Saturday 11 November 2023

శ్రీ గరుడ పురాణము (1)

 


శ్రీకృష్ణ చంద్రపరబ్రహ్మణే నమః


గరుడ పురాణం


పురాణ పరిచయం


గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో 'పురాణం పంచలక్షణం' అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది :


సర్గో ఽస్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ 

వంశో వంశానుచరితం సంఖ్యాహేతు రపాశ్రయః॥

దశభిర్ల క్షణెర్వుక్తం పురాణం తద్విదో విదుః ।

కేచిత్పంచ విధం బ్రహ్మన్ మహదల్ప వ్యవస్థయా ॥ (భాగవతం: 12,7-9,10)


నిజానికి, ప్రతి పురాణంలోనూ, సర్గ ప్రతిసర్గవంశమన్వంతర వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే వుంటాయి. ఇక 'గరుడ పురాణం'లో 'భాగవత' కారులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి.


ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి.


ఆచారకాండ (కర్మకాండ)

ప్రేతకాండ (ధర్మకాండ)

బ్రహ్మ కాండ (మోక్షకాండ)


మొదటి కాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలిపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలోక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు.


ఆచారకాండ - 240 అధ్యాయాలు

ప్రేతకాండ - 50 అధ్యాయాలు

బ్రహ్మకాండ - 30 అధ్యాయాలు


ఇక ఆచారకాండలోని ఆధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. 


ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల – అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలూ, నరకానికి మార్గమూ, ప్రేత జీవనమూ, నారకీయ శిక్షలూ, స్వప్న శకునాలూ, అపరకర్మకాండాదులూ మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింప బడింది. ప్రేతాలు చెప్పిన స్వీయకథలూ ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది.


No comments:

Post a Comment