Sunday, 2 October 2016

బ్రహ్మచారిణి అమ్మవారి వైశిష్ట్యం

బ్రహ్మచారిణి అమ్మవారి వైశిష్ట్యం

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


దుర్గాదేవి యొక్క నవశక్తులలో ద్వితీయ స్వరూపం బ్రహ్మచారిణిది. ఇక్కడ బ్రహ్మశబ్దార్థం తపస్సుగా వస్తుంది. బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి. తపస్సుగా ఆచరించునది అని అర్థం. వేదసైత్యం తపో బ్రహ్మ. వేదం తత్వం తపస్సు బ్రహ్మ శబ్దార్థాలే బ్రహ్మచారిణి స్వరూపం. పూర్వ జ్యోతిర్మయమై అత్యంత భవ్యమైనది. ఆమె దక్షిణ హస్తంలో జపమాల, వామహస్తంలో కమలం ఉంటాయి. తన పూర్వజన్మలో ఈమె హిమవంతుని సదనంలో పుత్రిక రూపంలో ప్రభవించిన వేళలో నారద దేవర్షి ఉపదేశానుసారం శంకర భగవానుడిని భర్తగా పొందేందుకు అత్యంత కఠిన తపస్సు చేసింది. ఈ కఠిన తపస్సు కారణంగానే ఈమెను తపశ్చారిని అంటే బ్రహ్మచారిణి నామంతో జనులు వ్యవహరించే వారు. వేయి సంవత్సరాల కాలం ఈమె కేవలం ఫలమూలాలు మాత్రం గ్రహించి గడిపివేసింది.

శత సంవత్సర కాల పర్యంతం కేవలం శాకంపై జీవించింది. కొంతకాలం కఠినోపవాసం చేసి ఆకాశం కింద ఎండావానలను లెక్కచేయకుండా భయంకర కష్టాలను సహించింది. ఆ కఠిన తపస్సు తరువాత మూడు వేల సంవత్సరాలు రాలిన ఆకులను మాత్రం తిని అహర్నిశలూ శంకర భగవానుడి ఆరాధన చేసింది. ఆ తరువాత ఆమె ఎండుటాకులను కూడా తినడం మానివేసింది. పర్ణాలను కూడా విడనాడడం వల్ల అపర్ణ నామంతో ఆమె ఖ్యాతి గడించింది. వేల సంవత్సరాల కఠిన తపస్సు కారణంగా బ్రహ్మచారిణి దేవి శరీరం క్షీణించిపోయింది. తీవ్రతరంగా ఆమె కాయం కృశించింది. అట్టి ఆమె దశను తిలకించిన ఆమె తల్లి మీనాదేవి తీవ్రంగా వేదన చెందసాగింది. ఆమె తన పుత్రికను ఆ తపస్సు నుంచి విరమింపజేయాలని ఉమా, అరే వద్దు, వద్దు అని పిలిచింది.

నాటి నుంచి బ్రహ్మచారిణి దేవి యొక్క పూర్వజన్మ నామంగా ఉమ ఏర్పడింది. ఆమె తపస్సుకు జనత్రయంలో హాహాకారాలు చెలరేగాయి. దేవతలు, రుషులు, సిద్ధులు, మునులు అందరికందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క ఆ తపశ్చర్యను పుణ్యకృత్యంగా వర్ణిస్తూ ప్రశంసించసాగారు. చిట్ట చివరకు బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఆమెను సంబోధిస్తూ ప్రసన్న స్వరంతో ‘ ఓ దేవీ! ఇంతవరకూ ఎవరూ ఇట్టి కఠోర తపస్సు చేయలేదు. ఇట్టి తపస్సు నీకు మాత్రమే తగినది. ఈ లౌకిక కృత్యాన్ని సర్వులూ దశదిశలా కొనియాడుతున్నారు.

నీ కోరిక పరిపూర్ణమగుగాక. చంద్రమౌళీశ్వరుడు పతి రూపంలో నీకు లభించును గాక. తపస్సు మాని స్వగృహానికి వెళ్ళు. నీ తండ్రి నిన్ను పిలవ శీఘ్రంగా వస్తున్నాడు’ అని పలికాడు. దుర్గామాత యొక్క ఈ ద్వితీయ స్వరూపం భక్తులకూ సిద్ధులకూ అనంత ఫలాలను ప్రసాదించునట్టినది, ఈమె ఉపాసన వల్ల మానవులతో తపస్త్యాగవైరాగ్య సదాచారాలు వర్ధిల్లుతాయి. జీవితంలోని కఠిన సంఘర్షణ వేళల్లో సాధకుడి మనస్సు విచలితం కాదు. బ్రహ్మచారిణి దేవి కృప వల్ల సాధనకు సర్వే సర్వత్రా సిద్ధి విజయాలు లభిస్తాయి. దుర్గా పూజలో రెండవనాడు ఈమె ఉపాసనయే చేయబడుతుంది. ఈ రోజున సాధకుడి మనస్సు స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఆ చక్రంలో స్థిరంగా ఉండునట్టి మనస్సు కల యోగి ఆ తల్లి భక్తిని పొంది కృపకు విశేషపాత్రుడవుతాడు.

Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

No comments:

Post a Comment