అయితే రెండూ ఒకే మూర్తులు ఒక్కచోటుంటే ఏమని అర్థం? విఘ్నాలు కల్గించడంలో ఒక మూర్తి అధికుడని, అప్పుడతడు విఘ్నరాజని, దానిని తొలగించినపుడు వినాయకుడని పిలువబడతాడు.
ఆటంకాలను తొలగిస్తున్నాడంటే ఆ స్వామి క్రూరుడని లెక్కబెడతామా? కాదు. అందువల్ల విఘ్నాలను కలిగించినా, తొలగించినా రెండూ పరస్పరం విరుద్ధం కావని, విరుద్ధంగా ఉన్నట్లే కన్పిస్తాయని, ఇద్దరి కృత్యాల పరమార్ధం ఒకటేనని, ఒక్కడే రెండు రూపాలను ధరించాడని గట్టిగా మనం నమ్మాలి.
అయితే విఘ్నాలను కలిగించడం అనుగ్రహం అవుతుందా? మనం దుష్టకర్మలనే మూటలను ఎన్నో జన్మలనుండి మోస్తున్నాం. స్వామియొక్క అనుగ్రహం వల్ల అతనిపట్ల కొంత భక్తిని చూపించి ఏ పని చేసినా అందేమీ ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం.
ఇట్లా ఫ్రార్థించినంత మాత్రంచే మన గత జన్మ కర్మలనంతటినీ పట్టించుకోకుండా ఇప్పుడు మనం చేసే పనులలో విజయం సాధించేటట్లు చేస్తాడా? మనపట్ల సంపూర్ణ దయను చూపి గతజన్మ కర్మలనన్నిటినీ తుడిచి వేస్తాడా? ఇట్లా చేయగలిగితే ప్రజలలో పాపం పట్ల భయపడతారా? అట్లా ఉంటే ఇక ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం ఉంటుంది. ఇక ప్రజలలో మనమే చెడ్డపనైనా చేయవచ్చు, ఒక మాటు స్వామికి పూజ చేస్తే సరిపోతుందిలే అనే భావం రాదా? మనం తప్పులు, నిరంతరం చేస్తూ ఉండడానికి బాగా అలవాటు పడిపోతాం కదా!
No comments:
Post a Comment