Thursday, 16 November 2023

శ్రీ గరుడ పురాణము (6)

 

గరుడ పురాణం


ఆచారకాండ


శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణేనమః


విష్ణుభగవానుని మహిమ అవతార వర్ణనం


భారతీయము, వైదికమునగు సాంప్రదాయంలో 'జయ' శబ్దానికి గల ఆధ్యాత్మి కార్ధము పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడంగాని చదవడంగాని మొదలు పెట్టినా ముందీశ్లోకాలుండాలి.


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం | 

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ |


నారాయణునికీ, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికీ, చదువుల తల్లి సరస్వతీ దేవికీ, వాఙ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి.


అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం 

శివమమలమనాదిం భూత దేహాది హీనం | 

సకల కరణ హీనం సర్వభూత స్థితం తం 

హరిమమల మమాయం సర్వగం వంద ఏకం ॥

నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం |

దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా॥


(ఆచార...1 /1,2)


పుట్టుకగాని ముసలితనముగాని లేని కల్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధచారిత్రుడు, అనాదియైన వాడు, పాంచభౌతికశరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానముకలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీ హరికీ, శివునికీ, బ్రహ్మకీ, గణేశునికీ, సరస్వతీ దేవికీ సర్వదా నమస్కరిస్తుంటాను.


ఇది పురాణ లేఖకుని వచనము.


ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము.


(' నైమిశారణ్యమనే మాట సరైనది కాదు.


* సంస్కృత వ్యాకరణంలో 'ఆదివృద్ధి' అని ఒక ప్రక్రియ వుంది. దీనిని బట్టి పదం మొదటిలో వుండే 'ఇ' 'ఆ పదానికి సంబంధించిన' అనే అర్థంలో 'ఐ' గా మారుతుంది.


శివ - శైవ, విష్ణు - వైష్ణవ, నిమిష - నైమిష)


No comments:

Post a Comment