Tuesday, 16 December 2014

హిందూ ధర్మం - 112

మానవజాతి వికాసానికి, ఆలోచనకు స్వేచ్ఛనిచ్చి అభివృద్ధికి బాటలు వేసింది సనాతన ధర్మం. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః అంటుంది ఋగ్ వేదం. అంటే మంచి ఆలోచనలు, భావనలు, సంకల్పాలు అన్ని దిశల నుంచి మాపై ప్రసరించుగాకా అని అర్దం. నిత్యం నూతనమైన విషయాలు తెలుసుకోవాలని వేదం చెప్తోంది. మానవపతనం ఎప్పుడు మొదలవుతుంది లేక మానవ వికాసం ఎప్పుడు కుంటుపడుతుందని ప్రశ్నిస్తే, దానికి ఒకటే జవాబు దొరుకుతుంది. ఎప్పుడు మనిషి ఆలోచనలకు అడ్డంకి కలుగుతుందో, ఆ క్షణమే మానవ వికాసం కుంటుపడుతుంది. గత చరిత్ర గమనిస్తే ప్రపంచమంతా అదే జరిగింది, కానీ దానికి భారత్ భిన్నం. ఈ దేశంలో రాజులు నూతన ఆవిష్కరణలు చేసినవారికి బహుమానాలు ఇచ్చారు, సత్కారాలు, సన్మానాలు చేశారు, బిరుదిలిచ్చి గౌరవించారు. మానవజాతి పురోగమనం కోసం పండితులతో నిత్యం శాస్త్ర చర్చలు నిర్వహించారు. ఒకే విషయంపై వందల మంది పరిశోధనలు చేశారు. ఫలితంగా సైన్సు పురాతన భారతదేశంలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. క్రీస్తు పుట్టకముందే ప్రపంచం మొత్తం నుంచి వేలమంది విద్యార్ధులు వచ్చి భారతదేశంలో విద్యను అభ్యసించారు. నలందా, తక్షశిలా ఇందుకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు.

ఉదాహరణకు జ్యోతిష్యం తీసుకుంటే జ్యోతిష్యం మీద భృగుమహర్షి అద్భుతమైన గ్రంధం రాశారు భృగు సంహిత అన్న పేరుతో, భృగు మహర్షి అందించారని పరాశర మహర్షి ఆగిపోలేదు, వారు మరింత పరిశోధించి వారొక జ్యోతిష్య గ్రంధం రాశారు. ఇది ఎప్పుడో 5000 ఏళ్ళ క్రితం జరిగినది. ఆ తర్వాత అనేకమంది ఇంకా ఇంకా కొత్త విషయాలతో మళ్ళీ గ్రంధాలు రాశారు. ఎక్కడ పాతవి ఖండించబడలేదు, పురాతన గ్రంధాలను, వాటి రచయితలను మెచ్చుకుంటూనే నూతన విషయాలు ప్రస్తావించారు. అలా చూసుకుంటే మిహురుడు బృహజ్జాతకం అనే అపూర్వమైన గ్రంధం అందించారు. మిహురుడు విక్రమాదిత్యుని ఆస్థానంలో పండితుడు, విక్రమాదిత్యుడికి కొడుకు పుట్టినప్పుడు, ఆ పిల్లవాడు 13 వ ఏట పంది కారణంగా మరణిస్తాడని మిహ్రుడు చెప్తాడు, అదే జరిగింది. అయినా విక్రమాదిత్యుడు కోపించకుండా, శాస్త్రం అభివృద్ధి చెందాలని మిహురిడికి కావలసిన సదుపాయాలు కల్పించి, జ్యోతిష్యం మీద మరింత పరిశోధన చేయమంటాడు. అలా వరాహమిహురుడు అద్భుతమైన గ్రంధం లోకానికి ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా అనేకులు పరిశోధన చేసి, మరిన్ని విషయాలు చెప్పారు. ఆధునిక కాలంలో గత 500-600 ఏళ్ళ క్రితం శ్రీ మాధవ విద్యారణ్య భారతీ స్వామివారి కూడా జ్యోతిష్యం గురించి చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఒకరు ఇస్తే సరిపోదా, ఇంతమంది ఇవ్వాలా అంటే జ్ఞానం అపారమైనది, దానికి అంతు లేదు. ఇది ఇంతవరకే అని చెప్పే అవకాశం చాలా తక్కువ. ఇది భారతీయులకు అర్దమైంది. అందుకే ప్రతి విషయంపై లోతైన పరిశోధన చేశారు. అందుకే శాస్త్రాలు విస్తరించాయి. దానికి మూలం వేదంలో ఉంది.

To be continued ....................

No comments:

Post a Comment