Saturday, 23 July 2016

‎కబాలి‬ - కపాలి - కపాలేశ్వర స్వామి

‎కబాలి‬ అనేది తమిళపదం. కపాలి అనే పదం నుంచి వచ్చింది. తమిళ భాషలో ప లేదు కనుక బ అని ఉపయోగించారు. కపాలి అంటే శివుడు. చెన్నైలోని మైలాపూర్ లో కపాలేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడి కోసం ఉమా దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి మైలాపూర్ అని పేరు వచ్చింది. ఈ స్థలపురాణం ఇదే దేవాలయంలో స్థల వృక్షమైన పున్నాగ చెట్టు కింద చిన్న కోవెలలో చెక్కబడి ఉంది. మయిల్ అంటే నమలి అని తమిళంలో అర్దం. ఈ క్షేత్రానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. ఇది పురాతన దేవాలయం, 7 వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారట. ఇక్కడ శివుడిని కపాలీశ్వరుడని, అమ్మవారిని కర్పగాంబళ్ అని పిలుస్తారు. ఇక్కడ నర్తనవినాయకుడు కొలువై ఉన్నాడు. నాయనార్లలో ముఖ్యులైన 7 వ శతాబ్దానికి చెందిన అప్పర్, జ్ఞానసంబంధర్‌లు ఈ ఆలయంలో వెలిసిన శివుడిని ఉద్దేశ్యించి కీర్తించారు. అలాగే ఇక్కడ శివుడిని బ్రహ్మదేవుడు పూజించాడని, ఆయనే లింగప్రతిష్ట చేశాడని, ఈ క్షేత్రానికి శుక్రపురి, వేదపురి అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.





సుందరమైన ఈ ఆలయం సందురతీరంలో ఉంది. సా.శ.1566 లో మైలాపూర్ పోర్చుగీస్ వారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత మళ్ళీ, ఇప్పుడున్న ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మిషనరీలు వివాదాస్పదం చేశాయి. ఈ ఆలయం మీద కొన్ని కుట్రలు చేసి, రాజకీయ మద్ధతుతో, అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసి, తమిళనాడులో ద్రవిడ క్రైస్తవాన్ని ప్రోత్సహించి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని రాజీవ్ మల్హోత్రా గారు, తాను రాసిన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు (Breaking India) అనే పుస్తకంలో వివరించారు.

రజనీకాంత్ ఆధ్యాత్మికమార్గంలో ఉన్న వ్యక్తి, సంస్కారవంతుడు, భక్తుడు కూడా. తెలుగునేల మీద చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనం వలన ఎంతోమందికి అరుణాచలం గురించి తెలిసింది. ఇప్పుడు తెలుగు ప్రాంతం నుంచి అరుణాచలం వెళుతున్న వారిలో సగం మంది చాగంటి వారి ప్రవచనం వినడం వల్లనే వెళ్తున్నారని అక్కడి ప్రజలు చెప్పారు. అలాగే తమిళ నాట రజనీకాంత్ వల్లనే చాలామంది అరుణాచలం మొదలైన శైవ క్షేత్రాలకు వెళుతున్నారట. మంచి పేరున్న నటుడైన రజనీకాంత్ తన సినిమా పేర్లకు అరుణాచలం, లింగ, బాబా మొదలైన పేర్లను కావాలనే ఎంచుకుని, ఆయా క్షేత్రాల, గురువుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువచ్చారని ఈ మధ్యే అక్కడున్నవారి ద్వారా తెలిసింది. ఇదిగో ఇప్పుడిలా మళ్ళీ కబాలి పేరుతో కపాలీశ్వర స్వామి గురించి తమిళ ప్రజలకు చాటి చెప్తున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిపించడం చాలా గొప్ప కదా.

గమనిక - నేనేమీ రజనీకాంత్ ఫ్యాన్‌ను కాదు. ఆ మాటకు వస్తే నేను సినిమాలు చూసి చాలా సంవత్సరాలయ్యింది. టివి చూసేది కూడా చాలా తక్కువ. ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పుకోవచ్చు, నాలుగు మంచిమాటలు పంచుకోవచ్చని చేస్తున్న ప్రయత్నమే ఇది.

