Tuesday, 23 December 2014

హిందూ ధర్మం - 119 (బ్రాహ్మణాలు)

2. బ్రాహ్మణాలు:

భగవంతుడు ప్రసాదించిన వేదం మంత్రరూపంలో సూక్తములతో ఉంది. దాన్ని అలాగే అర్దం చేసుకోవడం అసాధ్యం. మరి వైదుక ధర్మాన్ని ఆచరించాలంటే ఎలా? యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేస్తారు? అందువల్ల సంహితలోని మంత్రాల అర్ధాలను తెలుసుకోవాలనుకున్న ఋషులు పరబ్రహ్మాన్ని ఉద్దేశ్యించి తపస్సు చేశారు. శౌచము, పవిత్రత, తపన, సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ, భగవంతుని యందు ప్రీతి, ధృతి మొదలైన అనేక లక్షణములు కలిగినవారికి వేదమంత్రాల అర్దం బోధపడుతుంది. ఋషులు చేసిన తపస్సుకు అనుగుణంగా, వారికి పరమాత్మ వేదమంత్రాలను అర్దం చేసుకునే సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. శుద్ధజ్ఞానాన్ని ప్రసాదించారు. శుద్ధజ్ఞానమంటే పరిపూర్ణమైన జ్ఞానం. ఉదాహరణకు ఒక మనిషిని చూసి, అతని మానసిక స్థితి, జన్మవివరాలు, అతను మరణించే సమయం, గత జన్మలో చేసుకున్న కర్మ, అతని శరీరంలో ఏర్పడిన, ఏర్పడబోతున్న రోగాలు, అతని కుటుంబం, ఇష్టాయిష్టాలు మొత్తం తెలుసుకోగలగడం. ఒక వస్తువును చూసి, దాన్ని ఎలా తాయారు చేశారు, ఏ లోహం వాడారు, ఎంత పాళ్ళలో వాడారు, అది ఎంతకాలం ఉంటుంది మొదలైన విషయాలు చెప్పగలుగుతారు. ఇదంతా భౌతిక స్థాయిలో చెప్పుకున్న ఉదాహరణ. కానీ శుద్ధజ్ఞానం భౌతిక స్థాయిని దాటుతుంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం. ఆ శక్తితో ఋషులు వేదాలకు రాసిన తొలి అర్ధాల /భాష్యాల సమాహారమే బ్రాహ్మణాలు. మానావాళికి వేదమును అందించినవాడు, ఆ వేదములకు అర్దం కూడా బోధపడేలా అనుగ్రహించిన పరమేశ్వరుడే లోకానికి ఆది గురువు అని పతంజలి మహర్షి తన యోగదర్శనంలో పేర్కొన్నారు.

వేదాలను చాలా శుద్ధమైన రూపంలో, ఎటువంటి ఇతర ప్రభావాలకు లోనుకాకుండా అర్దం చేసుకున్న ఋషులు మానావాళికి అందించిన ఈ బ్రాహ్మణాలే వేదాలకు తొలి అర్ధాలు. వేదాన్ని పూర్తిగా, సరిగ్గా అర్దం చేసుకోవాలంటే అది బ్రాహ్మణాలతోనే సాధ్యమవుతుంది. బ్రహ్మం గురించి, బ్రహ్మం యొక్క వైభవం గురించి చెప్పేవి కనుక బ్రాహ్మణాలు అన్నారు. వైదిక ధర్మంలో ఉండే ముఖ్యమైన ప్రక్రియ యజ్ఞం. యజ్ఞం లేనేది ధర్మం లేదు. యజ్ఞయాగాలకు, అగ్ని ఆరాధానకు ధర్మంలో అంత గొప్ప స్థానం ఉంది. మనిషికి ఊపిరి ఎంత అవసరమో, వైదిక ధర్మానికి యజ్ఞం అంత అవసరం.అటువంటి వివిధ యజ్ఞాల గురించి, అవి ఆచరించే విధానం కూడా బ్రాహ్మణాలలోనే తెలుపబడింది.

To be continued ................

No comments:

Post a Comment