Thursday, 12 October 2023

శ్రీదత్త పురాణము (284)

 


బంధూత్తముడు నా బంధువులను పాలించుగాక. శత్రుజిత్తు నా శత్రువుల నుంచి రక్షించుగాక. శంకరుడు నా యిల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలయినవి రక్షించుగాక (17) ప్రకృతి విదుడు నా భార్యను కాపాడుగాక. - శార్ఙ్గభృత్తు నా పశువులు మొదలయిన వాటిని పాలించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక. భాస్కరుడు నా భక్ష్యాదులను కాపాడుగాక. (18) చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు దుఃఖం నుంచి రక్షించుగాక. పశుపతి పశువులను కాపాడుగాక. భూతేశ్వరుడు నా భూతిని (= ఐశ్వర్యాన్ని) పాలించుగాక. (19) విషహరుడు తూర్పువైపున కాపాడాలి. మఖ (= యజ్ఞ) స్వరూపుడు ఆగ్నేయపు మూల రక్షించాలి. ధర్మాత్మకుడు దక్షిణపు దిక్కున పాలించాలి. సర్వవైరిహృత్తు నైరృతిమూల రక్షించాలి. (20) వరాహుడు పడమటి దిశను కాపాడాలి. ప్రాణదుడు ("ప్రాణాలనిచ్చేవాడు) వాయవ్యపు మూల పాలించాలి. ధనదుడు ఉత్తరపు దిక్కును రక్షించాలి. మహాగురుడు ఈశాన్యపుమూల కాపాడాలి. (21) మహాసిద్దుడు ఊర్ద్వదిక్కును రక్షించాలి. జటాధరుడు అధోదిశను పాలించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిశ రక్షలేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. (22) (హృదయాదిన్యాసం చేయాలి) ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడూ చిరంజీవి కాగలడు అని స్వయంగా దత్తాత్రేయుడనగు నేనే చెప్పాము. (23) అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖదుఃఖరహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు. (24) అని చెప్పి దిగంబర దత్తాత్రేయ యోగి అంతర్ధానం చెందాడు. ఆ దలాదనుడు కూడా అది జపించి జీవన్ముకుడై ఉంటున్నాడు. (25) దూరశ్రవుడు అనే బిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నందుననే అతడు వజ్రకాయుడయ్యాడు.(26) అని దత్తాత్రేయ యోగికవచమంతా శంభుని నోట విని పార్వతి "ఈ కవచం యొక్క మహాత్మ్యమూ, ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఏది, ఎలా ఎలా జపించవలెనో అదీ సవిస్తరంగా చెప్పు" అన్నది. (27,28) పార్వతి వినయంగా అడిగినది కనుక శంభుడు అదంతా (ఇలా) చెప్పాడు చెపుతున్నాను పార్వతీ! ఏకాగ్రతతో నిర్మలతతో విను(29) ధర్మార్థ కామమోక్షాలకిదే ఆధారం. ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. (30) పుత్రమిత్రకళత్రాది సర్వసంతోష సాధనమిది. వేదశాస్త్రాది విద్యలకు పరమనిధానమిది. (31) సంగీత శాస్త్రసాహిత్య సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానం, తత్త్వజ్ఞానం అనే ఆరుగుణాలు గల బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. (32) ఇది సర్వసంతోషాలనూ కలిగిస్తుంది. సర్వదుఃఖాలనూ నివారిస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది, యశస్సునూ కీర్తినీ పెంచుతుంది. (33) దీనిని వెయ్యి సారులు జపించినందువల్ల ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహరోగాలూ, పద్దెనిమిది కుష్టురోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాతరోగాలూ, నలభై పైత్యరోగాలూ, ఇరవై శ్లేష్మరోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్రయంత్ర-కుత్సితయోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులు, భేతాళులు, కూష్మాండాది గ్రహాలు - వీటివల్ల కలిగినవీ, సంగతి (సాంగత్యం) వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్ననీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాలవల్ల కలిగిననీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం. (34-38) పదివేలసారులు జపిస్తే చాలు, గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేల మారులు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. (39) ముప్పైవేల పర్యాయాలు జపిస్తే ఆకాశసంచారం అలవడుతుంది. కోటిమారులు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. (40)  

No comments:

Post a Comment