Sunday 1 October 2023

శ్రీదత్త పురాణము (274)

 


వీటిని దత్తాత్రేయుడు వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి - శ్రోత స్మార్తవ్రత దానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానమంటారు గదా. దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి, అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడమెలాగ ? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలున్నాయా ? చాంద్రాయణాది వ్రతాల స్వరూపం ఏమిటి ? ఈ విషయాలు తెలియజెప్పి నన్ను ధన్యుణ్ని చెయ్యి దేవాదిదేవా! అని అభ్యర్ధించాడు. దత్త యోగేంద్రుడు సంతోషించి - ఉపవాసాలకూ, వ్రతాలకు, దానధర్మాలకూ ఏయే తిథులు ఉత్తమాలో ఏవి పనికిరావో తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియజేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథి వార నక్షత్రాదుల్ని నిర్ణయించుకుని సత్కర్మాచరణం చేస్తే అక్షయఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు. దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణుస్వరూపులే. వారికి సంసార దుఃఖాలు ఆదివ్యాధులూ అంటవు, అవి బాధించవు.


ధర్మకీర్తి ! బ్రహ్మహత్య - సురాపానం - స్వర్ణస్తేయం - గురుభార్యాగమనం - ఇవి చేసిన వాడితో స్నేహం- అనే పంచ మహాపాతకాలతోపాటు పరస్త్రీగమన ప్రాణిహింసాదులు మరికొన్ని ఉపపాతకాలూ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కొన్నింటికి పిడకలు పేర్చుకుని తననితాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా అడుసు తొక్కనేల కాలు కడుగనేల అన్నట్టు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీని సాధనకు చెప్పిన నిత్యనైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించండం ధర్మాచరణపట్ల ఆదర్శప్రాయులను అనుసరించడం పురాణేతిహాసాల పఠనం ద్వారా ధర్మసూక్ష్మాలను మంచిచెడులనూ తెలుసుకొని మంచిని అలవరచుకోవడం ఇవే ఉత్తమోత్తమమైన పరిష్కార మార్గాలు.


ధర్మకీర్తి ! అనుతాపంతో అంతశ్శుద్ధిని ఉపవాసాలతో బహిశ్శూద్ధినీ సాధించి పదిమందికీ ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగానైతేనేమి ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగానైతేనేమి చాంద్రాయణాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వివరించమన్నావు గదా ఆలకించు - అంతూ దత్తాత్రేయుడు కొనసాగించాడు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం దయ ఓర్పు మౌనం సత్యదీక్ష అకామ్యత అహింస అస్తేయం (దొంగతనం చెయ్యకపోవడం) మాధుర్యం బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం స్నాన ఉపవాసం ఇజ్య (హోమం) స్వాధ్యాయం గురుశుశ్రూష శౌచం ఆక్రోధిత ఆప్రమాదిత ఇవి తప్పక - పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుడి వృద్ధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకుని కాలం గడపటం వానప్రస్తులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీన్నే చాంద్రాయణ వ్రతమంటారు. శుక్ల పక్షంలో చందమామ దినదినాభివృద్ధి చెందుతాడు. రోజుకి ఒకకళ చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తినాడు ఒక ముద్దతో మొదలు పెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమనాడు పదిహేను ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాడ్యమి నుంచి కళలు తరుగుతాయి. కనక రోజుకొకటిగా ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడవుతాడు. ఇదీ చాంద్రాయణ వ్రత నియమం.


ఒకరోజు పగటి భోజనం, మర్నాడు రాత్రి భోజనం, మూడవనాడు అయాచిత భోజనం, నాల్గవనాడు ఉపవాసం - దీన్ని పాద కృచ్ఛవ్రతమంటారు. ఇది నాల్గునాళ్ళ వ్రతం.


No comments:

Post a Comment