ఒక ముసలి స్త్రీ - ఒక పిల్లవాడు
ఒక ముసలి స్త్రీ ఉండేది. సాధారణంగా ముసలివాళ్ళు కాళ్ళు చాపుకొని ఒక మూల కూర్చొని ఉంటారు కదా! కాని ఈమె అట్లా కాదు. తమిళనాడు అంతా ఊరూరా తిరిగేది. వీథి వీథి తిరిగేది. ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఊరంతా కలియతిరిగింది. ఆమె కథను చివర చెప్పుకొందాం.
ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆరోగ్యకరంగా చూడముచ్చటగా ఉండేవాడు పిల్లలు ఆడుతూ పాడుతూ ఒకచోట కూర్చోకుండా అల్లరి చేస్తూ ఉంటారు కదా! కాని ఈ పిల్లవాడు వాళ్ళకు విరుద్ధంగా ఒక మూల కూర్చొని ఉండేవాడు. కూర్చున్నచోటునుండి అణుమాత్రం కదిలేవాడు కాదు.
వింత ముసలి స్త్రీ, వింత పిల్లవాడు. ముసలి స్త్రీ పిల్లవాళ్ళలా, పిల్లవాడు ముసలివాళ్ళలా ఉండడం వింతయే కదా.
విసుగూ విరామం లేకుండా ముసలి స్త్రీ తిరగడానికి బలాన్ని ఈ పిల్లవాడిచ్చాడు. ఎవడా పిల్లవాడు?
అతడే మన గణపయ్య. అట్లా కదలని వానిని కల్లు పిళ్ళైయార్ అని తమిళంలో అంటారు. అంటే కదలని వినాయకుడన్నమాట.
అతనికే గణేశుడని, గణపతియనే పేర్లున్నాయి. శివుని గణాలకు అధిపతి కనుక ఆ పదాలు వచ్చాయి. ఇతని కంటె మరొక అధిపతి లేదు, నాయకుడు లేడు కనుక ఇతడు గణపతి, గణేశుడు, వినాయకుడయ్యాడు. విగత నాయకుడు వినాయకుడు. సంస్కృతంలో 'వి' అనే ఉపసర్గకు రెండర్డాలున్నాయి. విశేషమని విగతమని అర్థాలు. విగత నాయకుడూ, విశేష నాయకుడూ అతడే అన్ని విఘ్నాలను పోగొడతాడు కనుక విఘ్న నాయకుడు. చేసే పనులలో విఘ్నాలుండకూడదని విఘ్నేశుని ముందుగా పూజిస్తాం. మొదట పూజ ఇతనికే.
No comments:
Post a Comment