Thursday, 28 November 2019

స్వామి శివానంద విచరితం- అభిషేకం యొక్క ఆంతర్యము మరియు తత్త్వము


పార్వతి లేదా ఉమా ప్రియుడు, పశుపతి అయిన, ఆనందకరమైన పరమ శివునకు నమస్కారములు మరియు ప్రణిపాతములు.

అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియః శివః - విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. శివాలయాల్లో శివలింగం మీద చిన్న రంధ్రం కలిగిన ఒక రాగి కంచు పాత్రను వ్రేలాడదీసి, దాని నుండి దాని గురించి రేయింబవళ్ళు స్వామివారి మీద నీరు పడేటట్లు ఏర్పాటు చేస్తారు. శివలింగం మీద నీరు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పంచామృతాలు మొదలైనవి పోయడాన్ని అభిషేకం అంటారు. శివునకు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే సమయంలో రుద్రం పఠిస్తారు. అభిషేకం ద్వారా పరమశివుడిని పూజిస్తారు.

సముద్రంలో నుంచి ఉద్భవించిన హాలాహలం అనే విషాన్ని పరమశివుడు త్రాగి, చల్లదనం కొరకు తన శిరస్సును గంగను మరియు చంద్రుడిని ధరించాడు. ఆయనకు భీకరమైన మూడవ నేత్రం ఉంది. నిరంతరం అభిషేకం చేయుటవలన ఈ మూడవ కన్ను చల్లబడుతుంది.

హృదయకమలంలో ఉన్న ఆత్మలింగం మీద శుద్ధమైన ప్రేమ అనే నీటిని పోయుటయే ఉత్కృష్టమైన మరియు మహోన్నతమైన అభిషేకము. బాహ్యంలో రకరకాల వస్తువులతో చేసే అభిషేకము భక్తిని వృద్ధి చేసి శివుని పట్ల ప్రేమను పెంచి, క్రమంగా మనలో ఉన్న శివునకు (ఆంతర్యంలో) పుష్కలమైన నిరంతరం ప్రవహించే ప్రేమతో అభిషేకము చేసే దిశగా తీసుకువెళుతుంది.

అభిషేకము శివపూజలో భాగము. అభిషేకం అనేది లేకపోతే శివపూజ పూర్తికాదు. అభిషేక సమయంలో రుద్రము, పురుషూసూక్తము, చమకము, మహా-మృతంజయ జపము మొదలైనవి ఒక ప్రత్యేక లయ మరియు క్రమంలో పఠిస్తారు. సోమవారం శివారాధనకు అత్యంత ముఖ్యమైనది మరియు ప్రతి పక్షంలోను వచ్చే త్రయోదశి తిథి. ఈ రోజుల్లో, శివభక్తులు ప్రత్యేక పూజతో, ఏకాదశరుద్రాభిషేకంతో అర్చన చేసి, అనేక రకములైన ప్రసాదాలను సమర్పించి, దీపాలను వెలిగించి, శివారాధన చేస్తారు.

ఏకాదశ రుద్రాభిషేకంలో ప్రతి రుద్రానికి అభిషేకంలో ప్రత్యేకమైన వస్తువులను వినియోగిస్తారు. గంగాజలము, పాలు, నెయ్యి, తేనె, సుగంధ జలము, కొబ్బరినీళ్లు, గంధము, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన తైలము, చెరుకు రసం మరియు నిమ్మరసం అనేవి అభిషేకానికి ఉపయోగిస్తారు. ప్రతి ద్రవ్యాన్ని అభిషేకించిన తరవాత, శివుని తలమీద శుద్ధ జలాన్ని పోస్తారు. రుద్రాన్ని చదివినప్పుడు ప్రతిసారీ, ప్రతి అధ్యాయం తర్వాత వివిధ పదార్థాలను అభిషేకంలో వినియోగిస్తారు. ఆ అభిషేక జలము లేదా ద్రవ్యము అనేది అత్యంత పవిత్రంగా భగవంతుని ప్రసాదంగా భావించి స్వీకరించే భక్తులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అది హృదయాన్ని పవిత్రం చేసి అసంఖ్యాకమైన పాపాలను నశింపచేస్తుంది. మీరు దాన్ని భావము మరియు భక్తితో స్వీకరించాలి.

