Sunday 3 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (133)



క్షత్రియుల పేర్ల చివర వర్మ అని ఉంటుంది. అనగా అసలర్థం కవచమని. కవచం ధరిస్తారు కనుక వర్మలయ్యారు. అంతేకాదు, దేశాన్ని; జీవితాన్ని పోగొట్టుకొనైనా రక్షిస్తారు కనుక వర్మలయ్యారు. పై వర్మలో అట్టి లక్షణం కంటె శత్రుత్వమే ప్రధానమై కన్పించింది. చాళుక్యులూ ఈ విషయంలో పల్లవులకు తక్కువ వారేమీ కాదు. పగబట్టి కాంచీపురాన్ని ధ్వంసం చేసారు. వంద సంవత్సరాల తరువాత రెండవ విక్రమాదిత్యుడు కంచిపై దండెత్తాడు. కంచిలో కైలాస నాథాలయ నిర్మాణం జరిగిన కాలమది. విక్రమాదిత్యుడు తలుచుకుంటే కంచిని, అందలి ఆలయాన్ని ధ్వంసం చేసి యుండేవాడు. కాని ఆ పని చేయలేదు. శివమంత్ర దీక్షాపరుడు. శివభక్తి వల్లనో, పోషకుడవడం వల్లనో గాని అట్టి పాడు పని చేయలేదు. అంతేకాదు, దండెత్తి తిరిగి వచ్చిన తరువాత కైలాసనాథ ఆలయ ప్రతిబింబమా అన్నట్లుగా విరూపాక్షాలయాన్ని నిర్మించాడు. తమిళ దేశం నుండి శిల్పులను ఆహ్వానించి వారిని గౌరవాదరాలతో చూసాడు.


వాతాపిని జయించిన నరసింహవర్మ దగ్గరకు వెడదాం. అతని సైన్యాధిపతి పరంజ్యోతి, మహామాత్ర అనే బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. వీళ్ళు వైదిక మార్గాన్ని విడిచిపెట్టి మిగిలిన లౌకిక వ్యవహారాలలో ఆరితేరియుండేవారు. పరంజ్యోతి, శివాలయం ఉన్న తిరుచెంగట్టాన్ కుడికి చెందినవాడు. అతనికి వినాయకుని పట్ల భక్తియుండేది. వాతాపిని జయించి తిరిగి వచ్చేటపుడు అనేక వస్తు వాహనాలతో అక్కడి గణపతిని కూడా వెంట తీసుకొని వచ్చాడు. కళింగ యుద్ధం తరువాత అశోకునిలో ఎట్టి మార్పు వచ్చిందో ఇతనిలోనూ అట్టి మార్పు కనబడింది. ఇక సైన్యాధిపత్యానికి స్వస్తి చెప్పి స్వగ్రామంలో శివభక్తితో కాలం గడిపేవాడు. వాతాపినుండి తెచ్చిన గణపతి విగ్రహాన్ని తిరుచెంగట్టాన్ కుడిలో ప్రతిష్ఠించి సిరు తొండనాయనార్ గా ప్రసిద్ధుడయ్యాడు. ఇట్లా తీసుకొని రాలేదనే అభిప్రాయమూ ఉంది. విగ్రహం యొక్క లక్షణాలను బట్టి వాతాపినుండి వచ్చిందని నిర్ధారణ చేసారు. వాతాపిలోనున్న విఘ్నేశ్వరుని పట్ల అచంచల భక్తి యుండడం వల్లనే వాతాపిని జయించగలిగాడని తిరిగి ప్రతిష్టించాడని కొందరన్నారు. అతడు కారణ మగుటచే ఇది వాతాపి గణపతి అయిందని అన్నారు. మరొక అభిప్రాయం ప్రకారం వాతాపి నుండి మూర్తిని తీసుకొని వచ్చినా మూలాధార క్షేత్రమైన తిరువారూర్ లో ప్రతిష్ఠించాడని కొందరన్నారు.


No comments:

Post a Comment