వేయి సంవత్సరాలనుండి ఆ పాటలు ఈ నాటికీ వినబడుతున్నాయంటే ఆమె చూపిన ప్రేమ, దయలే కారణం. సత్యాన్ని సూటిగా, నాటుకొనే రీతిలో చెప్పి పాడింది. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన కంబడు, పుగళేంది, ఎళాంగో రచనలు చదువని వారుండవచ్చు గాని అవ్వైయార్ వ్రాసిన పాట రానివారుండరు.
ఆ మాటలలో శక్తి ఎట్లా వచ్చింది? మాటలలోనే కాదు, దేహంలోన్ ఆమెకు బలం ఉంది. గ్రామగ్రామాన పిల్లల్ని ప్రోగు చేసి పాటలచే వారిని ఉత్తేజితుల్ని చేసిన దొడ్డ తల్లి. ఎన్నివేలమందిని, లక్షలమందిని కలుసుకుందో! ఈ శక్తి అంతా ఎక్కణ్ణుంచి వచ్చిందనుకొంటున్నారు? అంతా వినాయకుని నుండే సుమా!
ఆ పిల్ల దేవుణ్ణి కొలిచి పిన్నతనంలోనే ముసలిదైపోయింది. ఎందుకారూపం వచ్చింది? ఆమె పడుచుగా ఉన్నా, నడి వయస్సులో ఉన్నా ఎవర్నో ఒకర్ని వివాహమాడవలసి వస్తుంది కదా! సాధారణ కుటుంబ జీవనం ఆమె భక్తికి ఆటంకమై పోయేది. అందువల్ల ముసలితనాన్ని ఏరికోరి వరించింది.
మన గణపతి సుబ్రహ్మణ్యునకు వివాహం చేయించి అవ్వైయార్ ముసలి దానిని చేసి పెళ్ళి లేకుండా చేశారు. ఎవరేది అడిగితే దానినే ఇస్తాడు. ఆయన పిల్లలకు ఇష్టమైన దైవం కూడా. అందువల్ల ఆమె రచనల వల్ల పిల్లలు బాగు పదాలని ఆమెకు ముసలి దానాన్ని ప్రసాదించాడు. పెళ్ళైతే ఒక కుటుంబానికే పరిమితమై ఉండేది. ఇప్పుడేమో తమిళనాడుకు, అంతేకాకుండా తరతరాలకు తల్లియై విలసిల్లింది.
నిరంతరం వినాయక స్మరణ, పిల్లలకు హితబోధ - ఈ రెండే ఆమె ప్రవృత్తిలో కన్పిస్తాయి.
ఆమె తమిళనాడంతా తిరిగితే, నేనేమో దేశమంతా తిరిగాను. ఎక్కడ చూసినా తమిళనాడులో ఉన్న వినాయక భక్తి ఎక్కడా కనబడలేదు. వినాయక భక్తి తీవ్రత ఇక్కడ మెండుగా ఉంది.
పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు తనకు కట్టబెట్టాలని గణపతి భావించడు. ఒక చిన్న సన్నిధి చాలు. పూరిపాక వేసినా, లేదా చిన్న ఆచ్ఛాదన కల్పించినా అదే పదివేలుగా భావిస్తాడు. అదీ లేదనుకోండి, ఏ చెట్టు నీడనో ఉంటాడు. భక్తులనాదరించి ఎక్కడ చూసినా సంతోషకరమూర్తిగా సాక్షాత్కరిస్తాడు.
దీనికంతటికీ అవ్వైయార్ కారణం. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుని గుడి వెలియవలసిందే. తమిళనాడు ప్రత్యేకతలను గురించి చాలామంది పరిశోధకులు ఏవేవో వ్రాస్తారు. నా దృష్టిలో దీనినే ప్రత్యేకతగా భావిస్తున్నా.
No comments:
Post a Comment