తిధుల ప్రాముఖ్యత గురించి గత భాగంలో వివరించుకున్నాం. ఇప్పుడా తిధులకు, ఆయా సమయంలో ఆచరించే నైమిత్తికాలకు మధ్య శాస్త్రీయ సంబంధం చూద్దాం. ఒక్కో తిధి రోజు ఏకభుక్తం చేయాలని, ఫలానా తిధి నాడు ఉపవసించాలని మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఏకాదశినే తీసుకోండి. చంద్రుని గమనంలో, పూర్ణిమ నుంచి అమావాస్యకు, అమవాస్య నుంచి పూర్ణిమకు మధ్యలో 11 వ తిధి ఏకాదశి. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా ఉపవసించడం అందరికి తెలిసిందే.
ఆధునిక సైన్స్ ప్రకారం వాయు పీడనం (air pressure) అమావాస్య, పూర్ణిమల్లో తీవ్ర పరిమితుల్లో ఉంటుంది. దీనికి కారణం సూర్య, చంద్ర, భూ కక్ష్యల స్థానాలే. దీన్ని ప్రకృతిలో సముద్రం వద్ద గమనించవచ్చు. ఆ రెండు రోజుల్లో ఉధృతంగా ఉండే కెరటాలు, తర్వాత రోజు నుంచి మాములుగా ఉంటాయి. పీడినం తగ్గిందనడానికి సూచకంగా.
సైన్సు ప్రకారం, మనం తిన్న ఆహారం మెదడును చేరడానికి 3-4 రోజులు పడుతుంది. మనం ఏకాదశి రోజు ఉపవసించినా, అల్పాహారం తీసుకున్నా, ఆ ఆహారం అమవాస్య, పూర్ణిమ తిధులకు మెదడుకు చేరుతుంది. ఈ రెండు రోజుల్లో, భూమి పీడనం (pressure) అధిక స్థాయిలో ఉంటుంది, దాని కారణంగా అన్నిటి యందు సమతుల్యత లోపిస్తుంది, మానవుల ఆలోచనా విధానంలో కూడా. మెడదకు పంపే ఆహారం కూడా చాలా తక్కువ ఉంటే, అధిక పీడనం కారణంగా మెడదు దారి తప్పి ప్రవర్తించే అవకాశం కూడా తగ్గిపోతుంది.
అలాగే చంద్రగతిలో వాతవరణ పీడనం ఏకాదశి తిధిన అత్యల్పంగా ఉంటుంది మిగితా తిధులతో పోల్చితే. అందువల్ల ఇది ఉపవసించి, ప్రేగులను శుభ్రం చేసుకోవటానికి చాలా మంచి సమయం. అదే ఆ తర్వాత రోజున పీడనం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. కనుక ద్వాదశి రోజు ఉదయమే, సుర్యోదయం కాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారణ(భోజనం) చేసి ఉపవాస వ్రతాన్ని ముగించమని శాస్త్రం చెప్పింది. లేకుంటే కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని. ఇలా ప్రతి శుక్ల పక్ష, కృష్ణ పక్ష ఏకాదశులకు ఉపవాసం చేయడం మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇందులో ఎంతో శాస్త్రీయత కూడా ఉంది. చూడండి తిధులు, ఆ రోజు వాతావరణంలో ఏర్పడే మార్పులు, అవి శరీరం మీద చూపే ప్రభావాలను ఎంత చక్కగా గుర్తించో మన సనాతన ధర్మం. అలానే మన సంప్రదాయంలో ఎన్నో పండుగలకు, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ ఒక విషయంలోనే ఖగోళ, వాతావరణ, వైద్య, ఆధ్యాత్మిక శాస్త్రాల సమన్వయం, పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. శాస్త్రంలో ఒక చోట ఒక మాట చెబితే, దాని వివరణ వేరే శాస్త్రంలో ఉంటుంది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం వేరు కాదు. అన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఆ సమన్వయం సనాతనం, అదే భారతీయం.
మనమొక విషయం గమనించాలి. ఏకాదశి రోజు ఉపవసించాలని చెప్పిన శాస్త్రమే కొందరికి మినహాయింపు ఇచ్చింది. బ్రహ్మచారులు, రోగులు లేదా ఔషధ సేవనం చేసేవారు, ముసలివారు, కాయకష్టం చేసేవారు, నిత్యం చెమట చిందించి పని చేసే రైతులు, కూలీలు ..... వీళ్ళు ఉపవాసాలు చేయవలసిన పనిలేదు. వారికి చేయకపోయిన దోషం ఉండదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా శాఖాహారులైతే, తరుచుగా ఉపవసించకూడదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం తినే బియ్యంలో బలం లేదు, పాలు కల్తీ, కూరలకు ఎరువులు వేసి పండిస్తున్నారు, పర్యావరణం అంతా కలుషితమైపోయింది. ఉపవాసం చేయమని చెప్పిన శాస్త్రమే బలమైన ఆహారం కూడా స్వీకరించమని చెప్పింది. ఏమి తినాలో, ఎలా పండించినవి, ఎలా వండుకుని తినాలో కూడా చెప్పింది. అవేమీ చేయకుండా తరుచూ ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.
To be continued ...................