అట్టి పరిస్థితి రాకుండా ఉండడం కోసం విఘ్నరాజు మనకు అప్పుడపుడు విఘ్నాలను కల్గిస్తాడు. అతడు సృష్టిస్తాడంటే మనలను అన్యాయంగా బాధిస్తాడని కాదు. పూర్వ కర్మల వల్ల మనం విజయం పొందలేకపోతాం. అందువల్ల అతడు కల్పించే విఘ్నాలు మన పూర్వ కర్మల వల్ల వచ్చిన ఫలాలే. అవే నిజంగా అడ్డుకొంటున్నాయి. అవి తమంతట తామే చేస్తే మనకింకా చిక్కు లేర్పడతాయి. ఇక అట్టి ఆటంకం వల్ల మనం చేసే ప్రయత్నం అంతా వ్యర్ధమై, మనం అన్ని విధాలా ఓటమి పాలవడం గాని, లేదా అప్పుడప్పుడు విజయం సాధించడం గాని జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఓటమి పాలవుతాం. అట్టి విఘ్నాలను కలిగించే బాధ్యత, స్వామితనంతట తానే గ్రహిస్తాడు. ఎట్లా అంటే వరద వచ్చినపుడు ఒక ఆనకట్ట కట్టగా కొంతవరకూ దాని ఉద్ధృతి తగ్గి ఒక పద్ధతిలో నీటిని విడుదల చేయడం మాదిరిగా ఉంటుంది. అంటే ఆటంకాలను ఒక పద్ధతిలో నడిపిస్తాడన్నమాట. అట్లా క్రమమార్గంలో పెట్టడమే కాకుండా కొన్నిచోట్ల ఆ ప్రవాహాన్ని ఆవిరియై పోయేటట్లు చేస్తాడు కూడా. అనగా ఒక పెద్ద ఆటంకం వచ్చి మనపై విరుచుకుని పడవచ్చు. అట్టి దానిని కొద్దికొద్దిగా అనుభవించేటట్లు చేస్తాడన్నమట. అనగా పాప ఫలాలను కొద్దికొద్దిగా అందిస్తాడన్నమాట అంటే వాటిని మనం భరించగలిగేటట్లు చూస్తాడు. మొత్తం పాపకర్మ అంతా సాధ్యమైనంత త్వరలో పోవడం మంచిది కదా. నిజమే. అతడాలస్యం చేసినకొద్దీ మనం ఇంకా పాపకర్మల భారాన్ని జోడించడం లేదా? అట్టిదానిని అడ్డుకోవడం కోసం ఒక విఘ్నాన్ని కలిగిస్తాడు. అది ముందు చెడ్డదిగా కనబడవచ్చు కాని నిజం ఆలోచిస్తే అది మనకే మంచిది.
అతని అష్టోత్తర పూజలో విఘ్నకర్త, అనగా విఘ్నాలు కలిగించేవాడని, మరొక నామం విఘ్నహర్త అనగా విఘ్నాలను పోగొట్టేవాడనీ ఉంది. ఇందులో విఘ్నరాజు ముందు వస్తాడు. తరువాత వినాయకుడు వస్తాడని అర్థం. ఇతనిలో నాయకత్వం గొప్పది. అందరు దేవతలూ నాయకులే. ఒక అసురుణ్ణి చంపి వారు నాయకులౌతారు. అయితే మిగిలిన వారికి లేని నాయకపదం ఇతనికెందుకుంది? అసుర బాధలను పోగొట్టడమే కాదు, ఆటంకాలను తొలగిస్తాడు, ఆపైన విఘ్నాలకు విఘ్నరాజై కల్గిస్తాడు కూడా. కనుక అన్నివిధాల ఇతడు నాయకుడే. వినాయకుడయ్యాడు. కనుక విఘ్న వినాయక పాదనమస్తే అంటాం.
No comments:
Post a Comment