Sunday, 11 December 2016

హిందూ ధర్మం - 232 (జ్యోతిష్యం - 14)



మరి మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా? వారు ఇక్కడి నుంచి తీసుకున్నారా? కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచమంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉంది. మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా విలసిల్లింది. ఈ విషయం మీద మనం ఇదే శీర్షికన ప్రరురిచిన అనేక భాగాల్లో దానికి ఆధారాలు కూడా చూశాము. ఈ గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరుపడ్డవే. మహాభారత యుద్ధం తర్వాత యుగాంతం యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. సరస్వతీ నది ఎండిపోయింది, అప్పుడు కొంతమంది ఈ భరతఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్ళారు. కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు. కొందరు ఇంగ్లాండ్, గ్రీకు దేశాల దిశగా మళ్ళారు. ఇంతకముందు యుగాల మాదిరిగా ఋషులు దేశపర్యటనలు చేసి ధర్మప్రచారం చేయలేదు, ఈ యుగప్రభావంగా. అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతనధర్మ మూల సూత్రాలకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి. వారికి మనలా అగ్నిహోత్రం, యజ్ఞ ప్రక్రియ ఉంది. మంట రగిల్చి, దానిలో ఆకులు, కట్టెపుల్లలు వేస్తూ, హా!హా! అంటూ అరుస్తారు. వేదంలో చెప్పబడ్డ స్వాహా కారం కాలక్రమంలో అక్కడ అలామారింది, మూలగ్రంధాలతో సంబంధం తెగిపోయి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేందుకు, గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది. క్రీ.పూ. 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు, కోటా వేంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రిక ఆధారాల పరంగా, అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా.  

అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా వెళ్ళు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు, నీ పనైపోతుంది అంటాడు. అయినా వినకుండా భారతదేశం మీదకు వస్తాడు, అది తెలుసుకున్న అరిస్టాటిల్, నువ్వెలాగో నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు, కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పటు 5 వస్తువులు తీసుకురా!ఒకటి భారతదేశం మట్టి. ఎందరో ఋషులు, గురువులు, మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది. అక్కడ అనేకమంది ఆ మట్టిపై తిరిగారు. దాన్ని నీవు తీసుకువస్తే, నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను. అలగే గంగాజలం తీసుకురా. అది ఎప్పటికి పాడవ్వనిది, పవిత్రమైనది. మూడవది భగవద్గీత, నాలుగు భాగవతం తిసుకురా, ఐదవది, ముఖ్యమైనది, అక్కడి నుంచి ఒక గురువును తీసుకొనిరా. ఆయన్ను నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు. అలెగ్జాండర్ మనదేశం మీద యుద్ధానికి రావడం, ఓడిపోవడం, ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి, వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా, అతని శాపానికి గురై, ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే రోగం వచ్చి మరణించాడు గ్రీకువీరుడు. అలా అలెగ్జాండర్‌తో వెళ్ళిన బ్రాహ్మణ పండితులు గ్రీకువారికి జ్ఞానోదయం చేశారు. అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంధాలను తీసుకువెళ్ళాడు. అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసింది.

ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గుర్ని మూల పురుషులుగా చెప్తుంది, ఒకరు సోక్రటిస్, రెండు ప్లాటో, మూడు అరిస్టాటిల్.   వాళ్ళే కాదు, మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అవుతున్న కుహనా మేధావులు, నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. మిగిలింది సోక్రటీసు, ప్లాటో. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి 'యూసేబియస్'లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. సోక్రటీస్ ఆ హిందూ మునిని అఘోర లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు. ఆ హిందూముని సోక్రటీస్ ను నీవేమీ చేస్తున్నావని, నీ తత్త్వం విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. దానికి సోక్రటీస్ మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు, కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య విషయాలను ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు.

మనకు అర్దమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీసు 'నేను మనిషిని అర్దం చేసుకోవడం కొరకు మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను' అంటాడు. అప్పుడా హిందూముని గట్టిగా నవ్వి, భగవంతుని/ ఆత్మను అర్దం చేసుకోకుండా మనిషిని ఎలా అర్దం చేసుకుంటారని అంటాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం: 'మనిషి, నువ్వు స్వయంగా తెలుసుకో' (Man, Know thyself). హిందువు అనేది 'మనిషీ, నీ ఆత్మను తెలుసుకో' (Man, Know thy Self) అని. నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను (I think, therefore I exist) అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది. అది డెకార్ట్ (Descartes) అన్న వాక్యం. కానీ అది తాత్త్వికంగా చెల్లదు. భారతీయుడంటాడు నేను ఉన్నాను, కనుక నేను ఆలోచిస్తున్నాను (I Exist, therefore I think). ఎందుకంటే తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమ సత్యాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలను అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు, దేవుడిని అన్వేషించేవాడే 'విద్య'ను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం (Absolute Truth). తక్కినదంతా అవిద్య. అంటే సాపేక్ష జ్ఞానం (Relative Knowledge).

To be continued .................

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete