తమిళనాడులో ఎక్కడ చూచినా వినాయకుడి గుడి కన్పిస్తుంది. స్వామిని పిళ్ళైయార్ అని తమిళులు పిలుస్తారు. పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు లేక పోయినా ఏ రావిచెట్టు క్రిందో మనకు స్వామి సాక్షాత్కరిస్తాడు. చాలా చోట్ల పందిళ్ళు కూడా ఉండదు. స్వామికి ఆకాశమే పందిరి. ఇంచుమించు ప్రతి గ్రామంలోనూ, అంతే కాదు, ప్రతి వీథిలోనూ అడుగడుగునా తమిళనాడులో స్వామి సాక్షాత్కరిస్తాడు. సంఖ్యలో అతని తరువాత మిగతా దేవతల విగ్రహాలు. ఇతడు పార్వతీ పరమేశ్వరుల ప్రథమ సంతానం. తమిళంలో కొడుకుని పిళ్ళై అని అంటారు. గౌరవంతో బహువచనం ప్రయోగించినపుడు పిళ్ళైయార్ అంటారు.
వినాయకుని తమ్ముడే కదా కుమారస్వామి! కాని పిళ్ళైయార్ అన్నట్లుగా గౌరవ సూచకంగా బహువచనం వాడి కుమారర్ అని పిలువరు. కుమారన్ అనే పిలుస్తారు. ఇతని కంటే పెద్దవాడు కనుక వినాయకుని పిళ్ళైయార్ అంటారు.
ఇట్లా జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులకు మొదట పుట్టినవాడై, దేవుడై నుతింపబడ్డాడు. కనుక ప్రతి దానికి ఇతడు మొదలైనాడు. ప్రపంచం జీవులు అన్నీ ప్రణవం నుండి వచ్చాయి కదా! అట్టి ప్రణవానికి కనబడే రూపమే మన స్వామి. అతని ఏనుగు తల, వంకర తిరిగిన తుండం చూస్తూ ఉంటే ప్రణవాకారంగానే కనిపిస్తాడు.
ఇట్లా మొదటి పిల్లవాడై, పిల్లవానిగా కనబడే వాడై, ప్రణవాకారుడై భక్తుల నుద్దరించుటలోనూ మొదటివాడై వెలుగొందుచున్నాడు. అవ్వైయార్ అనే తమిళ కవయిత్రి ఇతని భక్తురాలు. ఇతణ్ణి ప్రణవాకారంగా రెండు కనుబొమల మధ్య ధ్యానిస్తూ ఉండేది. వినాయకుడు అవగళ్ అని ఆమె వ్రాసిన గ్రంథంలో యోగశాస్త్ర సారాన్ని వివరించింది. దీనిని పారాయణ చేస్తే జ్ఞానం పట్టుబడుతుంది. ఈమె గురించి ఒక కథ చెబుతారు. సుందరమూర్తి స్వామి, చేరుమాన్ పెరుమాళ్ నాయనార్ అనే భక్తులు కలిసానికి ప్రయాణమయ్యారు. నీవు వస్తావా అని ఈమెనడిగారు. ఆ సమయంలో వినాయకుని పూజిస్తూ ఉండేది. మీతో ప్రయాణం చేయడానికి నేను తొందరపడడం లేదు, వినాయకుని పూజించడమే నాకు కైలాస యాత్రతో సమానమని ఆమె అనగా వారు ప్రయాణం సాగించారు. ఈమె భక్తికి మెచ్చుకొని వినాయకుడు తన తుండంతో ఒక్క ఉదుటున కైలాసానికి చేర్చాడు. అవ్వైయార్ తరువాతనే వారిద్దరూ కైలాసానికి చేరుకున్నారు. ఇట్టి విచిత్ర సంఘటన అరుణగిరినాథుడు తన తిరుప్పుగళ్ లో పళనిక్షేత్రాన్ని పేర్కొంటూ చేర రాజులు కొంగునాడు ప్రాంతాన్ని పరిపాలించేవారనే సందర్భంలో ఈ కథను పేర్కొన్నాడు.
ఇట్లా భక్త సులభుడు మన స్వామి.
No comments:
Post a Comment