Sunday, 31 July 2016

హిందూ ధర్మం - 219 (జ్యోతిష్యం - 1)

జ్యోతిష్యం - ఇది  6 వ వేదాంగం. వేదానికి ఇది కన్ను వంటిది. జ్యోతిష్యం అనగా కాంతికి సంబంధించిన శాస్త్రం. ఖగోళ శాస్త్రం (Astronomy), ఫలిత జ్యోతిష్యం (Astrology), విద్యుత్-అయస్కాంత శాస్త్రం (Electro-Magnetism) మొదలైన ఎన్నో శాస్త్రాలు ఇందులో అంతర్భాగాలు. జ్యోతిష్యం అనగానే గ్రహాలు, దశలు, అంతర్దశలతో, వ్యక్తుల భవిష్యత్తును చెప్పే జ్యోతిష్యం అనుకుంటారు చాలామంది. అది ఫలిత జ్యోతిష్యం, కర్మ సిద్ధాంతానికి సంబంధించిన శాస్త్రం. వ్యక్తి జన్మించిన సమయాన్ని ఆధారంగా చేసుకుని, అతడు పూర్వ జన్మలో ఏ కర్మ చేయడం వలన ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తున్నాడో, తిరిగి ఎలాంటి దుష్కర్మలు చేయకుండా ఉండటం వలన, పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకోవడం వలన ఉన్నతిని పొందగలడో, ఆ జ్యోతిష్యం చెప్తుంది. వ్యక్తి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకునే వేసే రాశిచక్రంలోని గ్రహాలు అతడు చేసిన కర్మలకు సంకేతాలు. అవి అంతరిక్షంలో ఉన్న గ్రహాలు కావు. గత జన్మలో అతడు ఇతరులను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసి ఉంటే, ఈ జన్మలో చంద్రదోషం ఏర్పడి, పిచ్చివాడిగా మారిపోతాడు. కాస్త తక్కువ స్థాయిలో ఇతరులను మానసికంగా హింసించినవారు, భయపెట్టినవారు, ఈ జన్మలో మానసిక సమస్యలతో, క్షోభతో బాధపడతారు. ఇలా జన్మకుండలిలో ఒక్కో గ్రహం, అది ఉన్న స్థానాన్ని అనుసరించి, అతడి కర్మను తెలియజేస్తుంది. అందుకే దాని గురించి చెప్తూ 'కర్మఫల విపాక కాల విధానం' అని సంస్కృతంలో వివరించారు.

అది కాక గణిత జ్యోతిష్యం అని ఉంది. ఇది అంతరిక్షంలో ఉన్న గ్రహాల గురించి, వివిధ రకాలైన కాంతుల (rays) గురించి, ఉదాహరణకు - ఎక్స్‌రే (X rays), గామ కిరణాలు (gamma), అంతరిక్షం నుంచి వెలువడే విద్యుత్-అయస్కాంత్ తరంగాలు, వివిధ కిరణాలు, గ్రహణాలు, భ్రమణాలు, నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్ర మండలాలు (Galaxies), విశ్వ ఆవిర్భావం (cosmology)మొదలైన అనేక విషయాల గురించి వివరిస్తుంది. ఫలిత జ్యోతిష్యానికి దీనికి పరస్పర సంబంధం ఉన్నా, ఫలితజ్యోతిష్యమే ఇందులోని అంతర్భాగం.

ఈశ్వరుడిచ్చిన వేదానికి అనుగుణంగా ధర్మాన్ని నిర్వర్తించాలి. అందుకు దేశకాలాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. ధర్మం దేశకాలాలను అనుసరించి మారుతుంది. నిత్య కర్మలు ప్రతి రోజూ, నైమిత్తిక కర్మలను శాస్త్రం నిర్దేశించిన తిధులలోనే చేయాలి. ఉదాహరణకు అగ్నిహోత్రం నిత్యకర్మ. ఉదయ సంధ్యలో, సాయంసంధ్యలో నిర్వహించాలి. అది కూడా సరైన సమయంలో ఆహుతిస్తేనే ఫలితం ఉంటుంది. దానికి కాలగణన అవసరం. పంటలు వేయాలన్నా, ఎప్పుడు వేస్తే చక్కని వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా వస్తాయో తెలిసి ఉండాలి. అందుకోసం కూడా కాలవిజ్ఞానం అవసరం. అతిరాత్రం, గోమేధం మొదలైన యాగాలు చేయాలంటే ఋతువులు, గ్రహాల కదలికలను తెలుసుకొని ఉండాలి. అంతరిక్షానికి సంబంధించిన విజ్ఞానం అవసరం. అలాగే కాలంలో జరిగిన సంఘటనలను నమోదు చేయాలన్నా, దానికి కూడా కాలగణన ఉండి తీరాలి. ఇలాంటి అవసరాల కోసం అభివృద్ధి చేసిందే వేదాంగ జ్యోతిష్యం. అయితే మన ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి శాస్త్రము ఇతర శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఏ ఒక్కటీ ఇతర వాటి నుంచి దూరంగా, సంబంధం లేకుండా ఉండదు. ఒక శాస్త్రంలో చెప్పబడిన అంశానికి వివరణ, లేదా ఇంకొంత సమాచారం వెరొక శాస్త్రంలో ఉంటుంది. అలాగే జ్యోతిష్యానికి, కల్పం, శుల్బ సుత్రాలు, వ్యవసాయం మొదలైన అనేక శాస్త్రాలతో పరస్పరం సంబంధం కలిగి ఉండి, ఒక శాస్త్రం అభివృద్ధి చెందితే, అది మిగితావాటి అభివృద్ధికి తోడ్పడుతుంది.

ఇక్కడ ఇది కేవలం అంతరిక్షానికి సంబంధించిన గణన గురించే చెప్పదు. నిత్య జీవితంలో కాలాన్ని లెక్కించడం గురించి చెప్తుంది. అయితే కాలం ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ప్రతిమూల ఒకే సమయంలో ఒకే విధమైన సమయం ఉండదు, ఋతువు ఉండవు. రేఖాంశం (longitude) మరియు అక్షాంశాల (latitude) మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశకాలాలకు (Time and space) సంబంధించిన శాస్త్రాలు కూడా ఈ శాస్త్రంలో అంతర్భాగాలే.

To be continued .................

No comments:

Post a Comment