మీరు భావము మరియు భక్తి తో అభిషేకము ఒనరిస్తే, మీ మనసు ఏకాగ్రతమవుతుంది. మీ హృదయంలో భగవంతుని మూర్తి స్థిరంగా ఉండి, మనసంతా దివ్యమైన ఆలోచనలే ఉంటాయి. మీరు మీ శరీరాన్ని, దానితో సంబంధాన్ని మరియు మీ చుట్టుపక్కల ఉండే విషయాలను మరచిపోతారు. అహంకారం క్రమంగా నిర్మూలించబడుతుంది. ఎప్పుడైతే వీటిని మరచిపోవడం అనేవి ఉంటుందో అప్పుడు మీరు పరమ శివుని యొక్క పరమానందాన్ని రుచి చూసి అనుభవిస్తారు. రుద్రం లేదా ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన మనస్సు శుద్ధి పొంది సత్వముతో నిండిపోతుంది.

రోగంతో బాధపడుతున్న వ్యక్తి పేరున మీరు రుద్ర పాఠం చదివి అభిషేకం చేస్తే అతి త్వరగా అనారోగ్యం నుంచి విముక్తుడు అవుతాడు. అభిషేకం వలన ఔషధానికి లొంగని వ్యాధులు సైతం నయమవుతాయి. అభిషేకము ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, పుత్రపౌత్రాభివృద్ధి మొదలైనవి ఇస్తుంది. సోమవారము చేసే అభిషేకం అత్యంత శుభకరము.

పంచామృతాలు, తేనె, పాలు మొదలైనవి భగవంతునకు అర్పించడం చేత దేహాత్మ భావన (శరీరమే నేను అనుకునే భావన) నశిస్తుంది. స్వార్థం అనేది నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతుంది. నీవు అపరిమితమైన ఆనందాన్ని పొందుతావు. భగవంతునికి అధికముగా అర్పించుకోవడం మొదలు పెడతావు. కనుక ఆత్మ సమర్పణ/ఆత్మ నివేదన మరియు సర్వస్య శరణాగతి అనేవి వస్తాయి. 'నేను భగవంతునకు చెందిన వాడను. అందరూ భగవంతునికి చెందినవారే. అంతటా ఆ భగవంతుడే ఉన్నాడు' అనే భావన నీ హృదయము నుండి సహజంగానే ఉబికి వస్తుంది.

కన్నప్ప నాయనారు శివునకు గొప్ప భక్తుడు, వృత్తిరీత్యా వేటగాడు, దక్షిణ భారతదేశంలోని శ్రీకాళహస్తిలో ఉన్న లింగం మీద తన నోటిలో పోసుకుని తీసుకువచ్చిన నీటిని పోసి అభిషేకము చేసి శివుడిని ఆరాధించేవాడు. అతని యొక్క శుద్ధమైన భక్తిని చూసి శివుడు మెప్పు పొందాడు. మానసిక భావమే ముఖ్యమైనది కానీ బాహ్యమైన ఆడంబరము కాదు. పరమశివుడు ఆలయ పూజారికి ఇలా చెప్పారు - "నా ప్రియ భక్తుడైన కన్నప్ప నోటిలోని నీరు గంగాజలం కంటే మరింత పవిత్రంగా, నిర్మలంగా ఉన్నాయి".

భక్తుడు శివునకు అభిషేకాన్ని క్రమం తప్పకుండా చేయాలి. అతడు హృదయపూర్వకంగా రుద్ర నమక చమకాలు నేర్చుకోవాలి. ఏకాదశ రుద్రాభిషేకం అనేది అత్యంత శక్తివంతము మరియు ప్రభావవంతమైనది. ఉత్తర భారతదేశంలో ప్రతి పురుషుడు మైర్యు స్త్రీ, ఒక చిన్న పాత్రతో నీటిని తీసుకువెళ్లి శివలింగం మీద పోస్తారు. ఇది కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగించి, కోరికలను సఫలీకృతం చేస్తుంది. శివరాత్రి నాడు చేసే అభిషేకం ఎంతో ప్రభావవంతమైనది.

శివుని యొక్క వైభవాన్ని మరియు ఆయన చరాచర జగత్తులో సర్వ జీవులందు వ్యక్తమైన విధానాన్ని ప్రకటించే మీరందరూ చదువుదురుగాక. మీరంతా ప్రతిరోజూ అభిషేకం చేసి శివానుగ్రహం పొందుదురుగాక. మీ అందరిని విశ్వనాథుడు ఆశీర్వదించుగాక.

