Saturday 30 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (158)

ఇటీవల క్రొత్త క్రొత్త పేర్లను పెట్టుకొంటున్నారు. చంద్రన్ అనే పదం దక్షిణ దేశంలో విరివిగా ఉండేది కాదు. రామచంద్రుణ్ణి ఆర్. చంద్రన్ అని వ్రాయడం ఉంది కొంతవరకు, రామచంద్ర, చంద్రమౌళి అనే పదాలున్నాయి చందు, చందర్ మొదలైనవి ముద్దు పేర్లు.



దక్షిణ దేశంలో ఇక సూర్యుని నామం తప్ప మిగిలిన గ్రహాలలో ఎవరి పేరు పెట్టుకోరు. అంగారకుడని, బుధుడని పెట్టుకోరు. ఎవరైనా బృహస్ృతియని పిలిస్తే తెలివి తక్కువ వాడనే అర్థంలోనే వాడతారు. శుక్రుని పేరు వినబడదు. ఇక శని మాటేమిటి? (ఇది చెప్పినప్పుడు స్వామివారు మందహాసం చేసారు). ఈ పదాన్ని ఇతరులను నిందించేటపుడు వాడతాం. ఇక రాహుకేతువులసలే ఉండరు. రాహు కేతువుల్లా పట్టుకొన్నాడని నిందార్ధంలో వాడతాం. ఒక్క సూర్యుణ్ణి పేరు పెట్టుకుంటారు. దానికి విష్ణు పదం చేరుస్తారు సూర్యనారాయణ, ఉత్తర దేశంలో రవి, ప్రభాకర, దివాకర, ఆదిత్య, మార్తాండ పదాలుంటాయి. దక్షిణ దేశంలో అట్టివాడుక ఇటీవల వచ్చింది పంచాయతనంలో సూర్యుడొకడు. శంకరులు స్థాపించిన షణ్మతాలలో సూర్యమతం ఒకటి. అదే సౌరం, సూర్యుడంటే పరమ దైవమని నమ్మే మతం కనుక అతని పేరు పెట్టుకోవడంలో ఔచిత్యం కన్పిస్తుంది. అయితే చంద్రునకా అవకాశం లేదు. కనుక బాల చంద్రన్ అనే మాట పూర్వులు వాడేవారు కాదు. ఇటీవల తెలియక వాడుతున్నారు. ఇది చంద్రున్థి ఉద్దేశించి కాదు బాలచంద్రుడంటే బాలుడైన చంద్రుడని కాదు.


ఫాలచంద్రుడంటే ఫాల భాగంపైన చంద్రుడున్నవాడు. అతడు చంద్రమౌళి చంద్రశేఖరుడే.


చంద్రుణ్ణి నెత్తిపైన ధరించినవాడంటే చటుక్కున శివుడు గుర్తుకు వస్తాడు ఇట్టి ప్రత్యేకత మరో ఇద్దరికీ ఉంది. అమ్మవారిని శ్యామలా దండకంలో కాలిదాసు, చంద్రకళావతంసే అని కీర్తించాడు. శంకరులు దానికి కొంత హాస్యాన్ని జోడించారు. ఆమె శంకరుని ఎడమ వైపు అర్ధభాగాన్ని గ్రహించడమే కాదు, మొత్తం పతినే కైవసం చేసుకుందని, చంద్రకళ ఆమె కిరీటంపై అర్ధంలో శశిచూడాలమకుటం (సౌందర్యలహరిలో 23 శ్లోకం)అన్నారు. లలితా సహస్రనామాలలో చారుచంద్రకళాధరా అని ఒక నామంలో ఈ అర్ధం ఉంది. అమ్మవారికే కాదు, ఆమె కొడుకునకూ ఈ గౌరవం దక్కింది.

No comments:

Post a Comment