Monday, 3 October 2016

చంద్రఘంటా దేవి అమ్మవారి వైశిష్ట్యం

దేవీ చంద్రఘంటేతి

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||



దుర్గామాత యొక్క తృతీయ శక్తి చంద్రఘంటా దేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రి ఉపాసనలో మూడవ నాడు ఈమెను ఆరాధిస్తారు. ఈమె రూపం పరశాంతిదాయకమై కల్యాణపర్వమైనది. ఈమె మస్తకంపై ఘటాకారంలో అర్థచంద్రుడున్నాడు. ఈ కారణం వల్లనే ఆమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. స్వర్ణసమంగా ఆమె శరీరం భాసిల్లుతూ ఉంటుంది. ఈమెకు గల దశ హస్తాలలో ఖడ్గాది శస్త్రాలు, బాణాది అస్త్రాలు రాజిల్లుతూ ఉంటాయి.

సింహవాహిని అయిన ఈమె ముద్ర సర్వదా యుద్ధోన్ముఖమై ఉంటుంది. ఘంటా సదృశ్యమైన ఆమె చండ ధ్వనులకు అత్యాచారులైన దైత్వ దానవులు కంపించిపోతుంటారు. నవరాత్రులలో దుర్గాదేవి ఉపాసనలతో మూడర నాడు జరిగే పూజ అత్యంత మహత్వపూర్ణంగా ఉంటుంది. నాడు సాధకునికి మనస్సు మణిపూర్వ చక్రంలో ప్రతిష్టితమై ఉంటుంది. చంద్రఘంటా దేవి కరుణ వల్ల సాధకునకు అలౌకిక వస్తువుల దర్శనమవుతుంది. దివ్య సుగంధానుభవం కలుగుతుంది. వివిధ ప్రకార ధ్వనులు వినిపిస్తాయి. సాధకుడు అత్యంత సావధానంగా ఉండవలసిన క్షణాలవి. చంద్రఘంటా దేవి కృప వల్ల సాధకుడి పాపతాపాలన్నీ నశించిపోతాయి. ఆమె ఆరాధాన సర్వ ఫలదాయకమైనది. సర్వదా ఈమె యుద్ధోన్ముఖ ముద్రతో ఉంటుంది కనుక భక్తుల కష్టాలను అత్యంత శ్రీఘ్రంగా నివారిస్తుంది.

వాహనం సింహం కావడం వల్ల ఈమెను ఉపాసించే వారు కూడా సింహం కావడం వల్ల ఉపాసించే వారు పరాక్రమంతో నిర్భయంగా ఉంటారు. భక్తులను ప్రేతబాధాదుల నుంచి సంరక్షిస్తూ ఉంటుంది. దుష్టదమన వినాశనాంతరం కూడా సర్వదా ఆమె స్వరూపం దర్శకులకు, ఆరాధకులకు అత్యంత సౌమ్యంగా, శాంతంగా ఉంటుంది. ఆరాధన మంత్రంచే సాధకునకు లభించే వీరత్వ నిర్భయత్వాలతో బాటు సౌమ్యత్వ వినమ్రత్వాలు కూడా లభించడం విశేష సద్గుణమే కదా.

సాధకుని ముఖనేత్రాది శరీరాంగాలన్నీ చంద్రఘంటా దేవి కరుణ వల్ల తేజరిల్లుతుంటాయి. వారి స్వరంలో దివ్య అలౌకిక మాధుర్యం గోచరమవుతుంటుంది. దేవి భక్తులు కానీ, ఉపసాకులు కానీ ఎక్కడకు వెళ్ళినా వారిని చూసిన ప్రజలు సుఖశాంతులను పొందుతుంటారు. అట్టి సాధకుల శరీరాల నుండి దివ్యప్రకాశయుక్త పరమాణువుల అదృశ్య వికరణం జరుగుతుంటుంది. అది చర్మచక్షువులకు మాత్రం గోచరించదు. సాధకులు, వారి సాంగత్యంలో ఉండేవారు మాత్రం ఆ విషయాలను చక్కగా అనుభవించగలుగుతారు. మనం మన మనోవాక్కర్మ శరీరాలను విహితవిధి విధానుసారం పరిపూర్ణంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని దేవిని శరణు వేడి తమ ఉపాసనలో లగ్నమవ్వాలి.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

No comments:

Post a Comment