శివాలయంలో అభిషేకం మరియు రుద్ర జపం చేయుటవలన కలుగు ఫలము

చమకమ్ అనేది 11 అధ్యాయాలుగా విభజించబడింది. అందులోని ప్రతి అధ్యాయాన్ని నమకంతో కలిపి చదువుతారు. దీన్నే అంటారు రుద్రం అంటారు. అలాంటి 11 రుద్రాలు కలిపితే ఒక లఘు రుద్రం. 11 లఘు రుద్రాలు ఒక మహా రుద్రము. 11 మహా రుద్రాలు ఒక అతిరుద్రం.

సంకల్పము, పూజ, న్యాసము, అంగపూజ, పంచామృతస్నానం మరియు ధ్యానం తరవాత రుద్రాన్ని చదువుతారు. రుద్రపఠనం వలన కలుగు ఫలములు ఈ విధముగా ఉంటాయి. 

1 రుద్రము పిల్లలకు కలిగే రోగాలు - బాలారిష్టాలు నుంచి విముక్తి 
3 రుద్రాలు - వ్యక్తి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ఆపదల నుంచి విముక్తి 
5 రుద్రాలు - జాతకంలో లో దుఃస్థానాలలో ఉన్న గ్రహాల యొక్క చెడు ప్రభావం నుంచి విముక్తి 
7 రుద్రాలు - గొప్ప భయము నుంచి విముక్తి 
9 రుద్రాలు - ఒక వాజపేయ యాగము చేసిన ఫలము మరియు మానసిక ప్రశాంతత 
11 రుద్రాలు - రాజుల యొక్క వశము మరియు గొప్ప సంపదను పొందుట 
33 రుద్రాలు - కోరుకున్న వస్తువు లభించుట మరియు శత్రు నాశనము 
77 రుద్రాలు - గొప్ప ఆనందాన్ని అనుభవించుట 
99 రుద్రాలు - పుత్రుడు, పౌత్రుడు (మనవడు), సంపద, ధాన్యము, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పొందుట మరియు మృత్యువు నుంచి విముక్తి 
1 మహా రుద్రము - రాజు యొక్క మెప్పు పొందుట మరియు గొప్ప సంపదకు అధిపతి అగుట 
3 మహా రుద్రాలు - అసాధ్యమైన పనిని నెరవేరుట 
5 మహా రుద్రాలు - విశాలమైన స్థలాలను పొందుట 
7 మహా రుద్రాలు - సప్త లోకాలు జయించుట 
9 మహా రుద్రాలు - జనన మరణ చక్రం నుంచి విముక్తి 
ఒక అతిరుద్రం - భగవంతుడ అగుట

అభిషేకానికి పదార్థములు: శుద్ధ జలము, పాలు, నెయ్యి, తేనె, పవిత్రమైన నదులు మరియు సముద్రం యొక్క జలము. 

వృష్టి/ వర్షము కొరకు శుద్ధ జలముతో అభిషేకించాలి. రోగ నాశనం కొరకు మరియు పుత్రుని పొందుటకు పాలతో అభిషేకించాలి. పాలతో అభిషేకిస్తే పుట్టు గొడ్రాలు సైతం సంతానవతి అవుతుంది. ఆ వ్యక్తికి పుష్కలమైన గోసంపద లభిస్తుంది. కుశాజలంతో అభిషేకిస్తే అతడు సర్వ రోగాల నుంచి విముక్తి అవుతాడు. సంపద కోరే వ్యక్తి నెయ్యి, తేనె మరియు చెరుకు రసంతో అభిషేకించాలి. మోక్షము కోరే వ్యక్తి పవిత్రమైన నదుల యొక్క నీటితో అభిషేకించాలి. 

స్వామి శివానంద విరచిత అభిషేకం యొక్క తత్త్వము ఇక్కడితో సమాప్తము.

ముళ్ళపూడి అభినవ్ గారు వ్యక్తిగత మెసెజ్‌లో దీన్ని తెలుగులోనికి అనువదించమని కోరినందుకు ప్రతిగా ఇది అనువదించడం జరిగింది. మనమంతా వారికి కృతజ్ఞులమై ఉండాలి.

ఓం నమశ్శివాయ 

No comments:

Post a Comment