Wednesday, 13 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (143)

 


వికటచక్రవినాయకుడు


కాంచీపురంలో వికట చక్ర వినాయకుడున్నాడు. స్వామి, సుబ్రహ్మణ్యాలయంలో అనగా కుమార కొట్టంలో ఉంటాడు. ఈ పేరు ఎట్లా వచ్చింది? లోగడ విష్ణుని చక్రం మ్రింగివేయడం, విష్టువు గుంజీళ్ళు తీసి ఇతణ్ణి నవ్వించడం, చక్రం ఊడి పడడం మొదలైన కథను చెప్పాను కదా! అతడే ఈ వికటచక్ర వినాయకుడు.


విఘ్నరాజు


విఘ్నరాజే విఘ్నేశ్వరుడు. రాజుకంటే ఈశ్వరుడేక్కువని తలుస్తాం. ఈశ్వర శబ్దాన్ని పరికిస్తే దాని ధాతువును బట్టి రాజేమి చేస్తాడో, ఈశ్వరుడూ అదే చేస్తాడు. ఈశ్ అనగా పాలించుట. భగవంతుని నామాల చివర ఈశ్వర, రాజ, నాథ అనే పదాలుంటాయి. అన్నీ ఒకే అర్థాన్నిస్తాయి. నటరాజును నటేశుడంటాం. నటేశ్వరుడంటాం. రంగరాజుని రంగనాథుడు, రంగేశుడని పిలుస్తాం. అట్లాగే విఘ్నరాజన్నా, విఘ్నేశ్వరుడన్నా ఒక్కటే.


ఒక ప్రత్యేకాధికారం ఇతడు కలిగియున్నాడని ఈ పదం వెల్లడిస్తోంది. సృష్టికి బ్రహ్మ, రక్షణకు విష్ణువు, సంపదకు లక్ష్మి, విద్యకు సరస్వతి; ఆరోగ్యానికి ధన్వంతరి; ఇట్లా ఒక్కొక్కరికి ఒక్క శక్తి నిచ్చాడు పరమేశ్వరుడు. ఇతని పని ఏమిటి? ఆటంకాలను తొలగించే పనే. పరమేశ్వరుడే ఈ కారణం వల్ల విఘ్నరాజయ్యాడు.


అంటే ఆటంకాలను కలిగించేవాదని అర్థం చేసుకోకూడదు సుమా! ఆటంకలను మటుమాయం చేస్తాడనే అర్ధం చెప్పాలి.


No comments:

Post a Comment