గత సెప్టెంబరు - అక్టోబరు సమయంలో భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండటం వలన తైలం రుద్ధి కాళ్ళోత్తేవారు సేవకులు. మిగితా చొరవ గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళొత్తడం ప్రారంభించి సమయాన్ని అతిక్రమించడం ఆరంభించారు.
సేవకులను కూడా 'రండీ, పోండీ,' అనే తప్ప 'రా,పో' అని పిలవడానే ఇష్టపడని భగవానులు ఇందుకు సహించగలరా? (భగవాన్ జంతువులు సహా ఎవరిని ఏకవచనంతో పిలవలేదు. అందరిని బహువచనంతోనే సంబోధించేవారు) ఖండించి, వద్దనడం వారి పనికాదు. అందువల్ల ఛలోక్తిగా "మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపీ కాళ్ళు వత్తుతాను. నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దూ?" అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరల్లోనైనా శ్రీవారి పాదాలు ముట్టుకుని నమస్కరిద్దామన్న కోరిక ఉంటే, దీంతో పుర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచం వారికి కావాలట! రవంత సూక్ష్మతకలవారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి.
ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జీ, పండు ముసలి, ప్రతాపరాయ దేసాయీ అనేవారు భగవానుని సమీపించి "స్వామీ! నాకు కూడా గురుపాద సేవలో భాగమివ్వాలి" అన్నారు. "ఓహో! సరిసరి. 'ఆత్మావై గురుః' అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. డెబ్బైయేళ్ళు దాటాయి. మీరా నాకు సేవ చేసేది. చాలు చాలు. ఇకనైన ఆత్మసేవ చేసుకోండి. పల్కకుండా ఊరికే ఉంటే అంతే చాలు' అన్నారు భగవాన్. సరిగా విచరిస్తే ఇంతకన్నా గొప్ప ఉపదేశం ఏముంది? పలకకుండా ఊరికే ఉంటే చాలట. అట్లా ఉండటం భగవానునికే సహజంగాని మనకు సాధ్యమా? ఎంత తపించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగిందేమి ఉన్నది?
సూరి నాగమ్మ - 28-11-1945
(శ్రీ రమణాశ్రమ లేఖలు, సూరి నాగమ్మ - 8 వ ఉత్తరం)
పల్కకుండా ఊరికే ఉండడమంటే ఆత్మ యందు దృష్టి నిలిపి, ప్రాపంచిక విషయాలను పట్టించుకోకపోవడం. ప్రాపంచిక విషయాల్లోకి మనసును పరుగెట్టనివ్వకుండా ఆత్మయందే దృష్టి నిలపమని రమణుల ఉపదేశం.
This comment has been removed by the author.
ReplyDelete