Friday, 9 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 5



చిన్నప్పుడు మేము మట్టిలోనే ఆడుకునేవాళ్ళము. ఎంతగా ఆడుకునేవాళ్ళమంటే ఒళ్ళంతా చెమటలు పట్టేలా. అయితే కొంచం పెద్దయాక స్కూల్ లో మాకు చెప్పారు, మట్టిలో క్రిములు ఉంటాయి, మట్టికి దూరంగా ఉండాలి, మట్టి ముట్టుకుంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని. నిజానికి అలా పుస్తకాల్లో ఉంది, అదే టీచర్లు చెప్పారు. అప్పటి నుంచి మట్టికి దూరమయ్యాము అనారోగ్యం వస్తుందన్న భయంతో. చాలా ఏళ్ళ తర్వాత ఇలానే యూ ట్యూబ్ లో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రవచనం ఒకటి విన్నాను. అందులో ఆయన ఆయుర్వేదం గురించి చెప్తూ ఇలా అన్నారు. ఇప్పుడు మనకు అనేక ఆనారోగ్య సమస్యలు రావడానికి కారణం మనం పంచభూతాలకు దూరమవ్వడమే, ఎందుకంటే ఈ శరీరం, మనస్సు పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి. ఈ శరీరం పంచభూతాలే తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే శరీరం, మనస్సు వాటికి దూరంగా జరుగుతాయో, అప్పుడే మానసిక, శారీరిక అనారోగ్యం ఏర్పడుతుంది. మా ఆశ్రమంలో ఉన్న వైద్యశాలకు నిత్యం అనేకమంది రోగులు వస్తూ ఉంటారు. వారికి మేము కేవలం ఔషధాలే ఇవ్వము, అంతకంటే ముందు మట్టిలో పని చేయమంటాము, మొక్కలకు పాదులు తీసి, నీళ్ళు పెట్టమంటాము, మట్టి ఎత్తమంటాము. కొందరికైతే ఔహధాలు అసలే ఇవ్వము, కేవలం ఇవి మాత్రమే ఆచరించమని చెప్తాము. అలా కొద్దిరోజులు వారికి ఆచరించడంతోనే వారి రోగాలను నయమై, వారు ఇంటి ముఖం పడతారు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అనేక అనారోగ్య సమస్యలకు కారణం మనం ప్రకృతికి, పంచభూతాలకు దూరంగా జరగడమే.

ఇది విన్న తర్వాత నాకర్దమయ్యింది మనమేమి కోల్పోతున్నామో. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మట్టిలో చెప్పులేకుండా నిల్చోవాల్సి వచ్చింది. ఆ సమయానికి నాలో పైత్య దోషం ప్రకోపించి, వేడి పెరిగింది. ధ్యానం మొదలైన ప్రక్రియలు చేయడం వలన శరీరంలో జరిగే చాలా సూక్ష్మ చర్యలను కూడా గమనించే శక్తి కలుగుతుంది, ఏకాగ్రత వలన. అది ధ్యానం చేసే చాలామందికి తెలిసిన విషయం. అప్పుడు గమనించాను, మట్టి నా శరీరంలో ఉన్న వేడిని తనలోకి లాగేస్తోందని. కాసేపు నిల్చుంటేనే శరీరంలో ఉన్న అధికవేడిని మట్టి/ భూమి లాగేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు చేసి చూశాను, పైత్యం ప్రకోపించిన ప్రతిసారీ ఇదే చేశాను. మళ్ళీ మళ్ళీ నాకు నేను ఋజువు చేసుకున్నాను. అప్పుడర్దమైంది మట్టికి ఉన్న శక్తి. ఇలా నాకే కాదు, ఇంతకముందు ఆయుర్వేదం గురించి చెప్పిన అనీల్ కిషన్ కి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి.

చాలామంది అంటారు, మట్టిలో నడిస్తే కాళ్ళు పగులుతాయని. కానీ అది పెద్ద అపోహ. కాళ్ళు పగిలేది మట్టిలో నడిస్తే కాదు, దుమ్ములో నడిస్తే. మట్టికి, దుమ్ముకు చాలా తేడా ఉంది. మట్టికి ఎంతో హీలంగ్ పవర్ ఉంది. సారవంతమైన మట్టిలో నడిస్తే, కాళ్ళ పగుళ్ళు కూడా వేగంగా, ఏ మందు రాయకుండానే మానిపోతాయి. చాలామంది ఉదయం వ్యహాళికని వెళతారు, వెళ్ళడం మంచిదే కానీ, వేలకు వేలు పెట్టి దాని కోసం ప్రత్యేక బూట్లు కొని, అవి వేసుకుని వెళతారు. అప్పుడేమీ లాభం లేదు. ఏదైనా చేయాలనుకుంటే గాజుముక్కలు లాంటివి లేని చోట, మట్టిలో ఒట్టి కాళ్ళతో నడిచి చూడండి, ఎంతో మార్పు కనిపిస్తుంది, శరీరం తనంతట తానే రోగాలను నయం (Healing) చేసుకుంటుంది. అది మట్టికి ఉన్న శక్తి. కానీ మట్టి సారవంతమై ఉండాలి, పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. మనం మరమనుషులుగా కాక, మట్టి మనుషులుగా బ్రతకాలి.

To be continued ..........

No comments:

Post a Comment