Sunday, 2 August 2020

హిందూ ధర్మం - 282 (కర్మ సిద్ధాంతం - 22)



కాయికమైనవి అంటే దేహ సంబంధమైనవి, శరీరంతో చేసే పాపాలను మూడుగా వర్గీకరించారు.

1) మనది కాని వస్తువును, అనుమతిలేకుండా తీసుకొనుట. ఇతరుల వస్తువులను దొంగిలించుట.

ఇందులో దొంగతనం ఒకరకమైన పాపం. అది మనకు తెలిసిందే. అలాగే మనం నిత్యజీవితంలో చేసే పాపాలు కొన్ని ఇక్కడ చెప్పుకుందాము. ఉదయాన్నే వ్యాహాళి (మార్నింగ్ వాక్) పేరుతో ఓ చేతిలో పాలబుట్ట, ఇంకో చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని బయలుదేరుతారు. ఇకవారికి మాత్రమే భక్తి ఉన్నట్లు, రోడ్డున కనబడిన ప్రతి పువ్వును కోసేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే కనిపించిన ప్రతి చెట్టు మీద ఒక్క పువ్వు కూడా లేకుండా దులిపి వదిలిపెడతారు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు. అప్పుడు ఎంత పుణ్యం వస్తుందో తెలీదు గానీ ఆ మొక్క నాటిన వాడి అనుమతి తీసుకోకుండా పువ్వులు కోసినందుకు దొంగతనం చేసిన పాపం వస్తుంది. దానిఫలితంగా మేక జన్మ ఎత్తవలసి వస్తుంది. పోని రోడ్డు పక్కన సహజంగా పెరిగిన మొక్క పువ్వులు, కాయలు కోసినా అంతే. అసలు నీకు దాని ఫలం తీసుకునే అధికారం ఎక్కడ ఉంది. నారు పోయలేదు, నీరు పోయలేదు, దానికి చీడ పడితే కనీసం మందు కొట్టలేదు. ఇప్పుడు ఉచితంగా ఫలాలు తీసుకోవడం తప్పు గనక పాపం వస్తుంది. ఇక గుళ్ళకు వెళ్ళి అక్కడి పూలను, ఆకులను ఎత్తుకొచ్చేవారి పాపం దీనికి వందరెట్లు ఉంటుంది. అది పుణ్యక్షేత్రాల్లో చేస్తే వెయ్యి రెట్లు.

నిత్యం భగవంతునికి అర్పించకుండా స్వీకరించినది ఆహారం కాదని, అది పాపమని గీతలో భగవానుడు చెప్పాడు. నువ్వు ఏదైనా ఆహారం స్వీకరిస్తున్నావంటే దానివెనుక ఎంతోమంది కష్టం ఉంది, ప్రకృతి వనరుల వినియోగం ఉంది. ఆహారం నీదాకా రావాడానికి కారణమైన వ్యక్తులకు/ సమాజానికి, ప్రకృతికి నువ్వు ఏ విధమైన మేలు చేయకుండా, దీనికి కారణమైన భగవంతునికి అది అర్పించకుండా తినుట పాపమని భగవానుని మాట. 

మీకు ఇది ఆయుర్వేదంలో కనిపిస్తుంది. ఒక ఔషధ మూలికను సేకరించే ముందు ఆ మొక్కను పూజించాలి. పసుపుకుంకుమలు వేసి, దాని పెరికి వేస్తున్నందుకు లేదా దాని శరీర భాగాలను సేకరిస్తున్నందుకు గానూ దానికి క్షమాపణ చెప్పాలి. "నా రోగం నయమవుటకు నీ శరీర భాగాన్ని తీసుకుంటున్నాను" అని చెప్పి, వినయంతో స్వీకరించాలి. అలా తీసుకున్న మూలిక మాత్రమే పూర్తి రోగ నివారణ చేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం పేరుతో బయట జరుగుతున్నదంతా వ్యాపారం తప్ప అసలైన శాస్త్రం కాదు. ఉన్నది మొత్తం ఖాళీ చేయాలనే చూస్తున్నారు తప్పించి అసలు ఆయుర్వేద మూలికలను, వృక్షాలను రక్షించాలి, పెంచాలన్న ఆలోచన ఏది? 

అంతెందుకు నీటిని ఇష్టం వచ్చినట్లు వాడేస్తారు. పొదుపుగా వాడాలన్న ఆలోచన ఉండదు. పోని మనం నీటిని వాడుకుంటున్నందుకు ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి వర్షపునీటిని లేదా వాడుకున్న నీటిని ఇంకిస్తామా అంటే అదీ లేదు. ఉన్నదంతా వాడేయాలి, ఆ తర్వాత తరాలు ఏమైతే ఏంటి? అనే భావన కనిపిస్తుంది. మన పక్కన ఒక నది పారుతున్నా, నీ అవసరాలకు ఎంత సరిపడతాయో, అంత నీటిని వాడుకునే 'అవకాశం' మాత్రమే ప్రకృతి (ప్రకృతి రూపంలో ఉన్న భగవంతుడు) నీకు ఇచ్చింది. నీకున్నది అవకాశమే గానీ అధికారము కాదు, హక్కు అంతకంటే కాదు. ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి ఇది వర్తిస్తుంది. అలాగాక నీ ఇష్టం వచ్చినట్లు నీవు వనరులను వినియోగించడం దోపిడి / దొంగతనమవుతుంది.  

ఇదంతా ఎందుకు - తగిన ప్రతిఫలం ఇవ్వకుండా తీసుకున్నా, ఉచితం తీసుకున్నా, అదంతా పాపమే అవుతుంది. అది అనేకమైన నీచజన్మలకు కారణమవుతుంది.  

To be continued ........

No comments:

Post a Comment