానీ ఆయనిచ్చిన వేదం ఉంది. కనిపించే స్థూలప్రపంచంలో ఉన్నవన్నీ వేదంలో చెప్పబడ్డట్టుగానే ఉన్నాయి, తర్కానికి (Logic) వేదం నిలుస్తుంది, అందులో చెప్పబడ్డ విషయాలు తార్కికంగా (Logical) ఉంటాయి. కళ్ళకు కనిపించేవన్నీ చెప్తున్నప్పుడు, దాన్ని నేను నమ్మను అనడం అస్తిత్వాన్ని నమ్మకపోవడమే అవుతుంది. అందుకే వేదాన్ని విశ్వసించనివారు, అంగీకరించనివారు నాస్తికులు అన్నారు శాస్త్రకారులు.

To be continued ..................

No comments:

Post a Comment