Tuesday 3 October 2023

శ్రీదత్త పురాణము (276)

 


సూత మహర్షీ! దత్తదేవుడి అనుగ్రహం వల్ల నీ ముఖతః వీటిని అన్నింటిని వినగలిగిన మేము కూడా ధన్యులం. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. అందుకని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు - కలిపురుషుడికి చెప్పిన ఈ మహేతిహాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి నుండి ప్రత్యక్షంగా విన్న ఉత్తమశ్రోత దీపకుడు ఏమన్నాడు ? గురువుగారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నాడు ? - ఇవి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. వీటిని వినేసి ఈ రోజుకింక మా యోగ విధుల్లోకి మేము వెళ్ళిపోతాం.


మహామునులారా ! వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడంటే అదొకరకం ప్రీతి, అభిమానం అంచేత అతడి గాధల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ వుంటాడు. పునరుక్తి అవుతున్నా పట్టించుకోడు. అవును కదా! మీరూ గమనించే వుంటారు. ఇప్పుడూ అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్తది వింటునట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడూ అలాగే విన్నాడు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాద పద్మాలకు తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్ద్రమైన కన్నుల్ని ఒత్తుకుంటూలేచి సాష్టాంగ నమస్కారం చేశాడు.


గురుదేవా ! అత్యంత మహిమాన్వితమూ అత్యంత పవిత్రమూ అత్యంత రమణీయమూ అయిన శ్రీ దత్తపురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుకపరిచారు. దీనికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను ? బ్రతికి ఉన్నంతకాలమూ ఇలాగే మీసేవ చేసుకుంటాను. మీ వెంట వుంటాను. అనుమతించండి మహానుభావా ! అని సాగిలపడి మ్రొక్కాడు. వాత్సల్యమూర్తి వేదధర్ముడు శిష్యుణ్ని లేవనెత్తి ప్రేమగా కౌగలించుకొని శిరస్సు నిమురుతూ ఆనందబాష్పాలను ఆశీరక్షతలుగా చాల్చాడు.


నైమిశారణ్యవాసులారా ! మహా మునీశ్వరులారా ! దత్తాత్రేయుడి కటాక్షంతో రూపొందిన ఈ పురాణాన్ని విన్నవారూ, చదివినవారూ సర్వపాపవిముక్తులవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణమే చెయ్యగలిగితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి వైకుంఠధామం చేరుకుంటారు.


ఎవ్వడైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని గానీ పూర్తి పురాణాన్ని గానీ అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకళింపుజేసుకున్నా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దానితో సకలాభీష్టాలూ సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణుసాయుజ్యం పొందుతాడు.


మంగళం దేశికేంద్రాయ అనసూయాత్రి సూనవే ! 

యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయాయమంగళమ్


దత్త పురాణం సంపూర్ణం

No comments:

Post a Comment