Saturday, 2 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (132)



చెప్పబోవు కథలో మహేంద్రవర్మ పల్లవుడనే గొప్ప రాజుకు బద్ధ విరోధి రెండవ పులకేశి. ఈ పల్లవ రాజుకంటె ఉత్తర దేశంలోని హర్షవర్ధనుడు ఇంకా గొప్పవాడు. హర్ష శబ్దం, పులకేశి పదాన్ని తలపింపచేస్తోంది. పులకేశి హర్షుణ్ణి తరమివేసాడు. పులకేశికి కన్నడంలో అసలు నామం, ఎరాయమ్మ. రాజైనపుడు తాత పేరును గ్రహించి హర్షవర్ధనునకు బద్ద శత్రువైనాడు.


వెంట్రుకకు అలకమని సంస్కృతంలో అంటారు. యక్షరాజైన కుబేరుడు అలకేశ్వరుడు. అతని రాజధాని అలకాపురి. హృషీకేశ, పులకేశి, అలకేశన్ అనే పదాలు రోమాంచిత లక్షణాన్ని, గొప్పదనాన్ని సూచిస్తాయి.


రెండవ పులకేశి, దగ్గర బంధువుచే మోసగింపబడి రాజ్యాన్ని కోల్పోయాడు. తరువాత అమిత శక్తితో అతణ్ణి జయించి గద్దెనెక్కాడు. చాళుక్య రాజులందరిలో ప్రసిద్ధిని పొందాడు. సత్యాశ్రయుడనగా సత్యానికి ఆశ్రయుడనే బిరుదు వహించి పరిపాలించాడు. దండెత్తిన హర్షవర్ధనుని తరమివేసాడు. నర్మదకు ఉత్తరపు వైపున అతడు పరిపాలించ వలసి వచ్చింది.


ఆనాటి కాలంలో దక్షిణ దేశంలో ఒక పల్లవ రాజుండేవాడు. అతడు మహేంద్ర వర్మన్. అతడు వ్రాసిన మత్తవిలాస ప్రహసనంలో తాను మహేంద్ర విక్రమ వర్మనని వ్రాసుకున్నాడు. గొప్ప రసజ్ఞుడు. సంగీత శిల్ప పోషకుడు. అట్టివానిపై పులకేశి దండెత్తి, కోటకే అతడ్డి పరిమితమగునట్లుగా చేసాడు. అట్లా విజయం సాధించాడు.

పులకేశి చేతిలో ఓడింపబడడం అతనికి అవమానకరమైంది. పగ తీర్చుకోకుండానే కన్ను మూసాడు. అతని కొడుకు నరసింహవర్మ. అతనికే మామల్లన్ అనే బిరుదుండేది. అతడు వాతాపిపై దండెత్తి చాళుక్యుల నోడించాడు. ఆ నగరాన్నే ధ్వంసం చేసాడు.

క్షత్రియులలో మంచి లక్షణాలున్నా వారిలోని క్షాత్రగుణం, శత్రుత్వంగా మారి వారి మనస్సులను చెడగొడుతుంది.

No comments:

Post a Comment