హర హర మహాదేవ
జై కపాలీశ్వరా

8 comments:

  1. నిజమే,రజనీకాంత్ వ్యక్తిత్వంలో కూడా సూపర్ స్టార్!తొలినాళ్ళ నుంచీ ఆడవాళ్ళ ముందు సిగరెట్టు కాల్చకుండా ఉండటం,ప్రతి సినిమాలోనూ "దక్కనిది ఎప్పటికీ దక్కదు...","అప్పు ఇచ్చేవాడే కాదు,అడిగేవాడు కూడా దుష్టుడే!" అని ఏదో ఒక సూక్తిని క్యాచీగా చెప్పటం లాంటివి చేస్తూ ఉండేవాడు.మంచి సంస్కారం గలవాడు.

    ReplyDelete
  2. ఏమనుకోకండి కానీ "ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పుకోవచ్చు" మంచిదే కానీ మరీ మైలాపూర్ కపాలేశ్వరుడి గుడి దాన్ని గురించి ఎవరో ప్రజలకు చాటి చెప్పవలసిన స్ధితిలో లేదని నా అభిప్రాయం. అలాగే మద్రాసులోని ట్రిప్లికేన్ పార్ధసారధి గుడి, వడపళని సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి కూడా. అలాగే అరుణాచలం. ఇవి ఎవరి ప్రచారమూ అవసరం లేనంతగా ప్రసిద్ధి గాంచినవి. రజనీకాంత్ గారి సంస్కారం, వ్యక్తిత్వం, చేస్తున్న మంచి పనుల గురించి కాదండి నా ఈ వ్యాఖ్య. అన్యధా భావించకండి.

    ReplyDelete
  3. Eco Ganesh,

    Please watch below videos (e Acharya channel)

    https://www.youtube.com/watch?v=5cJ8yhAEq2o

    https://www.youtube.com/watch?v=aW41_S4RFiY

    https://www.youtube.com/watch?v=Gs2MTz90-a8

    ReplyDelete


  4. తమిళ భాష లో ప లేదు కనుక బ అని‌ ఉపయోగించారు :)

    పాపం మైలా పూర్ :)

    జిలేబి

    ReplyDelete
  5. జిలేబీ గారు, "ప" "బ" తేడా లేనిది తమిళ లిపిలోనే గాని, తమిళ భాషలో కాదేమో! వ్రాసేప్పుడు ఆ నాలుగు శబ్దాలకి (ప, ఫ, బ, భ) ఒకే అక్షరం వాడతారనుకుంటాను. చదివేప్పుడు / మాట్లాడేప్పుడు సందర్భానుసారంగా ఆ అక్షరానికి అక్కడ ఏ శబ్దం ఉండాలో అది పలకాలని విన్నాను. మీరన్నట్లు వాళ్ళకి "ప" శబ్దం లేకపోతే మైలాపూర్ అని, పోరూర్ అని, విల్లుపురం అని, చెంగల్పట్టు అని, పళని అని, పుదుచ్చేరి అని, పాండ్యన్ అని, పరమేశ్వరన్ అనీ ఎందుకు పలుకుతారు? అయినా మీకు తమిళ భాషలో రాతకోతలు కూడా వచ్చనుకుంటాను, కాబట్టి మీకే బాగా తెలుసుంటుందిలెండి. 🙂

    ReplyDelete
    Replies


    1. విన్నకోట వారు కూడా జిలేబీ లా కామింటు మాత్రమే చదివి కామింటు కొట్టే వారిలా ఉన్నారు :) జెకె :)

      జిలేబి

      Delete
  6. Touché జిలేబీ గారు. 😀😀
    మీరు మొదటన్న వాక్యం పోస్ట్‌లో ఉన్నదేనని పోస్ట్ మరోసారి చూసి ఇప్పుడే గ్రహించాను 🙂. ఎలా మిస్సయ్యానో 🙁.? అయినా నా వ్యాఖ్య వల్ల తమిళ లిపి కాస్త పొదుపైనదని తెలుస్తుందిలెండి. 🙂.

    ReplyDelete
    Replies


    1. తమిళ లిపి పొదుపును పొగిడె
      సుమధురముగ పలుక లేరు సుందరమును గా
      దు! మిడిమిడి యక్షరములున్!
      కమనీయంబెట్లగునుర కౌపీన లిపీ :)

      జిలేబి

      Delete